Stress: ప్రస్తుతం ఒత్తిడి అనేది సర్వ సాధారణమైపోయింది. ఉద్యోగం, ఆర్థిక సమస్యలు, కుటుంబ బాధ్యతలు, సామాజిక ఒత్తిళ్లు వంటివి మన మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. అయితే.. ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కోవడం నేర్చుకుంటే.. మాత్రం ఆరోగ్యకరమైన, ప్రశాంతమైన జీవితాన్ని గడపొచ్చు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఉపయోగపడే సింపుల్ చిట్కాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. శారీరక వ్యాయామం:
ఒత్తిడిని తగ్గించడానికి శారీరక వ్యాయామం ఒక శక్తివంతమైన సాధనం. వ్యాయామం వల్ల ఎండార్ఫిన్లు అనే హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి సహజసిద్ధమైన మూడ్ బూస్టర్లుగా పనిచేస్తాయి. తద్వారా మనస్సు ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుంది. రోజుకు కనీసం 30 నిమిషాలు నడవడం, జాగింగ్ చేయడం, యోగా లేదా మీకు నచ్చిన ఏదైనా గేమ్స్ ఆడటం వల్ల ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది.
2. ధ్యానం, శ్వాస వ్యాయామాలు:
ధ్యానం అనేది మీ మనస్సును నిశ్శబ్దంగా ఉంచే ఒక అద్భుతమైన పద్ధతి. రోజుకు 10-15 నిమిషాలు ధ్యానం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. దీంతో పాటు.. లోతైన శ్వాస వ్యాయామాలు (డీప్ బ్రీతింగ్) చేయడం వల్ల శరీరం చల్లబడి.. గుండె కొట్టుకునే వేగం తగ్గుతుంది. ఫలితంగా ఒత్తిడి కూడా తగ్గుతుంది.
3. తగినంత నిద్ర:
నిద్ర లేకపోవడం అనేది ఒత్తిడికి ఒక ప్రధాన కారణం. నిద్రలో ఉన్నప్పుడు మన శరీరం, మెదడు విశ్రాంతి పొందుతాయి. తద్వారా మరుసటి రోజుకు కొత్త శక్తి లభిస్తుంది. ప్రతిరోజు 7-8 గంటలపాటు తగినంత నిద్ర పోవడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. నిద్రకు ముందు టీవీ, మొబైల్ ఫోన్ వంటి వాటిని పక్కన పెట్టడం మంచిది. ఇలా చేయడం వల్ల ఆందోళన తగ్గుతుంది.
4. ఆరోగ్యకరమైన ఆహారం:
మనం తినే ఆహారం మన మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర అధికంగా ఉండే ఆహారాలు, కెఫిన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రొటీన్లు సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల శరీరానికి, మనసుకు పోషణ లభిస్తుంది. తద్వారా ఒత్తిడి తగ్గుతుంది.
Also Read: తరచూ ముఖంపై.. చెమట పడుతోందా ?
5. హాబీలను పెంచుకోవడం:
మీకు నచ్చిన పని చేయడం వల్ల ఒత్తిడిని మర్చిపోవచ్చు. సాంగ్స్ వినడం, పుస్తకాలు చదవడం, తోటపని చేయడం, పెయింటింగ్ వేయడం లేదా ఏదైనా కొత్త కళను నేర్చుకోవడం వంటి హాబీలు ఒత్తిడిని తగ్గించి, మనసుకు ఆనందాన్ని ఇస్తాయి. ఈ పనులు చేయడం వల్ల మీకు విశ్రాంతి లభించడమే కాకుండా.. మీ సృజనాత్మకత కూడా పెరుగుతుంది. అంతే కాకుండా ఆందోళన కూడా చాలా వరకు తగ్గుతుంది. ముఖ్యంగా ఇష్టమైన పాటలు వినడం వల్ల కూడా అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. చాలా వరకు మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది.
ఈ చిట్కాలు మీ లైప్ స్టైల్‌లో చేర్చుకోవడం వల్ల ఒత్తిడిని తగ్గించి, ఆరోగ్యకరమైన, సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి సహాయపడతాయి. మీకు ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లయితే.. డాక్టర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.