iPhone Gifts: కంపెనీ గ్రోత్ కోసం రాత్రింబవళ్లు కష్టపడే ఉద్యోగులను చాలామంది యజమానులు కేవలం జీతాల వరకే పరిమితం చేస్తారు. కానీ యూఏఈ (UAE) లో స్థిరపడిన ఒక భారతీయ దంపతులు మాత్రం.. తమ సిబ్బందిపై చూపించిన ప్రేమాభిమానాలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కేరళకు చెందిన ఈ ఎన్నారై బిజినెస్ జోడీ.. తమ ఉద్యోగులకు ఊహించని రీతిలో సరికొత్త ఐఫోన్లను బహుమతిగా ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు.
ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక వీడియోలో కంపెనీ అధినేత నిషాద్ హుస్సేన్ తన ఉద్యోగులందరినీ ఒకే చోటకు ఆహ్వానించారు. ఎదురుగా ఉన్న బల్లపై వరుసగా ప్యాక్ చేసి ఉన్న గిఫ్ట్ బాక్సులు ఉంచారు. అందులోంచి ఒక్కో ఉద్యోగి వచ్చి తమకు నచ్చిన బాక్స్‌ను ఎంచుకోవాలని చెప్పారు.
ఉద్యోగులు ఒక్కొక్కరుగా బాక్సులను ఓపెన్ చేయగా.. కొందరికి లేటెస్ట్ యాపిల్ ఐఫోన్లు (Apple iPhones) దక్కాయి. దాంతో వారు ఎగిరి గంతేంత ఆనందపడ్డారు. అయితే మరికొందరి బాక్సుల్లో మాత్రం కేవలం సాధారణ చాక్లెట్ బార్లు మాత్రమే వచ్చాయి. దీంతో చాక్లెట్లు వచ్చిన వారు కాస్త నిరాశ చెందుతున్నట్లు కనిపించారు.
అయితే కథ అక్కడితో ముగిసిపోలేదు. అందరూ గిఫ్ట్‌లు తీసుకున్నాక అసలైన ట్విస్ట్ రివీల్ చేశారు. చాక్లెట్లు వచ్చి డల్ అయిన ప్రతీ ఒక్క ఉద్యోగి చేతికి, ఆ తర్వాత నేరుగా బ్రాండ్ న్యూ ఐఫోన్ బాక్సులను తెచ్చి అందించారు. అందరికీ సమానంగా ఐఫోన్లు దక్కడంతో ఆ ప్రాంగణమంతా ఆనందంతో నిండిపోయింది. మొదట నిరాశపడి, ఆ తర్వాత చేతిలో ఐఫోన్ చూసుకున్న ఉద్యోగుల ముఖాల్లోని నవ్వులు నెటిజన్ల మనసులను గెలుచుకున్నాయి.
ఈ గిఫ్ట్ పంపిణీకి సంబంధించిన పూర్తి వీడియోను కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ (MD) హసీనా నిషాద్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ఒక భావోద్వేగపూరితమైన సందేశాన్ని రాసుకొచ్చారు. ‘మా కంపెనీ విజయమంతా ఉద్యోగుల కష్టం, వారి పాజిటివ్ మైండ్‌సెట్ పైనే ఆధారపడి ఉంది. ప్రతీ ఒక్కరి శ్రమ, ప్రతి ఆలోచన మమ్మల్ని ముందడుగు వేసేలా చేస్తున్నాయి. అందరూ తమలోని ప్రతిభను నమ్మి, మరిన్ని ఎత్తులకు ఎదగాలి. మా అసలైన బలం మా సిబ్బందే’ అని ఆమె పేర్కొన్నారు.
ఉద్యోగులకు ఐఫోన్లు గిఫ్ట్ ఇచ్చిన వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ దంపతుల ఉదారతపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘ఇది నిజంగా అద్భుతమైన క్షణం. ఉద్యోగులను ఇలా చూసుకునే ఓనర్లు దొరకడం వారి అదృష్టం’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ‘వారికి దక్కింది కేవలం ఐఫోన్ మాత్రమే కాదు. యాజమాన్యం వారిపై చూపిస్తున్న గౌరవం. మీ వర్క్ కల్చర్ చాలా గొప్పది’ అని మరొక నెటిజన్ కొనియాడారు. ‘మాకు ఇలాంటి సర్‌ప్రైజ్ ఇచ్చే బాస్ ఎప్పుడు దొరుకుతారో ఏంటో!’ అంటూ మరికొందరు సరదాగా కామెంట్లు చేశారు.
Also Read: పెళ్లికి నో చెప్పాడని.. పోలీసైన తండ్రినే కాల్చేశాడు.. 18 ఏళ్ల కొడుకు ఘాతుకం!
కేరళకు చెందిన నిషాద్ హుస్సేన్.. 2008లో సాధారణ ఉద్యోగ వేటలో భాగంగా యూఏఈకి వెళ్లారు. అక్కడ తన కష్టంతో ‘వరల్డ్ స్టార్ హోల్డింగ్’ (World Star Holding) అనే సంస్థను అబుధాబిలో ప్రారంభించారు. కాలక్రమేణా దాన్ని మల్టీ మిలియన్ డాలర్ల సామ్రాజ్యంగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం షార్జాలో మెయిన్ హెడ్‌క్వార్టర్స్‌తో నడుస్తున్న ఈ కంపెనీలో వేలాది మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఆయన భార్య హసీనా నిషాద్ కూడా కంపెనీ ఎండీగా బాధ్యతలు నిర్వర్తిస్తూ బిజినెస్ విస్తరణలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
?utm_source=ig_embed&ig_rid=A9VsWHdG6KpIYwq3bp5KI0M
Also Read: మీ ఫోన్ కెమెరా హ్యాకర్ల కంట్రోల్లోకి వెళ్లిందా? వెంటనే ఇలా కనిపెట్టండి.. లేదంటే డేంజరే!