Black Monday: “బ్లాక్” అనే పదం వినగానే అనేక మందికి వెంటనే గుర్తుకొచ్చేది బ్లాక్ ఫ్రైడే. ఈ రోజున షాపింగ్ ప్రియులు ఉత్కంఠగా ఎదురుచూస్తూ, భారీ డిస్కౌంట్లు అందుకునేందుకు స్టోర్లకు క్యూ కడతారు. కానీ ఒక్కసారి ఈ పదానికి వెనుక మరో కోణాన్ని పరిశీలించండి. అదే “బ్లాక్ మండే”. కానీ ఇది షాపింగ్‌కి సంబంధించింది కాదు. అసలు దీనిలో సంతోషమే లేదు. ఇది పూర్తిగా వ్యాపార, పెట్టుబడి ప్రపంచాన్ని ఒక్కసారిగా హెచ్చరించిన రోజు, స్టాక్ మార్కెట్లు నలిగిపోయిన రోజు. ఈ రోజు పేరు వినగానే స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారుల గుండెల్లో వణుకు పట్టడం ఖాయం. ఎందుకంటే ఈ ‘బ్లాక్ మండే’ అనేది కేవలం ఒక మార్కెట్ పతనం రోజే మాత్రమే కాదు. అది ఆర్థిక చరిత్రలో ముద్ర వేసిన రోజుగా నిలిచిపోయింది. అయితే ఒకరోజులో లక్షల మంది పెట్టుబడిదారుల భవిష్యత్తును మార్చేసిన ‘బ్లాక్ మండే’ స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బ్లాక్ మండే అంటే ఏంటి?
అక్టోబర్ 19, 1987 ఈ తేదీ స్టాక్ మార్కెట్ చరిత్రలో చిరస్థాయిగా గుర్తుండిపోయే రోజు. అదే ‘బ్లాక్ మండే’. ఆ రోజు అమెరికా స్టాక్ మార్కెట్ డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఒకే రోజులో 22.6% కుప్పకూలింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లు ఈ దెబ్బను భరించలేక కొంతకాలం గందరగోళంగా మారాయి. ట్రిలియన్ల విలువైన మొత్తం నష్టపోయింది. ఈ రోజు తర్వాత మార్కెట్లు మళ్లీ కోలుకోవడానికి చాలా నెలల సయమం పట్టింది.
మళ్లీ వార్తల్లోకి
ఈ ఘటన తరువాత, ఏ రోజైనా మార్కెట్లు ఒక్కసారిగా పడిపోయినప్పుడు, ‘బ్లాక్ మండే’ అనే పదం మళ్లీ వినిపించడం సాధారణంగా మారింది. కానీ ఇప్పుడు ఈ పదం నిజంగా తిరిగి వార్తల్లోకి వచ్చింది. దానికి కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న ఆర్ధిక విధానాలు.
Read Also: LPG Gas: సామాన్యులకు షాకిచ్చిన ప్రభుత్వం..ఎల్పీజీ గ్యాస్ …
ఏం జరుగుతోంది ఇప్పుడు
ఏప్రిల్ 4, 2025 – ఈ రోజు అమెరికా స్టాక్ మార్కెట్లు కోవిడ్-19 తర్వాత అత్యంత దారుణమైన పతనాన్ని చూసిన రోజు. కొన్ని గంటల్లోనే US స్టాక్ మార్కెట్లు $5 ట్రిలియన్లకు పైగా విలువను కోల్పోయాయి. దీనికి కారణం ట్రంప్ తీసుకొచ్చిన భారీ సుంకాల విధానం. అమెరికా 180 దేశాలపై వాణిజ్య సుంకాలను విధించడం వల్ల గ్లోబల్ ట్రేడ్ వాతావరణం అస్థిరంగా మారింది. దీంతో ఆసియా, యూరప్ మార్కెట్లు కూడా ప్రభావితమయ్యాయి. జపాన్, తైవాన్ మార్కెట్లు సర్క్యూట్ బ్రేకర్ స్థాయికి పడిపోయాయి. టోక్యో నిక్కీ 225 సూచీ 18 నెలల కనిష్టానికి చేరింది. మూడు రోజుల్లో బ్యాంకింగ్ స్టాక్స్ దాదాపు 25% నష్టపోయాయి.
భవిష్యత్తులో మరిన్ని
భారత మార్కెట్లు కూడా దాంతో పాటు దెబ్బతిన్నాయి. ప్రీ ఓపెన్ ట్రేడింగ్‌లో సూచీలు 5% కంటే ఎక్కువ పడిపోయాయి. మార్కెట్ అస్థిరత సూచించే ఇండియా VIX సూచీ 56% పైగా పెరిగింది. ఇది భవిష్యత్తులో మరిన్ని పతనాలను సూచించే సంకేతం.
నిపుణులు ఏమంటున్నారు?
ప్రసిద్ధ మార్కెట్ విశ్లేషకుడు జిమ్ క్రామెర్ ఏప్రిల్ 6న ఇచ్చిన హెచ్చరిక చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ సుంకాలను ఉపసంహరించకపోతే, లేదా కనీసం న్యాయంగా వ్యవహరించే దేశాలను ప్రోత్సహించకపోతే, 1987లో జరిగిన బ్లాక్ మండే మాదిరిగానే మరో భారీ క్రాష్ ఎదురవుతుందని ఆయన అన్నారు. మూడు రోజులు మార్కెట్లు పడిపోయాక, నాలుగో రోజు సోమవారం 22% పడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఎందుకు మళ్లీ బ్లాక్ మండే పేరు చర్చలోకి వచ్చింది?
మార్కెట్లు బాగా ప్రవర్తించకపోయినప్పుడు, ముఖ్యంగా ఒక్కరోజులో భారీ పతనాలు జరిగితే, చరిత్రను గుర్తుచేసుకుంటారు. బ్లాక్ మండే 1987 ఘటనను ఇప్పటి పరిస్థితులకు పోలుస్తూ నిపుణులు, విశ్లేషకులు చర్చిస్తున్నారు. అందుకే “బ్లాక్ మండే 2.0 వస్తుందా?” అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
పతనంతోపాటు ఉద్యోగాలు
ప్రస్తుతం ట్రేడర్లు, పెట్టుబడిదారులు, దేశాల ఆర్ధిక వ్యవస్థలన్నీ ఆందోళనలో ఉన్నాయి. దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు ఉద్రిక్తతకు దారితీస్తే, పెట్టుబడుల ప్రవాహం నిలిచిపోతే, మార్కెట్లు పతనంతోపాటు ఉద్యోగాలు, వ్యాపారాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.