RTA Offices: స్వేచ్ఛ బ్యూరో: రవాణాశాఖలో కొందరు సిబ్బంది ఏళ్ల తరబడి ఒకే కార్యాలయంలో పాతుకుపోయారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒకటి రెండేళ్లు కాదు.. ఏకంగా తొమ్మిదేళ్లుగా ఒకే చోట విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఉన్నారన్న ఫిర్యాదులు కలకలం రేపుతున్నాయి. 2017 నుంచి ఒకే కార్యాలయంలో కొనసాగుతున్న సిబ్బందిపై ఉన్నతాధికారులు ఎందుకు దృష్టి సారించలేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీర్ఘకాలంగా ఒకే చోట పనిచేయడం వల్ల స్థానికంగా పరిచయాలు, ప్రభావం పెరిగి.. కార్యాలయంలోని వ్యవహారాలపై వారి పట్టు పెరిగిందని, అధికారులు సైతం వారి మాటే వింటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణంగా ఉద్యోగుల బదిలీలు, స్థానచలనాల ద్వారా పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచాల్సి ఉంది. అయినప్పటికీ ఉన్నతాధికారులు మాత్రం చోద్యం చూస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
డాక్యుమెంట్ల పేరుతో కొర్రీలు?
వాహనాల రిజిస్ట్రేషన్, బదిలీలు, లైసెన్సులు, పర్మిట్లు తదితర పనుల కోసం కార్యాలయాలకు వచ్చే ప్రజలకు పత్రాలు సక్రమంగా లేవంటూ కానిస్టేబుల్స్ పదేపదే కొర్రీలు పెడుతున్నారన్న ఫిర్యాదులు ఉన్నాయి. నిబంధనల ప్రకారం అవసరమైన పత్రాలు సమర్పించినప్పటికీ చిన్నచిన్న లోపాలను చూపిస్తూ పనులను ఆలస్యం చేస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. ఈ ప్రక్రియలో ‘చేతివాటం’ ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలపైనా సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.
‘చక్రం’ తిప్పుతున్న సిబ్బంది?
కొన్ని కార్యాలయాల్లో కానిస్టేబుళ్లు, హోంగార్డుల వ్యవహారశైలిపై కూడా ఫిర్యాదులు వస్తున్నాయి. 2017 నుంచి కానిస్టేబుళ్లకు బదిలీలు లేవు. 10 ఏళ్లకు పైగా హోంగార్డులకు బదిలీలు లేవు. కొంతమంది అయితే పోస్టింగ్ వచ్చిన దగ్గర నుంచి ఒకే ఆర్టీఏ కార్యాలయంలో పనిచేస్తున్నారని సమాచారం. తమకు అప్పగించిన విధులను మించి కార్యాలయంలోని కీలక వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎవరి పని ఎక్కడ ఆగాలి? ఏ దరఖాస్తు ముందుకు వెళ్లాలి? ఎవరిని కలవాలి? వంటి విషయాల్లోనూ కొందరు సిబ్బంది ప్రభావం చూపుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
డబ్బులు లెక్కిస్తున్న వీడియో కలకలం
ఇటీవల హైదరాబాద్ బండ్లగూడ ఆర్టీవో కార్యాలయంలో అవినీతి ఆరోపణలు, మధ్యవర్తుల ప్రాబల్యంపై ఓ వీడియో కలకలం సృష్టిస్తోంది. ఓకానిస్టేబుల్ తన ఛాంబర్‌లో డబ్బులు లెక్కిస్తున్నదృశ్యాలతో కూడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అయితే ఆ నగదు ఎవరిది? ఎక్కడి నుంచి వచ్చింది? ఏ పని కోసం తీసుకున్నారు? ఎందుకు కార్యాలయంలోనే లెక్కిస్తున్నారు? అనే ప్రశ్నలకు మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. వీడియోలో కనిపిస్తున్న నగదుకు, ఆర్టీవో కార్యాలయంలో జరుగుతున్న ఆరోపణలకు నేరుగా సంబంధం ఉందనే ప్రచారం జరుగుతుంది.వీడియో నిజమైనదే అయితే దాని పూర్తి నేపథ్యాన్ని, అందులో కనిపిస్తున్న వ్యక్తుల పాత్రను శాఖాపరంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది.
బాధితులే వీడియోలు తీస్తున్నారా?
తమను కార్యాలయంలో ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తున్న కొందరు బాధితులు స్వయంగా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఈ వీడియోలు ఇప్పుడు అధికారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. నిజంగానే నిబంధనలకు విరుద్ధంగా డబ్బుల వసూళ్లు జరుగుతున్నాయా? మధ్యవర్తుల ద్వారా మాత్రమే పనులు సులభంగా పూర్తవుతున్నాయా? కార్యాలయంలోని సిబ్బందికి ఈ వ్యవహారాలతో సంబంధం ఉందా? అన్న అంశాలపై సమగ్ర విచారణ జరిగితే అసలు విషయం బయటకు వచ్చే అవకాశం ఉంది.
