Crime News: ఈ రోజుల్లో ఒక మహిళ రోడ్డు మీద నడిచినా, ఉద్యోగానికి వెళ్లినా, న్యాయం కోసం ప్రశ్నించినా… ఆమె భద్రత గ్యారంటీ కాదు. చట్టాన్ని నమ్మినవారే, మళ్లీ దాడికి గురవుతున్నారు. ఈ సమాజంలో మహిళగా జీవించడం అంటే ఒక సమరయోధురిలా రోజు రోజు పోరాడటం. అత్యాచారాలు, వేధింపులు, వేధింపులపై కేసులు పెట్టినందుకు ప్రాణాల మీదకి వచ్చే బెదిరింపులు — ఇవన్నీ ఇప్పుడు మామూలు వార్తలుగా మారిపోయాయి. వాస్తవంగా ఈ సమాజం ఆ మహిళలకు గౌరవం ఇవ్వడంలో విఫలమవుతోంది. మరి… ఇలాంటి పరిస్థితుల్లో మహిళలకే రక్షణ లేకపోతే, న్యాయాన్ని ఆశ్రయించిన వారికే న్యాయం దక్కకపోతే, ఈ వ్యవస్థల మనుగడకే అర్ధం ఏమిటి?. దీనికి తాజా ఉదాహరణ ఢిల్లీ వసంత్ విహార్‌లో జరిగిన హృదయ విదారక సంఘటన.
ఢిల్లీ నగరంలోని వసంత్ విహార్‌లో ఇటీవల చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఒక మహిళపై కాల్పులు జరిపి, ఆమెను తీవ్రంగా గాయపర్చిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది సాధారణ ఘటన కాదు. ఎందుకంటే… బాధితురాలు ఇదివరకు అత్యాచార కేసు పెట్టిన నిందితుడే ఆమెపై ఈ హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆమె ఓ ప్రైవేట్ సాలూన్‌లో హెడ్ మేనేజర్‌గా పనిచేస్తోంది. గతంలో అబుజైర్ సఫీ అనే వ్యక్తి ఆమెపై అత్యాచారం చేశాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ కేసులో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. కానీ, ఇటీవల అతనికి ఇంటరిమ్ బెయిల్ రావడంతో జైలు నుంచి బయటకి వచ్చాడు. అయితే తనపై కేసు పెట్టిందన్న వ్యక్తిగత ప్రతీకార భావంతో అతను ఆమెపై తుపాకీతో కాల్పులకు పాల్పడ్డాడు.
బాధితురాలు తన పని ముగించుకుని ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలో, నలుపు రంగు బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమెను వెంబడించి, ఆమెపై కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో ఒక బులెట్ ఆమె ఛాతీ భాగాన్ని తాకింది. ఆటో డ్రైవర్ రంజిత్ యాదవ్ వెంటనే స్పందించి, ఆమెను దగ్గర్లోని పోలీసు PCR వాహనం సహాయంతో వెంటనే ఏఐఐఎంఎస్ ట్రామా సెంటర్‌కు తరలించాడు. అక్కడ వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించగా, ప్రస్తుతానికి ఆమె ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని తెలుస్తోంది.
ఈ దాడికి పాల్పడిన ఇద్దరినీ ఢిల్లీ పోలీసులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బృందం అరెస్ట్ చేసింది. నిందితుల్లో ప్రధానంగా ఉన్న అబుజైర్ సఫీను ఆగస్టు 1న పట్టుకున్నారు. అతని వద్ద నుంచి కాల్పులకు ఉపయోగించిన తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. అతనితో పాటు అమన్ శుక్లా అనే వ్యక్తి కూడా ఉన్నట్లు గుర్తించారు. వీరిద్దరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
పోలీసుల విచారణ ప్రకారం.. సీసీ కెమెరా ఫుటేజ్, ఫోన్ కాల్ రికార్డులు, సోషల్ మీడియా లింకులు – అన్నీ కలిపి వీరి పాత్రను స్పష్టంగా నిరూపించాయి. సఫీ బాధితురాలిని పలుమార్లు సంప్రదించడానికి ప్రయత్నించినట్లు తెలిసింది. కానీ ఆమె అతనిని పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో, కోపంతో అణచలేని విధంగా ఈ దాడికి పాల్పడినట్లు పోలీసుల అభిప్రాయం. ఇక్కడ ప్రశ్నేంటంటే, అత్యాచార నిందితుడికి బెయిల్ ఇచ్చేముందు బాధితురాలి భద్రతను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు? ఇప్పటికే చట్టబద్ధంగా కేసు పెట్టిన మహిళ… చట్టాన్ని ఆశ్రయించినందుకే మళ్లీ ప్రాణాలను కోల్పోనున్న స్థితికి రావడం చాలా విషాదం.