Anantapur Crime: జీవితాంతం తోడుగా ఉండాల్సిన భర్త.. భార్య పట్ల మృగంలా మారాడు. నిండు గర్భిణి అని కూడా చూడకుండా అనుమానంతో రాచి రంపాన పెట్టాడు. భర్త మారుతాడన్న ఆశతో ఇన్ని రోజులు భరిస్తూ వచ్చిన భార్య, చివరకు సహనం కోల్పోయింది. భర్తతో పాటు అత్త, మామ కూడా తోడవ్వడంతో తనువు చాలించింది. ఈ విషాధ ఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో చోటుచేసుకుంది. ఆత్మహత్యకు పాల్పడిన మహిళ శ్రావణిగా గుర్తింపు. కొంతకాలంగా భార్యభర్తల మధ్య విభేదాలు, అత్తమామల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది శ్రావణి.
అనుమానంతో భర్త వేధిస్తున్నాడంటూ వాయిస్ రికార్డు చేసి మరీ ఆత్మహత్య చేసుకుంది. పోలీసుకు ఫిర్యాదు చేసిన కేసు ఫైల్ చేయలేదని శ్రావణి ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులు కూడా తనకు న్యాయం చేయలేదని కన్నీరు పెట్టుకున్న శ్రావణి. తన చావుకు అత్త,మామ, భర్తే కాకుండా పోలీసులు కూడా కారణమని తెలిపింది. న్యాయం చేయాలని కోరిన కనికరించలేదని రికార్డులో తెలిపింది. కన్నీటితో తనువు చాలిస్తున్నట్లు చెప్పుకొచ్చింది.
తాను గర్భవతినని తెలిసి అనుమానంతో భర్త, అత్త,మామలు అబార్షన్ చేయించుకోవాలని వేధించారని వాపోయింది. ఇన్ని రోజులు భరిస్తూ వచ్చానని, ఇప్పుడు వారు పెట్టే వేధింపులు తట్టుకోలేపోతున్నాని తెలిపింది. పోలీసులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని, మహిళకు న్యాయం చేసేవారు లేరని కన్నీరుపెట్టుకుంది. పోలీసులు కూడా భర్త వైపే మాట్లాడారని వాపోయింది. పెళ్లై అత్తింటికి వచ్చినప్పటి నుంచి బాధలు భరిస్తూనే వచ్చానని పేర్కొంది. ఎప్పటికైనా మారుతారని ఆశతో ఇన్ని రోజులు భరించానని చెప్పుకొచ్చింది. అత్త, మామ మాటలు విని భర్త రోజూ వేధించేవాడని అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని వాయిస్ రికార్డ్ చేసి ఆత్మహత్యకు పాల్పడింది.
Also Read: Nara Lokesh: అలాంటి సినిమాలను రిలీజ్ కానివ్వం -లోకేష్ ఘాటు హెచ్చరిక
శ్రావణి ఆత్మహత్య వార్త వినగానే తల్లిదండ్రులు గుండెలు పగిలేలా కన్నీరు పెట్టుకున్నారు. శ్రావణి ఆత్మహత్యకు కారకులైన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. గర్బవతి అని కూడా చూడకుండా అత్తింటి వారు అనుమానంతో వేధించేవారని తెలిపారు. శ్రావణికి అబార్షన్ చేసుకోవాలని భర్త వేధించాడని వాపోయారు. పోలీసుల దగ్గర కూడా తమ కూతురికి న్యాయం జరగలేక పోయిందని కన్నీరుపెట్టుకున్నారు.
రక్షణ కల్పించాల్సిన పోలీసులే శ్రావణి ఆత్మహత్యకు కారకులయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమ కూతురు ఆత్మహత్యకు కారకులైన వారిని శిక్షించాలని కోరారు. అయితే ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసుల నిర్లక్ష్యంపై ఎస్పీ జగదీష్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. వెంటనే విచారణ జరపాలని ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. శ్రావణి ఆత్మహత్యకు కారకులైన వారిని శిక్షిస్తామని తెలిపారు.