Stock Market: ఇండియన్ మార్కెట్ ఇండెక్స్ మళ్లీ నష్టాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు.. కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. ఇంట్రాడే గరిష్టాల నుంచి సెన్సెక్స్ ఒక దశలో 1200 పాయింట్లు పతనమైంది. ఎఫ్‌ఎంసీజీ, ఐటీ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి సూచీలపై ఎఫెక్ట్ చూపించింది. పీఎస్‌యూ బ్యాంక్స్, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు కూడా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. చివరకు నిఫ్లీ 157 పాయింట్ల నష్టంతో ముగియగా, సెన్సెక్స్ 547 పాయింట్లు పతనమైంది.
నిజానికి రూపాయి పతనానికి బ్రేకులు వేయడానికి RBI కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ రంగంలోని ఇండియన్ ఆయిల్, హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం కంపెనీలకు అవసరమైన డాలర్లను ప్రత్యేక ఏర్పాటుతో అందించనుంది. దీంతో ఈ కంపెనీలు మార్కెట్లో నేరుగా డాలర్లు కొనాల్సిన అవసరం తగ్గుతుంది. ఫలితంగా మార్కెట్లో డాలర్లకు పెరిగే డిమాండ్ ఆపొచ్చనేది RBI ఆలోచన. ఇక ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ పడిపోతుందని అంచనా వేస్తూ చేసే కొన్ని లావాదేవీలపైనా ఆర్బీఐ కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. కొన్ని డెరివేటివ్ లావాదేవీలకు 20 శాతం నగదు రిజర్వ్ తప్పనిసరి చేసింది. ఈ నిర్ణయాలతో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఒకేరోజు 90 పైసలు పెరిగింది. అయితే రూపీ హైజంప్ మదుపర్లపై ప్రభావం చూపించలేకపోయింది. దీంతో స్టాక్‌మార్కెట్లో రోజంతా అమ్మకాల ఒత్తిడే కనిపించింది.
నిజానికి రిటెయిల్ ఇన్‌ఫ్లేషన్ పెరిగిందన్న డేటానే మార్కెట్లపై ఎఫెక్ట్ చూపించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ద్రవ్యోల్బణం 5.54 శాతానికి పెరిగినట్టు ప్రభుత్వ గణాంకాలు తెలిపాయి. ఆగస్టు నెలలో రిటెయిల్ ద్రవ్యోల్బణం 4.83 శాతమే ఉంది. ఆహార పదార్ధాల ధరలు తీవ్రంగా పెరగడంతో సెప్టెంబర్‌లో ద్రవ్యోల్బణం కూడా పెరిగింది. ఇన్‌ఫ్లేషన్ గణాంకాలకు ఈ ఏడాది జనవరి నుంచి కొత్త విధానాన్ని కేంద్రం అనుసరిస్తోంది. ఈ విధానంలో గణాంకాలు విడుదల చేయడం మొదలుపెట్టాక ఈ స్థాయిలో ద్రవ్యోల్బణం నమోదు కావడం ఇదే తొలిసారి. ఈ డేటా విడుదల ప్రభావం స్టాక్‌మార్కెట్‌పై కనిపించింది అనుకోవాలి. ఎఫ్‌ఎంసీజీ స్టాక్స్‌లో అమ్మకాలు వెల్లువెత్తడమే ద్రవ్యోల్బణం ప్రభావానికి సాక్ష్యంగా చూడొచ్చు.
Also read: ఫార్ములా-ఈ రేస్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఏసీబీ కోర్టులో కేటీఆర్ డిశ్చార్జ్ పిటిషన్!