Bank Account New Rules:ఇప్పటి వరకు మనం బ్యాంక్ ఖాతాలో డబ్బు డిపాజిట్ చేయడమో లేదా తీసుకోవడమో, ఆన్‌లైన్‌లో ట్రాన్సాక్షన్లు చేయడమో తెలుసు. కానీ, ఒక విషయంలో మాత్రం చాలామందికి అసౌకర్యంగా ఉండేది. అదే నామినీ వ్యవస్థ. ఇప్పటివరకు ఒక్కరినే నామినీగా గుర్తించాలని ఉండేది. కానీ తాజాగా కేంద్ర ప్రభుత్వం నామినీల విషయంలో గుడ్ న్యూస్ ప్రకటించింది. రాజ్యసభ ఆమోదం పొందిన బ్యాంకింగ్ చట్టాలు (సవరణ) బిల్లు – 2024 ద్వారా ఇకపై మన ఖాతాలకు ఒక్క నామినీ కాదు, నలుగురు నామినీల వరకు చేర్చుకునే అవకాశం కల్పించారు.
అనేక ఉపయోగాలు
ఇది చిన్న మార్పు అనిపించినా, దీని వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయి. దీంతోపాటు నామినీ లేని డిపాజిట్లు క్రమంగా తగ్గిపోతాయి. అంతేకాదు కుటుంబ సభ్యుల మధ్య ఆస్తుల కోసం వచ్చే వివాదాలూ కూడా తగ్గే ఛాన్సుంది. ఈ క్రమంలో ఒక కుటుంబ సభ్యుడైన భర్త నామినీగా తన భార్య, తల్లి, పిల్లలు సహా మరో వ్యక్తిని కలిపి నలుగురిని ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఒకరు లేకపోయినా నలుగురిలో ఎవరైనా కూడా ఆ ఖాతాను నిర్వహించుకునే అవకాశం లభిస్తుంది.
పాత నిబంధనలు vs కొత్త నిబంధనలు
-పాత నిబంధన: ఒక బ్యాంక్ ఖాతాకు ఒక్క నామినీ మాత్రమే నియమించే అవకాశం ఉండేది.
-కొత్త నిబంధన: ఇప్పుడు ఒక ఖాతాకు నలుగురు నామినీల వరకు నియమించుకోవచ్చు.
నామినేషన్ రకాలు: రెండు ఆప్షన్లు
కొత్త నిబంధనల ప్రకారం, బ్యాంక్ ఖాతాదారులు రెండు రకాల నామినేషన్ విధానాలను ఎంచుకోవచ్చు:
1. సమాంతర నామినేషన్ (Simultaneous Nomination)
ఈ విధానంలో మీ ఖాతాలోని డబ్బును నామినీల మధ్య శాతం ఆధారంగా పంచవచ్చు. మీరే ఎవరికి ఎంత ఇవ్వాలో నిర్ణయించుకోవచ్చు.
ఉదాహరణ: మీ ఖాతాలో రూ.10 లక్షలు ఉన్నాయనుకుందాం. మీరు ముగ్గురు నామినీలను ఎంచుకుని, వారికి 40%, 30%, 30% చొప్పున పంచుకోవచ్చు.
నామినీ A: రూ.4 లక్షలు
నామినీ B: రూ.3 లక్షలు
నామినీ C: రూ.3 లక్షలు
2. క్రమానుసార నామినేషన్ (Successive Nomination)
ఈ విధానంలో నామినీలను క్రమంగా ఎంచుకోవచ్చు. మొదటి నామినీ అందుబాటులో లేకపోతే (ఉదా: మరణం), డబ్బు రెండో నామినీకి, ఆ తర్వాత మూడో నామినీకి వెళుతుంది. ఇలా మీ డబ్బు ఎప్పుడూ నమ్మకమైన వ్యక్తులకే చేరేలా చూస్తుంది.
బ్యాంక్ లాకర్ నామినేషన్‌లో మార్పులు
డిపాజిట్ ఖాతాల కోసం సమాంతర లేదా క్రమానుసార నామినేషన్ రెండూ అందుబాటులో ఉన్నప్పటికీ, బ్యాంక్ లాకర్ నామినేషన్ కోసం క్రమానుసార నామినేషన్ మాత్రమే అనుమతించబడుతుంది. అంటే, మొదటి నామినీ అందుబాటులో లేకపోతే, లాకర్ యాక్సెస్ తర్వాతి నామినీకి వెళుతుంది.
Read Also: Best Budget Tablets: రూ.19 వేల తగ్గింపుతో లెనోవో M11 …
అనామధేయ డిపాజిట్లపై ప్రభావం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గణాంకాల ప్రకారం, అనామధేయ డిపాజిట్లు మార్చి 2023లో రూ.62,225 కోట్ల నుంచి మార్చి 2024లో రూ.78,213 కోట్లకు పెరిగాయి. అంటే 26% వృద్ధి. అంటే ఒకే నామినీని ఎంచుకోవడం వల్ల చివరికి వారిద్దరూ కూడా లేకుండా ఆయా ఖాతాల్లో మిగిలిన మొత్తం డిపాజిట్లు ఇవి. ప్రస్తుతం కొత్త నామినేషన్ నిబంధనలు ఈ అనామధేయ డిపాజిట్లను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది ఆయా ఖాతాదారుల కుటుంబ సభ్యులకు డబ్బును సులభంగా, చట్టపరమైన ఇబ్బందులు లేకుండా అందించేందుకు సహాయపడుతుంది.
ఈ మార్పులు ఎందుకు ముఖ్యం?
మీ డబ్బు నమ్మకమైన వ్యక్తులకు చేరేలా చూస్తుంది. డబ్బును కుటుంబ సభ్యుల మధ్య పంచడం లేదా క్రమంగా అందించడం మరింత సులభం అవుతుంది. చట్టపరమైన సమస్యలు తగ్గుతాయి: నామినేషన్ స్పష్టంగా ఉంటే, డబ్బు బదిలీలో ఆలస్యం లేదా ఇబ్బందులు ఉండవు.