Online Games Addict: ఫోన్‌లో కాసేపు సరదాగా ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతున్నారు. ఆ తర్వాత వాటికి బానిస అవుతున్నారు. ఫలితంగా ఈ ఉచ్చులో పడి యువకులు బలైపోతున్నారు. జీవితంలో ఓ ఎత్తుకు ఎదగాలని కొండంత ఆశతో పట్టణాలు, సిటీలకు వస్తున్నారు. అనుకోని పరిస్థితుల్లో ఎదుర్కొని నానా ఇబ్బందులు పడుతున్నారు. చివరకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఆన్ లైన్ గేమ్స్ బానిసైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది.
ఆన్‌లైన్ బెట్టింగ్
ఉమ్మడి కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లికి చెందిన 22 ఏళ్ల నిఖిల్‌రావు హైదరాబాద్‌లో అగ్రికల్చర్ బీఎస్సీ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. డిగ్రీ స్టూడెంట్ అనగానే అయితే బైక్ లేదనుకుంటే చేతిలో సెల్‌ఫోన్ సహజం. ఒకప్పుడు సరదాగా ఆన్‌లైన్ గేమ్స్ ఆడేవాడు. ఆ తర్వాత అది వ్యసనంగా మారిపోయింది.
భారీగా అప్పులు
ఈ క్రమంలో ఆన్‌లైన్ బెట్టింగ్ డబ్బులు పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత వీలు చిక్కినప్పుడల్లా అప్పులు చేయడం మొదలుపెట్టాడు. అప్పుల వ్యవహారం చివరకు తల్లిదండ్రులకు తెలిసింది. ఈ విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని భావించి నిఖిల్‌రావును తండ్రి మందలించాడు. ఇప్పటివరకు చేసిన దాదాపు రూ.4 లక్షల అప్పులను చెల్లించాడు.
పరిస్థితి గమనించిన తండ్రి, సిటీకి వెళ్తే కొడుకు పాడైపోయాడని భావించాడు. చివరకు నిఖిల్‌ను ఇంటి వద్ద ఉంచాడు.సెమిస్టర్ పరీక్షలు ఉన్నాయని చెప్పడంతో సోమవారం తెల్లవారుజామున కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరాడు. నిఖిల్‌రావుతోపాటు తండ్రి తిరుపతిరావు బస్టాండ్ వరకు వచ్చాడు.
ALSO READ: పట్టపగలు దోపిడీ దొంగల బీభత్సం.. తనిష్క్ గోల్డ్ షాపులో అరగంటలో
బస్సు కదిలిన తర్వాత కూరగాయలు విక్రయించడానికి మార్కెట్‌కు వెళ్లాడు. హైదరాబాద్ బస్సు ఎక్కిన నిఖిల్, ఇందిరానగర్ వద్ద దిగి మన్నెంపల్లి వైపు తండ్రి కౌలుకు తీసుకుని వ్యవసాయం పొలానికి వచ్చాడు. సమీపంలోని ఓ రైతు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
మధ్యాహ్న సమయంలో తిరుపతిరెడ్డి వద్ద పని చేసిన వ్యక్తి మోటర్ ఆఫ్ చేసేందుకు బావి వద్దకు వెళ్లాడు. అక్కడ నిఖిల్ చెప్పులు కనిపించడంతో తండ్రితోపాటు స్థానికులకు సమాచారం ఇచ్చాడు. చివరకు బావిలో మృతదేహం నిఖిల్‌గా గుర్తించారు. పోలీసులు చేరుకుని స్థానికుల సాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు.
పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఎదిగిన కొడుకు చేతికి అంది వస్తాడని భావించిన తిరుపతిరావు, కొడుకు శవాన్ని చూసి కన్నీరు మున్నీరు అయ్యాడు. కొడుకుని మందలించడమే తాను చేసిన తప్పు అంటూ నెత్తు కొట్టుకుంటూ ఏచ్చాడు.
చివరిసారిగా తల్లితో కొడుకు మాటలు
కరీంనగర్ బస్టాండ్‌లో హైదరాబాద్ బస్సు ఎక్కిన తర్వాత తన తల్లికి ఫోన్ చేశాడు నిఖిల్‌రావు. అమ్మ.. తాను బస్సు ఎక్కానని, వెళ్లిన తర్వాత ఫోన్ చేస్తానని చెప్పాడు. జాగ్రత్త వెళ్లు అంటూ కొడుక్కి కాసింత జాగ్రత్తలు చెప్పింది. కొద్దిసేపటికే కొడుకు ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది. కొడుకు శవాన్ని చూసి కన్నీరు మున్నీరైన ఆ తల్లి పై విషయాలను బయటపెట్టింది.