Bengal Crime: ప్రాణం పోయినా కొందరు చిన్నారులు దొంగతనం చేయరు. అయినా పదే పదే దొంగ అంటూ ఒప్పుకోరు. పనిష్‌మెంట్ చేస్తే తట్టుకోలేరు. అఘాయిత్యానికి పాల్పడతారు. ఆ 12 ఏళ్ల బాలుడు కూడా అదే చేశాడు. తనను దొంగ అనడంతో తట్టుకోలేకపోయాడు. తనపై వేసిన నింద జన్మలో పోదని భావించాడు. చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. కంటతడి పెట్టించిన ఆ ఘటన బెంగాల్‌లోని ఈస్ట్ మిడ్నాపూర్‌లో జరిగింది.
పశ్చిమ బెంగాల్‌లోని ఈస్ట్ మిడ్నాపూర్ ప్రాంతంలో విషాదకర ఘటన జరిగింది. పాన్‌స్కురా ప్రాంతానికి చెందిన 12 ఏళ్ల క్రిషెందు దాస్ ఏడో తరగతి చదువుతున్నాడు. సాయంత్రం వేళ సమీపంలోని గోసాయిబేర్ బజార్‌కి వెళ్లాడు. చిప్స్ ప్యాకెట్ కొనుగోలు చేసేందుకు ఓ షాపు వెళ్లాడు. ఆ సమయంలో షాపు యజమాని శుభంకర్ దీక్షిత్ లేడు.
దీంతో అంకుల్.. చిప్స్ ప్యాకెట్ తీసుకుంటున్నా అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కొద్దిసేపటికి షాపు యజమాని దీక్షిత్ వచ్చి బాలుడ్ని వెంబడించి పట్టుకున్నాడు. అందరి ముందు బాలుడ్ని చెంప దెబ్బ కొట్టాడు. అక్కడితో ఊరుకోలేదు. చివరకు గుంజీలు సైతం తీయించాడు. బాలుడు చిప్స్ ఘటన విషయం తెలుసుకున్న తల్లి అక్కడికి వచ్చింది.
చివరకు తన కొడుకుని గట్టిగానే మందలించింది. తాను దుకాణం ముందు పడి ఉన్న కుర్ కురే ప్యాకెట్‌ను తీసుకున్నానని చెప్పాడు. డబ్బులు చెల్లిద్దామనుకున్నానని షాపులో ఎవరూ లేరని చెప్పాడు. డబ్బులు చెల్లిస్తానని క్షమించమని వేడుకున్నా షాపు ఓనర్ నమ్మలేదని ఏడ్చుకుంటూ చెప్పాడు. అబద్ధం చెప్పానని తనను నిందించాడని వాపోయాడు.
ALSO READ: కాల్ సెంటర్ ముసుగులో సైబర్ డెన్.. నాలుగు దశల్లో ట్రాప్
ఈ ఘటనతో మనస్తాపానికి గురయ్యాడు ఆ బాలుడు. తల్లితో కలిసి క్రిషెందు ఇంటికి వెళ్ళాడు. ఇంట్లోకి వెళ్లి తలుపు గడియ పెట్టుకున్నాడు. కొడుకు ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో ఆ తల్లికి అనుమానం వచ్చింది. స్థానికుల సహాయంతో తలుపులు పగలగొట్టింది. అప్పటికే క్రిషెందు నోటి నుంచి నురగలు వస్తున్నాయి.
అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. వెంటనే క్రిషెందును సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కొద్ది సేపటికే మరణించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటన తర్వాత షాపు యజమాని పరారయ్యాడు. ఇంట్లోని గదిలో సగం ఖాళీ అయిన పురుగుల మందు డబ్బా, క్రిషెందు దాస్ రాసిన ఓ లేఖ కనిపించింది.
అమ్మా.. ‘నేను దొంగను కాదు, ఏమీ దొంగిలించలేదు. నేను వెళ్లినప్పుడు అంకుల్ లేడు. తిరిగి వస్తుంటే రోడ్డుపై కుర్‌కురే ప్యాకెట్ కనిపిస్తే తీసుకున్నాను. కుర్‌కురే అంటే చాలా ఇష్టం. ఇవే నా చివరి మాటలు నన్ను క్షమించు అమ్మ’ అంటూ అందులో రాసుంది. ఈ లేఖ చూసి చాలామంది కన్నీళ్లు పెట్టుకున్నారు.