Senior Employees Corporate layoffs in India| ఈ రోజుల్లో పెద్ద పెద్ద కంపెనీల్లో సైతం ఉద్యోగానికి గ్యారెంటీ లేదు. ఒక్కసారిగా సాయంత్రం వేళ ఒక మీటింగ్ పెట్టి వందల సంఖ్యలో ఉద్యోగులను తొలగించేస్తున్నారు. లేదా ఒక ఈ మెయిల్ పంపి వేల సంఖ్యలో లేఆఫ్స్ జరుగుతున్నాయి. ఈ పరిస్థితి ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన ఉద్యోగులకు ఎదురవుతోంది. దీంతో సీనియర్ ఉద్యోగుల్లో మరింత ఆందోళన కలిగించే విషయం. ఇటీవల Oracle, Adidas వంటి మల్టీనేషనల్ కంపెనీల్లో ఉద్యోగాల కోతలు ఈ చర్చను మరింత పెంచాయి. అయితే 45 ఏళ్ల వయసును లేఆఫ్‌కు నిర్ణీత వయసుగా కంపెనీలు పెట్టుకున్నాయా అనే వాదన నిజమేనా అని ఒకసారి పరిశీలిద్దాం.
ఒరాకిల్ ఇండియాలోని కొన్ని టీమ్స్ లో ఉద్యోగాల కోతలు జరిగినట్లు నివేదికలు వచ్చాయి. ముఖ్యంగా ప్రొడక్ట్ ఇంజినీరింగ్ విభాగాలు ప్రభావితమైనట్లు సమాచారం. అయితే భారత్‌లో ఎంతమంది ఉద్యోగులు ప్రభావితమయ్యారో ఒరాకిల్ అధికారికంగా వెల్లడించలేదు. ఇదే సమయంలో ఒరాకిల్ ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సెంటర్లలో భారీగా పెట్టుబడులు పెడుతోంది. మే 2026 నాటికి కంపెనీ గ్లోబల్ ఉద్యోగుల సంఖ్య సుమారు 1.62 లక్షల నుంచి 1.41 లక్షలకు తగ్గినట్లు నివేదికలు చెబుతున్నాయి.
Adidas తన ఇండియా బిజినెస్.. టెక్నాలజీ విభాగంలో మార్పులు చేపట్టింది. గురుగ్రామ్ టెక్ హబ్‌లో దాదాపు సగం ఉద్యోగాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి.
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, డేటా సైంటిస్టులు, డేటా ఇంజినీర్ల ఉద్యోగాలు ప్రమాదంలో ఉన్నట్లు సమాచారం. అయితే ఈ సంఖ్యను Adidas అధికారికంగా ధృవీకరించలేదు. మారుతున్న వ్యాపార అవసరాలకు అనుగుణంగా కొన్ని టెక్నాలజీ ఉద్యోగాలను తగ్గించినట్లు కంపెనీ తెలిపింది.
Oracle, Adidas కంపెనీల్లో జరిగిన లేఆఫ్స్ ఘటనలు కంపెనీ బిజినెస్ పరంగా పెద్ద మార్పులో భాగం మాత్రమే. Layoffs.fyi ప్రకారం.. సెప్టెంబర్ 10, 2026 నాటికి ప్రపంచవ్యాప్తంగా 299 కంపెనీల్లో 1,28,536 టెక్నాలజీ జాబ్స్ పోయాయి. 2025 మొత్తం నమోదైన 1,22,606 ఉద్యోగాల కోతలను ఈ సంఖ్య ఇప్పటికే దాటింది. కంపెనీలు.. ఖర్చుల తగ్గింపు, పునర్వ్యవస్థీకరణ, వ్యాపార మార్పులు, AI పెట్టుబడులను కారణాలుగా చూపిస్తున్నాయి.
40 ఏళ్లు దాటిన ఉద్యోగులకు సాధారణంగా 15 నుంచి 20 ఏళ్ల అనుభవం ఉంటుంది. వారు సీనియర్ పదవుల్లో ఉండటంతో ఎక్కువ జీతాలు కూడా పొందుతుంటారు. పునర్వ్యవస్థీకరణ సమయంలో కంపెనీలు మేనేజ్‌మెంట్ లెవెల్స్ తగ్గించవచ్చు. కొన్ని పనులను AI, ఆటోమేషన్ ద్వారా నిర్వహించవచ్చు. అందువల్ల వయసు ఒక్కటే కారణం కాకపోయినా, సీనియారిటీ, జీతం, నైపుణ్యాలు కలిసి ప్రభావం చూపవచ్చు.
అనుభవం ఉద్యోగులకు పరిశ్రమపై లోతైన అవగాహనను ఇస్తుంది. అయితే అనుభవం ఒక్కటే భవిష్యత్ ఉద్యోగ భద్రతకు సరిపోదు. AI ఇప్పుడు కోడింగ్, టెస్టింగ్, రీసెర్చ్, రిపోర్టింగ్, డాక్యుమెంటేషన్ వంటి పనుల్లో ఉపయోగపడుతోంది. అందుకే అనుభవంతో పాటు కొత్త టెక్నాలజీలను నేర్చుకోవడం చాలా ముఖ్యంగా మారింది.
25 ఏళ్ల వయసులో ఉద్యోగం కోల్పోవడం, 45 ఏళ్ల వయసులో ఉద్యోగం కోల్పోవడం ఒకేలా ఉండదు. 40లలో ఉన్నవారికి హోమ్ లోన్స్, పిల్లల చదువులు, తల్లిదండ్రుల బాధ్యతలు ఉండవచ్చు.
అందువల్ల మరో ఉద్యోగాన్ని సమానమైన జీతంతో పొందడం వారికి ముఖ్యమైన అంశంగా మారుతుంది.
Also Read: ఐఫోన్ 18 ప్రో తక్కువ ధరలో కావాలా? ఈ దేశాల్లో కొంటే ఇండియా కంటే చీప్
కంపెనీలు AIతో ఉత్పాదకతను పెంచాలని చూస్తున్నాయి. అదే సమయంలో డేటా, ఆటోమేషన్, AI వంటి రంగాల్లో కొత్త ఉద్యోగాలు కూడా వస్తున్నాయి. అందువల్ల 40లలో ఉన్న ఉద్యోగులు కొత్త టూల్స్ నేర్చుకోవడం అవసరం. AIతో పోటీ పడటం కంటే, దాన్ని సమర్థంగా ఉపయోగించడం వారికి ఉపయోగపడుతుంది.
Also Read: మానవాళికి పెను ప్రమాదం పొంచి ఉందా? రానున్న 90 వేల కోట్ల ఏఐ ఏజెంట్లు ప్రపంచ జనాభా కంటే ఎక్కువ..
ప్రస్తుతం 45 ఏళ్లను నిర్ణీత లేఆఫ్ వయసుగా కంపెనీలు ఉపయోగిస్తున్నాయనే ఆధారాలు లేవు. అసలు మార్పు వయసు కంటే వ్యాపార విధానాలు, AI, ఆటోమేషన్, పునర్వ్యవస్థీకరణలో కనిపిస్తోంది.
అనుభవం ఇప్పటికీ విలువైనదే. అయితే మారుతున్న ఉద్యోగ మార్కెట్‌లో కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటూ ముందుకు సాగడం మరింత అవసరంగా మారుతోంది.