OTT Movie : గ్రిప్పింగ్ స్టోరీతో, ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో ఆకట్టుకునే మర్డర్ మిస్టరీ సినిమాలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకూ ఆసక్తికరంగా నడుస్తాయన్న విషయం తెలిసిందే. ఒకవేళ ఓటీటీలో గనుక ఇలాంటి గ్రిప్పింగ్ మర్డర్ మిస్టరీ, అందులోనూ మలయాళ సినిమా గురించి వెతికితే ఈ మూవీ మీ కోసమే. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? స్టోరీ ఏంటి? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్
ఈ మూవీ పేరు “సోలమంటే తేనీచ్చకల్” (Solomante Theneechakal). అంటే తెలుగులో ‘సోలమన్ తేనెటీగలు’ అని అర్థం. 2022లో విడుదలైన ఈ మలయాళ క్రైమ్-థ్రిల్లర్ ను ప్రముఖ దర్శకుడు లాల్ జోస్ రూపొందించారు. పి.జి. ప్రగీష్ రచించారు. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో అందుబాటులో ఉంది. కొచ్చి నేపథ్యంలో జరిగే ఈ కథ, ఇద్దరు యువ మహిళా పోలీస్ కానిస్టేబుళ్ల స్నేహం, వారి వ్యక్తిగత జీవితాలు, ఒక హత్య రహస్యంతో చిక్కుకున్న సంఘటనల చుట్టూ తిరుగుతుంది. జోజు జార్జ్, విన్సీ అలోషియస్, దర్శన ఎస్. నాయర్, శంభు మీనన్, అడిస్ ఆంటోనీ ఇందులో ప్రధాన పాత్రల్లో నటించారు, ఇందులో లాల్ జోస్ నిర్వహించిన “నాయిక నాయకన్” టాలెంట్ హంట్ షో నుండి ఎంపికైన నూతన నటీనటులు ఉన్నారు.
కథలోకి వెళ్తే…
కథ కొచ్చి శివారులో నివసించే ఇద్దరు యువ మహిళా పోలీసు కానిస్టేబుళ్లు సుజ (దర్శన ఎస్. నాయర్), గ్లైనా (విన్సీ అలోషియస్) స్నేహం చుట్టూ తిరుగుతుంది. సుజ ట్రాఫిక్ పోలీసుగా పని చేస్తుంటే, గ్లైనా స్థానిక పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వహిస్తుంది. వారిద్దరూ “ఇన్‌స్టా సిస్టర్స్” అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో రీల్స్ చేస్తూ, తమ స్నేహాన్ని ఆనందిస్తారు. సుజ తన ట్రాఫిక్ డ్యూటీ నుండి విముక్తి కోరుకుంటూ, స్టేషన్ విధుల్లో చేరాలని కోరుకుంటుంది. అదే సమయంలో సుజ శరత్ బాలకృష్ణన్ (శంభు మీనన్) అనే హై-ఎండ్ కారు డ్రైవర్‌తో ప్రేమలో పడుతుంది. అయితే అతనికి కొన్ని డార్క్ సీక్రెట్స్ ఉంటాయి.
అదే సమయంలో వారి సీనియర్ అధికారి సిఐ బిను అలెక్స్ (అడిస్ ఆంటోనీ అక్కర) సుజను వివాహం చేసుకోవాలని కోరుకుంటాడు. కానీ సుజ అతని ప్రపోజల్ ను రిజెక్ట్ చేస్తుంది. అనూహ్యంగా బిను అలెక్స్ హత్యకు గురవుతాడు. శరత్ ఈ కేసులో ప్రధాన అనుమానితుడిగా మారతాడు. ఈ హత్య రహస్యాన్ని ఛేదించేందుకు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సోలమన్ (జోజు జార్జ్) రంగంలోకి దిగుతాడు. సోలమన్ దర్యాప్తు కథను ఒక థ్రిల్లర్‌గా మారుస్తుంది. అనేక ట్విస్ట్‌లు, బ్యాక్‌స్టోరీలతో కథ ఇంట్రెస్టింగ్ మలుపులు తిరుగుతుంది. ఊహించని విధంగా సుజ, గ్లైనా ఈ కేసులో చిక్కుకుంటారు. ఇది వారి వ్యక్తిగత జీవితాలను, వృత్తిపరమైన బాధ్యతలను ప్రభావితం చేస్తుంది. క్లైమాక్స్‌లో అదిరిపోయే ట్విస్ట్ తో హంతకుడు ఎవరన్న విషయం వెల్లడవుతుంది. ఇంతకీ హంతకుడు ఎవరు? ఆ ఇద్దరు అమ్మాయిలు ఈ కేసు నుంచి ఎలా బయట పడ్డారు? చివరికి ఏమైంది? అన్నది తెరపై చూడాల్సిన విషయాలు.