UP News: ఉత్తర ప్రదేశ్ రాష్టంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని బాగ్‌పట్ గాంధీ రోడ్ లోని వనస్తంభ్ కాంప్లెక్స్ లడ్డూ మహోత్సవం వేడుకలో ఓ వేదిక ఒక్కసారిగా కూలిపోవడంతో ప్రమాదం జరిగింది. ఆదినాథ్ నిర్వాణ లడ్డూ మహోత్సవం నిర్వహిస్తుండగా చెక్కలతో ఏర్పాటు చేసిన వేది కుప్ప కూలింది. ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా.. 60 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బాగ్‌పట్‌లో ఆదినాథ్ నిర్వాణ లడ్డు వేడుక వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ మహోత్సవ నిర్వహించేందుకు చెక్కులతో వేదకను ఏర్పాటు చేశారు. అయితే వందలాది మంది లడ్డూను సమర్పించడానికి ఆలయానికి పోటెత్తారు. భక్తులు ఎక్కువ సంఖ్యలో వేదికపైకి రావడంతో చెక్కలతో ఏర్పాటు చేసిన వేదిక ఉన్నట్లుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ప్రమాదంలో ఐదుగురు భక్తులు అక్కడికక్కడే మృతిచెందగా.. 60 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనతో చుట్టుపక్కల ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు.
అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో చుట్టుపక్కల ప్రజలు, క్షతగాత్రులను రిక్షాలో తరలించారు. ప్రస్తుతం వేదిక కింద చిక్కుకుపోయిన క్షతగాత్రులను బయటకు తీసేందకు అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం ఎలా జరిగింది..? అని తీస్తున్నారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు వేగవంతం చేయాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
బాగ్‌పట్ జిల్లా మేజిస్ట్రేట్ అస్మితా లాల్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అర్పిత్ విజయ వర్గియా ఆస్పత్రికి చేరుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు మృతిచెందినట్లు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అస్మితా లాల్ అధికారికంగా వెల్లడించారు. అయితే మరో ఇద్దరు వ్యక్తులు మరిణించినట్లు తెలుస్తోంది. దీనిపై అధకారికంగా ఎలా సమాచారం రాలేదని అధికారులు పేర్కొన్నారు.
ఈ ప్రమాదంపై సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా స్పందించారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం మతం పేరుతో డ్రామా సృష్టిస్తోందని దారుణమైన ఆరోపణలు చేశారు. ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు అందడం లేదని.. దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేయడంలేదని విమర్శించారు. అధికారుల పర్యవేక్షణ సరిగ్గా లేదన్నారు. దీని కారణంగా ప్రమాదాలు సంభవిస్తున్నాయని చెప్పారు. మతం పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తుందని చెప్పుకొచ్చారు.