Google Pay Convenience Fee | గూగుల్ పే యూజర్లకు హెచ్చరిక! ఇప్పటి వరకు గూగుల్ పే ప్లాట్‌ఫామ్‌లో యూపీఐ పేమెంట్స్‌ను పూర్తిగా ఉచితంగా అందించారు. కానీ ఇప్పుడు, యూనిఫైడ్ ఇంటర్‌ఫేస్ పేమెంట్స్ (యూపీఐ)పై గూగుల్ పే కన్వీనియెన్స్ ఫీజు వసూలు చేయనున్నట్లు సమాచారం వచ్చింది.
నేడు చాలా మంది విద్యుత్ బిల్లులు, గ్యాస్ బిల్లులు వంటి చిన్న చిన్న లావాదేవీలను (తక్కువ విలువ కలిగిన ఆర్థిక లావాదేవీలు) యూపీఐ ద్వారా చేస్తున్నారు. ఈ పరిస్థితిని పెట్టుకుని, గూగుల్ ఇప్పుడు ఈ లావాదేవీలపై ఫీజు వసూలు చేయడానికి సిద్ధమవుతోంది. ముఖ్యంగా క్రెడిట్ కార్డ్‌లు, డెబిట్ కార్డ్‌ల ద్వారా చేసే యూపీఐ పేమెంట్స్‌పై 0.5% నుంచి 1% వరకు కన్వీనియెన్స్ ఫీజు వసూలు చేయనున్నారు. దీనికి అదనంగా, వస్తు మరియు సేవల పన్ను (జీఎస్‌టీ) కూడా వసూలు చేయనున్నట్లు తెలుస్తోంది.
గతంలో.. గూగుల్ పే దాదాపు ఒక సంవత్సరం క్రితం మొబైల్ రీఛార్జ్‌ల కోసం రూ.3 కన్వీనియెన్స్ ఫీజు ప్రవేశపెట్టింది. ఇప్పుడు యూపీఐ పేమెంట్స్‌పై కూడా ఇలాంటి రుసుము వసూలు చేయడానికి సిద్ధమవుతోంది. భారతదేశంలోని యూపీఐ మార్కెట్ లో ఫోన్ పే అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. 37 శాతం వాటాతో గూగుల్ పే రెండో స్థానంలో ఉంది.
Also Read: నిమిషానికి 581 చాక్లెట్లు, 607 కేకులు.. వాలెంటైన్స్ డే ఈ కామర్స్ రికార్డ్ సేల్స్!
ఇప్పటికే ఫీజు వసూలు మొదలైందా?
ఇప్పటి వరకు గూగుల్ పే వెబ్ సైట్ పై ఉన్న సమాచారం ప్రకారం.. ఒక కస్టమర్ తన క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ఉపయోగించి విద్యుత్ బిల్లు, నీటి పన్ను, వంట గ్యాస్ సిలిండర్ లాంటి పేమెంట్స్ కోసం చెల్లింపులు చేస్తే.. వాటిపై రూ.15 కన్వీనియెన్స్ ఫీజు వసూలు చేసినట్లు తెలుస్తోంది. దీన్ని ప్రాసెసింగ్ ఫీజు గా పేర్కొన్నారు. అంతేకాకుండా.. అదనంగా జీఎస్‌టీ కూడా వసూలు చేసినట్లు ఉంది. అయితే ఈ కన్వీనియెన్స్ ఫీజు వసూలు చేయడం ఎప్పటి నుంచి మొదలు పెట్టిందో వెబ్ సైట్ లో సమాచారం లేదు.
మానిటైజేషన్ ప్రయత్నాలు
గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో యూపీఐ పేమెంట్స్‌కు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా లాక్ డౌన్ సమయం నుంచి ఈ యూపీఐ ప్లాట్ ఫామ్స్ వినియోగించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని, గూగుల్ కంపెనీ యూపీఐ పేమెంట్స్ లావాదేవీలను మానిటైజ్ చేయడానికి ప్లాట్‌ఫామ్స్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. సర్వీస్ ప్రొవైడర్లు ఆర్థిక లావాదేవీలను ప్రాసెస్ చేసేందుకు అయ్యే ఖర్చులను రాబట్టుకోవడం కోసం ఇలాంటి మార్గాలను అనుసరించడం సహజమేనని టెక్ నిపుణలు అభిప్రాయపడుతున్నారు. అయితే.. ఈ విషయంపై గూగుల్ పే నుంచి ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రతిస్పందన రాకపోవడం గమనార్హం.
గూగుల్ పే యూపీఐ పేమెంట్స్‌పై కన్వీనియెన్స్ ఫీజు వసూలు చేయడం ద్వారా, తన సేవలను మానిటైజ్ చేయడానికి ప్రయత్నిస్తోంది. ఇది యూజర్లకు అదనపు ఖర్చుగా మారవచ్చు. కాబట్టి, యూపీఐ పేమెంట్స్ చేసేటప్పుడు ఈ ఫీజుల గురించి తెలుసుకోవడం, ఇతర పేమెంట్ ఎంపికలను పరిశీలించడం మంచిది.