అధికారులపై అనుమానాలు
ఏళ్ల తరబడి ఒకే చోట పనిచేస్తున్న సిబ్బంది వ్యవహారశైలిపై ఫిర్యాదులు వస్తున్నప్పటికీ సంబంధిత ఉన్నతాధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కార్యాలయంలో రోజువారీగా జరిగే కార్యకలాపాలు అధికారుల పర్యవేక్షణలోనే ఉండాలి. కార్యాలయంలోని ప్రతి వ్యవహారం అధికారుల దృష్టికి వస్తున్నా పట్టించుకోవడం లేదా? లేక స్థానిక సిబ్బంది ప్రభావానికి అధికారులు లోనవుతున్నారా? అనే అనుమానాలను ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆరోపణలు నిజమా కాదా అన్నదానితో సంబంధం లేకుండా.. ఉన్నతాధికారుల పర్యవేక్షణ వ్యవస్థ ఎంత సమర్థంగా పనిచేస్తోందన్నది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది.
తొమ్మిదేళ్లుగా ఒకే చోట ఎలా?
ఒకే కార్యాలయంలో 2017 నుంచి పనిచేస్తున్న కానిస్టేబుళ్లకు బదిలీలు లేవు. హోంగార్డులు సైతం ఒక్కో కార్యాలయంలో 10 నుంచి 15 ఏళ్లుగా ఒకేదగ్గర విధులు నిర్వహిస్తున్నారు. అధికారులు బదిలీ అవుతున్నారే తప్ప వీరికి మాత్రం లేవు. దీంతో ఆ కార్యాలయం అంతా వీరి ఆధ్వర్యంలో కొనసాగుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. ఉన్నతాధికారులు ఎందుకు వీరిని బదిలీ చేయకుండా మినహాయింపు ఇస్తున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వారి పనితీరుకు సైతం అద్దంపడుతుంది. అధికారులతో పాటు వీరికి రెండేళ్లకు పైబడిన వారిని బదిలీ చేయాల్సి ఉంది. కానీ వీరు సైతం మేనేజ్ చేస్తుండటంతో బదిలీలు చేయడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.
ప్రజలకు ఇబ్బందులు
రవాణాశాఖ సేవలు నేరుగా సామాన్య ప్రజలతో ముడిపడి ఉంటాయి. వాహనాల రిజిస్ట్రేషన్, బదిలీలు, డ్రైవింగ్ లైసెన్సులు, పర్మిట్లు, ఇతర ధ్రువపత్రాల కోసం ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో ప్రజలు కార్యాలయాలను ఆశ్రయిస్తుంటారు. ఒక పని కోసం పలుమార్లు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తే సమయం, డబ్బు రెండూ వృథా అవుతున్నాయని ప్రజలు వాపోతున్నారు.మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, నిబంధనల ప్రకారం నిర్ణీత సమయంలో సేవలు అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. కింది స్థాయి సిబ్బంది కారణంగా ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్న ఫిర్యాదులు ఉంటే వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉంది.
సమగ్ర విచారణకు డిమాండ్
ఒకే చోట దీర్ఘకాలంగా పనిచేస్తున్న సిబ్బంది వివరాలు, వారి బదిలీ చరిత్ర, కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, వైరల్ వీడియోలోని అంశాలపై ఉన్నతస్థాయి విచారణ చేపట్టాలనిప్రజల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. 2017 నుంచి ఒకే కార్యాలయంలో కొనసాగుతున్న సిబ్బంది ఎంతమంది? వారిని బదిలీ చేయకపోవడానికి కారణాలేమిటి? ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై ఇప్పటివరకు తీసుకున్న చర్యలేమిటి? అనే అంశాలపై ఆర్టీఏ కార్యాలయాల వారీగా సమీక్షించి.. ఏళ్లుగా పనిచేస్తున్న కానిస్టేబుల్, హోంగార్డులతో పాటు ఇతర కింది స్థాయి సిబ్బందిని సైతం బదిలీలు చేపట్టాలని, ఆర్టీఏ సేవల్లో పారదర్శకత పెంచాలని పలువురు కోరుతున్నారు. ఆదిశగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారా? లేదా? అనేది చూడాలి.
Also Read: పరీక్షల పేరుతో రక్తం పిండుతున్నారా? హుజూరాబాద్‌లో కార్మికుల శాంపిళ్ల సేకరణపై వివాదం!