ఎలక్ట్రిక్ టూ వీలర్స్ విభాగంలో తనకంటూ ఓ బ్రాండ్ సృష్టించుకున్న ఓలా కంపెనీ ఇప్పుడు సూపర్ బైక్ తో వినియోగదారుల్ని ఆకట్టుకోడానికి సిద్ధమైంది. సహజంగా ఎలక్ట్రిక్ బైక్ లంటే స్పీడ్ విషయంలో అడ్డంకులు ఉంటాయని అనుకోవచ్చు. కానీ ఓలా ఈ అపోహను సరిచేస్తూ సూపర్ బైక్ ని తెరపైకి తెస్తోంది. కేవలం 2 సెకన్లలోనే సున్నా నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకునేలా దీన్ని డిజైన్ చేశారు. ఓలా డైమండ్‌హెడ్ ప్రోటోటైప్ గా దీన్ని పేర్కొంటున్నారు. ఫ్యూచరిస్టిక్ సూపర్‌బైక్ గా దీన్ని అభివర్ణిస్తున్నారు.
ధర రూ.5 లక్షలు..
మార్కెట్ లో ఇప్పుడున్న సూపర్ బైక్ లతో పోల్చి చూస్తే ధర పెద్ద ఎక్కువేం కాదు అని చెప్పుకోవచ్చు. ఎలక్ట్రిక్ వాహనాల్లో వస్తున్న తొలితరం సూపర్ బైక్ గా దీన్ని చెప్పుకోవచ్చు. దీని మోడల్ కూడా యునిక్ గా ఉంది. టెస్లా కార్ల లాగా ఓలా సూపర్ బైక్ ఓ ఆసక్తికర స్టైల్ లో బయటకు వస్తోంది. డైమండ్ హెడ్ డిజైన్ తో ఇది యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందని అంటున్నారు. 2027 ఏడాది మధ్యలో ఇది మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ బైక్ ధరను రూ.5 లక్షలుగా ప్రకటించారు. ఇది ఎక్స్ షోరూమ్ ధర. పన్నులు కలుపుకొంటే.. ఐదున్నర లక్షలు దాటిపోయే అవకాశం ఉంది. సూపర్ బైక్ రంగంలో దీన్ని గేమ్ ఛేంజర్ గా భావిస్తున్నారు.
ADAS, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, హబ్-కేంద్రీకృత స్టీరింగ్ దీని ప్రత్యేకతలు. అగ్మెంటెడ్ రియాల్టీతో కూడిన హెల్మెట్ దీనికి అదనపు ఆకర్షణ కాబోతోంది. ఇది ఇంకా ప్రయోగ దశలోనే ఉంది. రెండేళ్ల క్రితమే ఈ డైమండ్ హెడెడ్ బైక్ తయారీ కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇప్పుడిప్పుడే అవి తుది దశకు చేరుకుంటున్నాయి. అయినా తొలి బైక్ ని మాత్రం 2027 ఏడాది మధ్యలో మార్కెట్ లోకి తీసుకు రాబోతున్నారు.
స్పెసిఫికేషన్స్..
చక్కని కాంపాక్ట్ హెడ్‌ల్యాంప్‌తో జత చేసిన LED DRL ఉంది.
సన్నని LED లైట్ స్ట్రిప్‌తో కూడిన వెనుకభాగం షార్ప్ గా ఏరోడైనమిక్ గా ఉంటుంది.
బార్-ఎండ్ మిర్రర్లు, ఎక్స్ పోజ్డ్ సస్పెన్షన్ దీని ప్రత్యేకతలు
17-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉంటాయి
అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, అత్యవసర పరిస్థితులకోసం యాక్టివ్ బ్రేకింగ్
ప్రయాణంలో సర్దుబాటు చేసుకునే అడాప్టివ్ సస్పెన్షన్
లాంగ్ రైడ్స్‌లో మరింత సౌకర్యం కోసం యాక్టివ్ ఎర్గోనామిక్స్
అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్
ఏరోడైనమిక్స్‌ను పెంచడానికి వెనుక చక్రం కొంతవరకు కప్పబడి ఉంటుంది.
ఎత్తైన ట్యాంక్ మనకు స్పోర్ట్స్ బైక్ అనుభూతిని కలిగిస్తుంది.
ఇది కేవలం నగరాలకు మాత్రమే పరిమితమయ్యే బైక్ కాదు. హైవేలపై రయ్ మని దూసుకెళ్లేందుకు, లాంగ్ రైడ్లకు కూడా ఉపయోగంగా దీన్ని తీర్చిదిద్దారు. మైలేజీ విషయంలో మరింత స్పష్టత రావాల్సి ఉంది. సింగిల్ చార్జింగ్ తో ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించగలం, స్పీడ్ పెంచే కొద్దీ ఎంత త్వరగా చార్జింగ్ అయిపోతుంది అనే విషయాలు తేలాలి. దాదాపు రెండేళ్ల సమయం ఉంది కాబట్టి, ఈ లోగా మరిన్ని మార్పులు చేర్పులు జరుగుతాయని అంటున్నారు.