Chandigarh Crime: చండీగఢ్ పోలీసు ప్రధాన కార్యాలయంలో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న నితిన్ సింగ్ తన ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యారు. సెక్టార్ 22లోని ప్రభుత్వ నివాసంలో తలకు తుపాకీ గాయంతో ఆయన పడివుండగా అధికారులు గుర్తించారు. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. నితిన్ సింగ్ తన 18 ఏళ్ల కుమారుడితో పెళ్లిపై చర్చించిన మరుసటి రోజే ఈ దారుణం చోటుచేసుకుంది. సంఘటనా స్థలం నుండి ఒక నాటు తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. కానిస్టేబుల్ కుమారుడు అర్మాన్ ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నానని, వెంటనే పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులపై తీవ్ర ఒత్తిడి తెచ్చాడు. అయితే చట్ట ప్రకారం 21 ఏళ్లు నిండిన తర్వాతే వివాహ వయసు వస్తుందని అప్పుడే పెళ్లికి అంగీకరిస్తామని నితిన్ సింగ్ తన కుమారుడికి స్పష్టం చేశారు. ఇందుకు ససేమీరా అన్న అర్మాన్.. ప్రేమించిన అమ్మాయిని ఇంటికి తీసుకొస్తానని.. అలాగే తన ఖర్చులకు డబ్బులు ఇవ్వాలని తండ్రిని పట్టుబట్టాడు. ఇందుకు తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో క్రమంలో వాగ్వాదం సైతం చోటుచేసుకుంది.
ఈ క్రమంలో ఒక్కసారిగా సహనం కోల్పోయిన అర్మన్.. తుపాకీ తీసుకొని ఒక్కసారిగా తండ్రిపై కాల్పులు జరిపాడు. అనంతరం తల్లిని గొంతు నులిమి హతమార్చేందుకు ప్రయత్నించాడని పోలీసు అధికారులు వెల్లడించారు. అయితే ఆమె చాకచక్యంగా తప్పించుకుని మేడపైకి పరుగెత్తి పొరుగువారిని కేకలు వేసి సాయం కోరింది. ఈ క్రమంలో చుట్టుపక్కల వారు ఇంట్లోకి రాగా.. తన తండ్రిని ఎవరో చంపి పారిపోయారని వారిని నమ్మించే ప్రయత్నం చేశాడు అర్మన్. విషయాన్ని గ్రహించిన స్థానికులు.. వెంటనే పోలీసులు సమాచారం ఇచ్చారు. పోలీసులు అర్మాన్ ను అరెస్టు చేయగా విచారణ సమయంలో అతడిలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదని ఏసీపీ తెలిపారు.
Also Read: రైలులో సైకో కిల్లర్.. ఖాకీ దుస్తుల్లో వచ్చి డ్రామాలు.. ప్రయాణికులను బయటకు తోసేస్తూ దారుణాలు!
కాగా, అర్మాన్ ఇప్పటికే ఓ కేసులో నిందితుడిగా ఉండి ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఏడాది ఆరంభంలో తన స్నేహితుడి మహీంద్రా థార్ వాహనాన్ని నడుపుతూ.. బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను తీవ్రంగా ఢీకొట్టాడు. ఆ ప్రమాదంలో ఆ ఇద్దరు సోదరులు అక్కడికక్కడే మరణించారు. ఆ హిట్ అండ్ రన్ కేసులో అరెస్ట్ అయిన అర్మాన్ కొద్దిరోజుల క్రితమే బెయిల్‌పై విడుదలయ్యాడు. బెయిల్‌పై బయట ఉన్న సమయంలోనే మళ్లీ ఈ ఘాతుకానికి ఒడిగట్టడం గమనార్హం.
Also Read: ఐరాస వేదికగా పాక్ పరువు తీసిన జైశంకర్.. ఆ దేశ విలేకరి ప్రశ్నకు దిమ్మతిరిగే కౌంటర్!