స్వేచ్ఛ, నల్లగొండ బ్యూరో : యాదాద్రిభువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు రాయగిరి వద్ద లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న తల్లీకూతుళ్లు అక్కడికక్కడే మృతిచెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. భువనగిరి రూరల్ సీఐ చంద్రబాబు తెలిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం వెంకట్రామ్ తండాకు చెందిన భూక్యా సంతోష్ సంక్రాంతి పండుగ ముగియడంతో గురువారం కుటుంబ సభ్యులతో కలిసి కారులో హైదరాబాద్ పయనమయ్యారు.
ఉదయం 6.30 గంటల సమయంలో రాయగిరి శివారు సమీపంలో హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ అకస్మాత్తుగా ఎలాంటి ఇండికేటర్స్ వేయకుండా పెట్రోల్ బంక్‌వైపునకు తిప్పాడు. దీంతో వెనుక నుంచి వస్తున్న కారు కంట్రోల్ కాకపోవడంతో లారీని బలంగా ఢీకొట్టింది. దీంతో లారీ వెనుక భాగంలోకి కారు ముందు భాగం దూసుకెళ్లి నుజ్జునుజ్జయ్యింది. కారు ముందు సీటులో కూర్చున్న సంతోష్ భార్య అనూష(28), కూతురు చైత్ర(7) అక్కడికక్కడే మృతిచెందారు. కారులో ప్రయాణిస్తున్న భూక్యా సంతోష్, భవాని, రవి, మోక్షకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని భువనగిరి రూరల్ సీఐ చంద్రబాబు తెలిపారు.
Also Read: పండుగపూట విషాదం, ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం, ఎంత మంది చనిపోయారంటే..?