Delhi Triple Murder: ఢిల్లీలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ కుటుంబానికి చెందిన ముగ్గురు దారుణహత్యకు గురయ్యారు. ఈ ఘటన వెనుక కారణం ఎవరు? సమస్యల కారణంగా ఈ హత్యలు జరిగాయా? కుటుంబసభ్యుడే పేరెంట్స్, బ్రదర్‌ని చంపేశాడా? అవుననే అంటున్నారు స్థానికులు. ఈ కేసు డీటేల్స్‌లోకి వెళ్తే..
దక్షిణ ఢిల్లీలో మైదాన్‌గఢీ ప్రాంతంలోని ఓ ఇంట్లో తీవ్రమైన దుర్వాసన వస్తోంది. అనుమానించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ ఇంటికి చేరుకున్న పోలీసులు, తలుపులు పగలకొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ భార్యభర్తలు, వారి కొడుకు రక్తపు మడుగులో విగతజీవులుగా పడి ఉన్నారు.
వారిని ప్రేమసింగ్, భార్య రజని, పెద్ద కొడుకు హృతిక్‌గా గుర్తించారు. తొలి అంతస్తులో రజని మృతదేహం కనిపించింది. అయితే ఆమె నోటికి అడ్డంగా గుడ్డలు కుక్కి ఉన్నాయి. మరో గదిలోకి వెళ్లగానే ప్రేమ్ సింగ్, పెద్ద కుమారుడు హృతిక్ మృతదేహాలు కనిపించాయి. ఆ ఇంట్లో ఉంటున్న నాలుగో వ్యక్తి సిద్ధార్థ్. అతడి గురించి పోలీసుల వద్ద ఎలాంటి సమాచారం లేదు.
ఘటన తర్వాత అక్కడి నుంచి పరారీలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇరుగుపొరుగువారి నుంచి సేకరించిన సమాచారం మేరకు సిద్ధార్థ్ దశాబ్ద కాలంగా మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు తేలింది. సిద్ధార్థ్‌ను నిందితుడిగా పరిగణిస్తున్నారు. కుటుంబాన్ని చంపేశాడని, ఇకపై ఆ ఇంట్లో ఉండనని ఎవరికో సమాచారం ఇచ్చాడట.
ALSO READ: మియాపూర్‌లో దారుణం.. ఐదుగురు వ్యక్తులు సూసైడ్ వెనుక?
ఇంట్లో ఆధారాల కోసం వెతికిన పోలీసులకు సిద్ధార్థ్ ట్రీట్‌మెంట్‌కి చెందిన మెడికల్ రిపోర్టు లభించాయి. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్-OCD సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. తీవ్రమైన కోపం ఉన్నట్లు గుర్తించారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ అండ్ అల్లైడ్ సైన్సెస్-ఐహెచ్‌బీఏఎస్‌లో చికిత్స పొందుతున్నట్టు ప్రిస్క్రిప్షన్స్ ద్వారా తెలుస్తోంది.
కుటుంబసభ్యులను కత్తులతో పొడిచి, ఇటుకలు, రాళ్లతో కొట్టి అత్యంత కిరాతకంగా చంపి ఉంటాడని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఇంటి పెద్దాయన ప్రేమ్‌సింగ్‌కు మద్యం సేవించే అలవాటు ఉందట. ఇంట్లో తరచూ గొడవలు జరిగేవని స్థానిక వ్యక్తులు చెబుతున్నారు.
ఆ ఇంటిని సీజ్ చేసిన పోలీసులు, పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి మృతదేహాలను తరలించారు. ఫోరెన్సిక్ టీమ్స్ ఘటనా స్థలంలో వేలిముద్రలు, మిగతా ఆధారాలను సేకరించారు. పరారీలో ఉన్న సిద్ధార్థ్ కోసం గాలింపు చర్యలు చేశారు. ఆ ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజ్‌లను చెక్ చేస్తున్నారు.
పోలీసుల దర్యాప్తులో సిద్ధార్థ్ మాదకద్రవ్యాల బానిసైనట్టు తెలుస్తోంది. అతను ఏ పని చేయడని, తల్లిదండ్రులు, అన్నయ్య నిత్యం గొడవపడేవారని అంటున్నారు. ఈ విషయంతో తన అన్నయ్యతో చాలాసార్లు గొడవపడ్డాడట సిద్ధార్థ్.