Stray Dog Attack: మెదక్ జిల్లా శివంపేట మండలంలోని రూప్లా తండాలో విషాదం చోటు చేసుకుంది. కిరాణం షాపుకు వెళ్తున్న చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేశాయి. వెంటపడి తల పైభాగం, కాళ్లను పీక్కుని తినడంతో చిన్నారి నితిన్‌కు తీవ్రగాలయ్యాయి. ఆస్పత్రికి తీసుకుని వెళ్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందాడు.
గ్రామస్తుల ప్రతిస్పందన
ఘటనకు సమీపంలో ఉన్న కొంతమంది గ్రామస్తులు.. పిల్లాడు అరుపులు విని బాలుడిని కుక్కల నుంచి విడిపించారు. గాయాల తీవ్రతను గమనించిన వారు వెంటనే ప్రథమ చికిత్స అందించారు. సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న.. ప్రైవేట్ వాహనంలో నితిన్‌ను ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గమధ్యలోనే బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.
తల్లిదండ్రుల కన్నీటి విలపం
జేరుపుల హోబ్య, లావణ్య దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. రెండో కుమారుడు నిథున్ (3) కిరాణా షాపునకు వెళ్లి తినుబండారాలు కొనుక్కొని వస్తుండగా.. దారిలో అయిదారు కుక్కలు దాడి చేసి, తలపై తీవ్రంగా కరిచాయి. తీవ్ర రక్తస్రావం కారణంగా.. నితిన్ ప్రాణాలతో పోరాడుతూ మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
అధికారుల నిర్లక్ష్యం?
ఈ ఘటనపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని నెలలుగా వీధుల్లో కుక్కల సంఖ్య పెరిగిందని, పలు సందర్భాల్లో ఈ కుక్కలు చిన్న పిల్లలపై, వృద్ధులపై దాడి చేసిన ఘటనలు చోటుచేసుకున్నాయని వారు చెబుతున్నారు. అయినా అధికారులు, పంచాయతీ అధికారులు తగిన చర్యలు తీసుకోలేదని విమర్శిస్తున్నారు. నితిన్ మరణానికి ప్రభుత్వ యంత్రాంగమే బాధ్యత వహించాలంటూ.. స్థానికులు, బాలుడు తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వం స్పందించాలంటూ డిమాండ్
చిన్నారి ప్రాణాలు తీసిన ఈ ఘటనపై ప్రభుత్వాన్ని స్పందించాలంటూ.. ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వీధి కుక్కల నియంత్రణ కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని, పశుసంవర్ధక శాఖ, గ్రామ పంచాయతీ కలిసి సమర్థవంతంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. అలాగే నితిన్ కుటుంబానికి న్యాయం జరిగేలా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read: పెళ్లైన వ్యక్తితో కూతురు ప్రేమాయణం.. తల్లిదండ్రులు ఏం చేశారంటే!
గ్రామాల్లో, పట్టణాల్లో వీధి కుక్కల నియంత్రణపై సమర్థవంతమైన చర్యలు లేకపోవడం వల్ల.. చిన్న పిల్లలు మరణించడం బాధాకరం. ఇలాంటి ఘటనలు దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. చిన్నారి నితిన్ మరణం స్థానికంగా విషాదాన్ని నెలకొల్పగా, ఈ దుర్ఘటన తక్షణ చర్యల అవసరాన్ని సమాజానికి మరింత స్పష్టంగా తెలియజేస్తోంది.