West Godavari News: మరో నాలుగు రోజల్లో ఆ యువతి ఎంగేజ్‌మెంట్ జరగనుంది. మే నెలలో వివాహం చేయాలని కుటుంబసభ్యులు భావిస్తున్నారు. ఊహా లోకంలో ఆ యువతి విహరిస్తోంది. అంతలోనే ఊహించని ఘటన. సడన్‌గా మృతి చెందింది. కూతురు మృతిపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కుటుంబసభ్యులు. అసలేం జరిగింది?
అసలేం జరిగింది?
పైన ఫోటోలో కనిపిస్తున్న యువతి పేరు నెల్లి కరుణ. వయస్సు 25 ఏళ్లు. వార్డు సచివాలయంలో కార్యదర్శిగా పని చేస్తోంది. నిడదవోలు మండలం కోరుమామిడి ప్రాంతానికి చెందిన వెంకట రమణ-సూర్యకుమారి దంపతుల ఏకైక కూతురు కరుణ. ఒక్కరే కావడంతో అమ్మాయిని అల్లారు ముద్దుగా పెంచుకున్నారు.
అనుకున్నట్లుగా తల్లిదండ్రులు ఆశలు వమ్ము చేయకుండా జాగ్రత్తగా ఉండేది. ఉద్యోగంలో ఎలాంటి మాట పడేది కాదు. ఏ విషయంలోనైనా ముక్కుసూటిగా వ్యవహరించేది. ఇటీవల కరుణకు పెళ్లి సంబంధం ఓకే అయ్యింది. మరో నాలుగు రోజల్లో నిశ్చితార్థానికి అంతా రెడీ చేశారు. మే నెలలో పెళ్లి చేయాలని నిర్ణయించారు. ఏం జరిగిందో తెలీదుగానీ సోమవారం రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందింది.
ఎప్పటి మాదిరిగా సోమవారం సాయంత్రం డ్యూటీ చేసుకుని ఇంటికి వచ్చింది. ఆ తర్వాత బంధువులతో కలిసి చర్చిలో ప్రార్థన చేసింది. చర్చి నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కడుపు నొప్పి మొదలైంది. ఆ తర్వాత కళ్లు తిరుగుతున్నాయని చెప్పడంతో వెంటనే నిడదవోలులో ప్రైవేటు ఆసుపత్రికి అమ్మాయిని తరలించారు. అయితే అక్కడ వైద్యుడు అందుబాటులో లేదు.
ALSO READ: భర్త గొంతు కోసి చంపేసి, ఆపై గుండెపోటుగా చిత్రీకరణ
వెంటనే అక్కడి నుంచి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే కరుణ మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఉన్నట్లుండి కళ్ల ముందు కూతురు సడన్ గా మృతి చెందడాన్ని జీర్ణించుకోలేకపోయారు తల్లిదండ్రులు. కూతురు మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు పోలీసులు.
కరుణ ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే మృతి చెందారన్న నిజాన్ని తోటి ఉద్యోగులు నమ్మలేకపోతున్నారు. ఆసుపత్రి వద్ద తోటి ఉద్యోగులు కంటతడి పెట్టారు. కరుణ సొంత స్వగ్రామం కోరుమామిడిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీనిపై పోలీసులు విచారణ మొదలుపెట్టారు. తొలుత ఆమె సెల్‌ఫోన్, పని చేసిన ప్రాంతంలో విచారణ మొదలుపెట్టేశారు.