ఇది స్పీడ్ యుగం, ఏదైనా క్షణాల్లో జరిగిపోవాల్సిందే. గతంలో బ్యాంక్ ట్యాన్సాక్షన్లకోసం క్యూలైన్లలో గంటలు గంటలు వేచి చూడాల్సి వచ్చేది. మొబైల్ బ్యాంకింగ్ తో ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. యూపీఐ పేమెంట్స్ వ్యవస్థ వచ్చిన తర్వాత అన్నీ క్షణాల్లో జరిగిపోతున్నాయి. అయితే అందులో కూడా జెట్ స్పీడ్ రాబోతోంది. యూపీఐ పేమెంట్స్ కి పట్టే సమయాన్ని సగానికి సగం తగ్గించేందుకు సాఫ్ట్ వేర్ అప్ డేట్ అయింది. ఈరోజు (జూన్-16) నుంచే ఈ మార్పు అమలులోకి వచ్చింది.
30 సెకన్ల నుంచి 15 సెకన్లు..
యూపీఐ పేమెంట్స్ కి సంబంధించిన టెక్నాలజీని పెద్ద ఎత్తున అప్ గ్రేడ్ చేశారు. దీని ఫలితంగా లావాదేవీలు సూపర్ ఫాస్ట్ అవుతున్నాయి. యూపీఐ పేమెంట్ ని మనం స్టార్ట్ చేస్తే ముందుగా క్యూఆర్ కోడ్ స్కాన్ జరుగుతుంది. లేదా బ్యాంక్ ద్వారా మనం చెల్లించాల్సిన అకౌంట్ నెంబర్ ముందుగా ధృవీకరిస్తారు. ఆ తర్వాత మన బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు ట్రాన్స్ ఫర్ అవుతాయి. ఈ మొత్తం ప్రాసెస్ కి గరిష్టంగా 30 సెకన్ల టైమ్ పట్టేది. ఇకపై అది కేవలం 15 సెకన్లకు పరిమితం అవుతుంది. ఇక్కడ లావాదేవీలను చెక్ చేయడం, చిరునామా ధృవీకరణ 10 సెకన్లకే పరిమితం కావడం మరో విశేషం. యూపీఐ ట్రాన్సాక్షన్లు ఆలస్యం కావడం ఇక ఉండదు. ఈమేరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) UPI వేగాన్ని 66 శాతం వరకు పెంచింది.
ఇక యూపీఐ చెల్లింపుల్లో మరో ప్రధాన మార్పు కూడా వినియోగదారుల సౌలభ్యాన్ని పెంచబోతోంది. యూపీఐ చెల్లింపుల్లో ఇప్పటి వరకు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినా, లేక ఫోన్ నెంబర్ ఎంటర్ చేసినా.. వారు నమోదు చేసిన పేరు మాత్రమే మనకు డిస్ ప్లే అవుతుంది. బ్యాంక్ అకౌంట్ ఎవరిపేరుతో ఉందో అది కచ్చితంగా చూపించదు. ఇలాంటి సమస్యలు కూడా ఇకపై ఉండవు. ఇకపై మనం క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే.. దానికి లింక్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఏ పేరుతో ఉందో అదే పేరు మనకు కనపడుతుంది. ఫోన్ నెంబర్లు ఎంటర్ చేసినా ఇదే పద్ధతి. అంటే.. మనం డబ్బులు ఎవరికి ట్రాన్స్ ఫర్ చేస్తున్నామో మనకు కచ్చితంగా తెలుస్తుంది. నిక్ నేమ్స్, మన కాంటాక్ట్ లో ఉన్న పేర్లు ఇకపై డిస్ ప్లే కావు.
యూపీఐ లావాదేవీల విషయంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్ డేట్స్ తో వినియోగదారులకు మెరుగైన సౌకర్యాలు అందిస్తోంది. లావాదేవీల స్పీడ్ పెంచడంతోపాటు, కచ్చితత్వం కూడా తప్పనిసరి చేసింది. అంటే ఇకపై యూపీఐ లావాదేవీల్లో ఎలాంటి తప్పులు జరగవు అన్నమాట. మనకై మనం తప్పులు చేస్తే మాత్రం సరైన అకౌంట్ లో డబ్బులు జమకావు. సిస్టమ్ మిస్టేక్స్ ని జీరో పర్సెంట్ కి చేర్చబోతున్నారు. ఈ ప్రయోజనాలు Google Pay, PhonePe, Paytm UPI, Bhim, WhatsApp UPI తోపాటు అన్ని UPI సర్వీస్ ప్రొవైడర్లు అందుబాటులోకి తెస్తున్నాయి.