Israel Kills Gaza Civilians| గాజాలో మారణహోమం ఆగడం లేదు. ప్రతిరోజు ఇజ్రాయెల్ సైనికులు గాజాలోని పలు ప్రాంతాల్లో ఆకలితో అలమటిస్తున్న ప్రజలపై కాల్పులు చేస్తూనే ఉన్నారు. వారికి ఇతర దేశాల నుంచి అందే ఆహార, ఔషధ సాయం కూడా ఇజ్రాయెల్ ప్రభుత్వం అడ్డుకుంటోంది. మానవతా విలువలన్నీ ఇజ్రాయెల్ కాలరాస్తుంటే అంతర్జాతీయ సమాజం కనీసం విమర్శించడం కూడా లేదు. గాజా వాసులకు సాయం చేసేందుకు ఐక్యరాజ్య సమితి సేవకులు ముందు వస్తే వారిని కూడా ఇజ్రాయెల్ ఏదో ఒక కారణం చూపి హత్యలు చేసిన ఘటనలు కోకొల్లలు. పైకి మాత్రం ఇజ్రాయెల్ తమ ఆత్మరక్షణ కోసం చేస్తున్న కాల్పులు ప్రమాదవశాత్తు అమాయకులు చనిపోతున్నారని ఇవన్నీ యుద్ధంలో సాధారణమని ప్రతీసారి ప్రకటనలు చేసి తప్పించుకుంటోంది. అయితే.. తాజాగా స్వయంగా ఇజ్రాయెల్ సైనికులే తమ ప్రభుత్వం నిజస్వరూపాన్ని బయటపెట్టారు.
దీనికి సంబంధించిన ఇజ్రాయెల్ వార్తాపత్రిక హారెట్జ్ ప్రచురించిన ఒక నివేదిక ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగించింది. గాజాలో ఆహారం లేదా ఔషధ, మానవీయ సహాయం కోసం నిరాయుధంగా క్యూలో నిలబడిన పౌరులపై కాల్పులు జరపాలని తమ కమాండర్లు ఆదేశించారని కొంతమంది ఇజ్రాయెల్ సైనికులు బహిరింగంగా అంగీకరించారు. ఈ నివేదిక సైనికుల సాక్ష్యాల ద్వారా ధృవీకరించబడింది. ప్రస్తుతం సైన్యం దీనిపై విచారణ జరుపుతోంది. గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ (GHF) నడుపుతున్న సహాయ కేంద్రాలలో ఈ దారుణ ఘటనలు జరిగినట్లు తెలుస్తోంది.
హారెట్జ్ పత్రికతో సైనికులు మాట్లాడుతూ.. సహాయ కేంద్రాలలో సాయం కోసం నిలబడిన పౌరులపై యాదృచ్ఛికంగా కాల్పులు జరిపినట్లు చెప్పారు. చాలా మంది వృద్ధులు, మహిళలు, చిన్నారులు ఈ ఘటనలలో మరణించారు. ఒక సైనికుడు తాను చేసిన కృత్యాన్ని వివరిస్తూ.. “మేము ట్యాంకుల నుండి మెషిన్ గన్‌లతో కాల్పులు జరిపాము, గ్రనేడ్‌లు విసిరాము” అని చెప్పాడు. ఉదయం పొగమంచులో పౌరులు ముందుకు వచ్చినప్పుడు ఈ దాడులు జరిగాయి. మరో సైనికుడు.. “మేము ఉన్న ప్రాంతంలో రోజూ ఒకటి నుండి ఐదు మంది పౌరులు చనిపోయేవారు. ఇది ఒక హత్యాకాండ లాంటిది” అని చెప్పాడు. ఈ ఆదేశాలు.. ఎలా, ఎందుకు వచ్చాయో స్పష్టమైన నియమాలు లేకపోవడంతో సైనికులు కూడా గందరగోళంలో ఉన్నారు.
గాజా ప్రభుత్వ మీడియా కార్యాలయం ప్రకారం.. మే నెల నుండి GHF సహాయ కేంద్రాలలో 549 మంది పౌరులు చనిపోయారు. 4,066 మందికి పైగా గాయపడ్డారు. ఈ సంస్థ ఇజ్రాయెల్, అమెరికా ప్రభుత్వాల సహకారంతో ఏర్పాటైంది. అయితే.. ఇది ఐక్యరాష్ట్ర సమితి (UN) నియమాలకు విరుద్ధంగా పనిచేస్తోందని విమర్శలు వచ్చాయి. మెడిసిన్స్ సాన్స్ ఫ్రంటియర్స్ (MSF) అనే అంతర్జాతీయ వైద్య సంస్థ.. GHF పనితీరును “సహాయం పేరుతో హత్యలు” అని విమర్శించింది. ఐక్యరాష్ట్ర సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ ఈ దాడులపై అసహనం వ్యక్తం చేశారు. “గాజాలో సహాయక శిబిరాలు సురక్షితంగా లేవు. ప్రజలను ఆదుకోవడం కాదు, చంపడం జరుగుతోంది,” అని ఆరోపించారు.
ప్రజల నియంత్రణ కోసమే కాల్పులు
హారెట్జ్ నివేదిక రచయిత నీర్ హాసన్, అల్ జజీరాతో మాట్లాడుతూ.. ఈ కాల్పులు యాదృచ్ఛికం కాదని, పౌరుల కదలికలను “నియంత్రించడానికి” ఉద్దేశ్యపూర్వకంగా ఒక ప్రణాళికపరంగానే జరిగాయని చెప్పారు. నిరాయుధ పౌరులు ఎలాంటి ప్రమాదం కలిగించనప్పటికీ.. వారిని చెదరగొట్టడానికి కాల్పులు జరిపారని తెలిపారు. ఈ ఆదేశాలు సీనియర్ సైనిక అధికారుల నుండి వచ్చినట్లు హాసన్ అనుమానం వ్యక్తం చేశారు.
ఖండించిన ఇజ్రాయెల్ సైన్యం
ఇజ్రాయెల్ సైన్యం ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. “పౌరులపై ఉద్దేశపూర్వకంగా కాల్పులు జరిపినట్లు ఆరోపణలను మేము తిరస్కరిస్తున్నాం” అని పేర్కొంది. ఈ ఘటనలపై విచారణ జరుగుతోందని, అవి యుద్ధ నేరాల కిందకు వస్తాయా అని పరిశీలిస్తున్నట్లు తెలిపింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ కూడా ఈ ఆరోపణలను అధికారికంగా ఖండించారు.
Also Read: రూ.5 కోట్లు పరిహారం చెల్లించండి.. పోలీసులపై కేసు పెట్టిన పౌరుడు
గాజాలో ఆరోగ్య సంక్షోభం
గాజాలో శుద్ధమైన నీరు, పారిశుద్ధ్యం, ఇంధనం లేకపోవడం వల్ల అనేక వ్యాధులు వ్యాపిస్తున్నాయని ఐక్యరాజ్య సంస్థలు తెలిపాయి. గత రెండు వారాల్లో 19,000 కంటే ఎక్కువ డయేరియా కేసులు, 200 కంటే ఎక్కువ జాండిస్, రక్తస్రావ డయేరియా కేసులు నమోదయ్యాయి. ఈ సమస్యలను నివారించడానికి తక్షణ సహాయం అవసరమని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది.