Rajahmundry Tragedy: రాజమండ్రి నగరంలోని దివాన్ చెరువు పరిసరాల్లో.. శనివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆడుకునేందుకు బయటకు వెళ్లిన ఆరేళ్ల చిన్నారి.. అకస్మాత్తుగా పంచాయితీ పనుల కోసం తవ్విన గొయ్యిలో పడిపోవడంతో మృతి చెందాడు.
ప్రమాదం ఎలా జరిగింది?
ప్రస్తుతం పంచాయితీ అధికారులు చెరువు పరిసర ప్రాంతాల్లో.. నీటి సరఫరా మెరుగుపరిచేందుకు.. కొత్త కులాయిల ఏర్పాటుకు పనులు చేపట్టారు. అయితే, తవ్విన గొయ్యిని ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోకుండా అలాగే వదిలేశారు. అకస్మాత్తుగా కులాయిల కోసం తీసిన గొయ్యిలో ఆ బాలుడు పడిపోయాడు. తాను పడిన ప్రదేశంలో బురద మట్టి, నీరు ఉండటంతో బయటకు రావడం సాధ్యపడలేదు. అతడిని కొన్ని గంటల పాటు గమనించలేకపోయారు. అనంతరం స్థానికులు అక్కడ గాలింపు చేపట్టి, చిన్నారి పడి ఉండడం గుర్తించి బయటకు తీసేలోపే ప్రాణాలు కోల్పోయాడు.
కుటుంబ సభ్యుల ఆవేదన
బాలుడి మృతితో తల్లిదండ్రులు షాక్‌లోకి వెళ్లిపోయారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తూ స్థానిక పంచాయితీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారి మృతికి తామే బాధ్యులమని అధికారులు గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
స్థానిక నేతల స్పందన
ఈ ఘటనపై స్పందించిన స్థానిక ఎమ్మెల్యే, బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. వారి బాధను వ్యక్తిగతంగా తీసుకుని, ప్రభుత్వం తరఫున అన్ని రకాల సహాయాలు అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే బాధ్యులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై విచారణ జరిపి.. అవసరమైతే సస్పెండ్ చేయడమో, శిక్షించడమో జరుగుతుందని స్పష్టం చేశారు.
ప్రజల్లో ఆందోళన
చిన్నారి మృతి స్థానిక ప్రజల్లో ఆందోళన నెలకొంది. ప్రభుత్వ పనులు చేపట్టే ప్రతీసారి పిల్లలు, స్థానికులు ప్రమాదంలో పడేలా ఉండటం మేము భరించలేం. పంచాయితీలు నిర్లక్షంగా పనులు చేపట్టడాన్ని ఇక చూస్తూ ఊరుకోం.. అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాశ్వతంగా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే.. ప్రభుత్వ యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
Also Read: గుట్టపై చెప్పులు.. పొలాల్లో లక్షిత్.. ఎలా చనిపోయాడు!
ఈ విషాద ఘటన మరోసారి అధికారుల నిర్లక్ష్యం.. ఎంత ప్రాణాంతకమో చాటిచెప్పింది. చిన్నారి ప్రాణం తిరిగి రాదు గానీ, బాధ్యులపై చర్యలు తీసుకుంటే.. తల్లిదండ్రుల ఆవేదనకు కొంత భరోసా దొరుకుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.