Urban Company Insta Maid| ఆన్‌లైన్ డెలివరీ సేవలు ఇప్పుడు సర్వసాధారణమై, మనిషి రోజువారీ జీవితంలో భాగమైపోయాయి. ఆహారం డెలివరీతో ప్రారంభమైన ఈ సేవలు.. కిరాణా వస్తువులతో పాటు అనేక రకాల ఉత్పత్తులు, సేవలను కూడా కొన్ని నిమిషాల్లో ఇంటి ముంగిటికే చేర్చే స్థాయికి వచ్చాయి. ఈ సేవలు ఇక్కడే ఆగిపోవడం లేదు.
ఇటీవల, ప్రముఖ హోమ్ సర్వీసెస్ సంస్థ అయిన అర్బన్ కంపెనీ, ‘ఇన్‌స్టా మెయిడ్స్ / ఇన్‌స్టా హెల్ప్’ అనే కొత్త సేవను ప్రారంభించింది. ఈ సేవ ద్వారా, 15 నిమిషాల్లో పనిమనిషి మీ ఇంటి ముంగిటికి వస్తారు. ఈ సర్వీస్ ప్రారంభించడంతో.. అర్బన్ కంపెనీ తన ఆన్‌లైన్ సేవలను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ విషయాన్ని కంపెనీ తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ప్రకటించింది.
Also Read: ఆడవారికి బెస్ట్ బిజినెస్..ఇంట్లోనే ఉంటూ, నెలకు రూ. 75 వేలు సంపాదించే ఛాన్స్
“అర్బన్ కంపెనీలో, మా సేవా భాగస్వాముల శ్రేయస్సుకు మేము కట్టుబడి ఉన్నాము. ఈ కొత్త సేవలో, భాగస్వాములు ఉచిత ఆరోగ్య బీమా, ఆన్-ది-జాబ్ లైఫ్ & యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ తో పాటు గంటకు రూ. 150-180 సంపాదిస్తారు. నెలకు 132 గంటలు (22 రోజులు × రోజుకు 6 గంటలు) పనిచేసే భాగస్వాములకు నెలకు కనీసం రూ. 20,000 ఆదాయం లభిస్తుంది” అని కంపెనీ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ వెంటనే వైరల్ అయ్యి, నెటిజన్ల నుండి వివిధ రకాల ప్రతిస్పందనలు వచ్చాయి. ఆన్‌లైన్ సేవలకు ఇది ఒక పరాకాష్ట అని అనేకులు వ్యాఖ్యానించారు.
అర్బన్ కంపెనీ ఇప్పటికే ఇంట్లో ఎలెక్ట్రీషియన్, ఏసీ సర్వీసింగ్, ఇల్లు మారేందుకు ప్యాకింగ్ అండ్ మూవింగ్ వంటి సర్వీసులు అందిస్తోంది.
ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ రంగంలోకి ర్యాపిడో!
మరోవైపు, బైక్ టాక్సీ ప్లాట్‌ఫామ్ అయిన ర్యాపిడో (Rapido) కూడా కొత్త వ్యాపార రంగంలోకి ప్రవేశించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రైడ్‌లు మాత్రమే అందించే ర్యాపిడో యాప్, తన వ్యాపార విస్తరణలో భాగంగా ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ రంగంలోకి అడుగుపెట్టే ప్రణాళికలు చేస్తోంది. ఈ మేరకు, ర్యాపిడో సంస్థ ప్రతినిధులు ఇటీవలే అనేక రెస్టారెంట్ల నిర్వాహకులతో సమావేశమై, ఈ విషయంపై చర్చలు జరిపినట్లు జాతీయ మీడియా నివేదికలు తెలిపాయి. ప్రస్తుతం ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ మార్కెట్‌లో జొమాటో (Zomato) మరియు స్విగ్గీ (Swiggy) ప్లాట్‌ఫామ్‌లు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. వీటి కమిషన్ నిర్మాణాన్ని సవాలు చేయడం ర్యాపిడో యొక్క లక్ష్యంగా ఉందని తెలుస్తోంది. 2015లో బైక్ టాక్సీ ప్లాట్‌ఫామ్‌గా తన కార్యకలాపాలను ప్రారంభించిన ర్యాపిడో, ఒక దశాబ్దంలోనే దేశంలో రైడ్ షేరింగ్ రంగంలో రెండవ స్థానాన్ని ఆక్రమించుకుంది. ఇప్పుడు సంస్థ తన వృద్ధి ప్రణాళికలో భాగంగా ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ రంగంపై దృష్టి పెట్టింది.