Father Kills Son For Wedding| వృద్ధాప్యంలో తోడు కోసం మళ్లీ పెళ్లి చేసుకోవడం తప్పు కాదు. కానీ మన సమాజం అందుకు అంగీకరించదు. ఆ వయసులో పెళ్లి అంటే హేళనగా, అవమానకరంగా భావిస్తుంది. అందుకే ముసలితనంలో భార్య లేదా భర్త చనిపోతే మిగిలిన మరొకరు ఒంటరిగా జీవించాల్సి వస్తుంది. అయితే ఇలాంటి వారిలో కొందరు మళ్లీ పెళ్లి చేసుకుంటే తప్పేంటని గొడవపడతారు. సంతోషంగా జీవించే తనకూ ఉందని.. అందుకే పెళ్లి చేసుకుంటానని మొండికేస్తారు. ఇలాంటి కేసుల్లో కుటుంబ కలహాలు విపరీతంగా ఉంటాయి. కానీ తాజాగా ఒక కేసులో ఒక వృద్ధ తండ్రి తన పెళ్లికి అడ్డు చెప్పాడని తన కొడుకునే హత్య చేశాడు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. గుజరాత్ రాష్ట్రం రాజ్ కోట్ జిల్లా జస్దాన్ పట్టణానికి చెందిన రామ్ బొరీచా అనే 76 ఏళ్ల వ్యక్తి తన కొడుకు ప్రతాప్ (50) కటుంబంతో కలిసి జీవిస్తున్నాడు. గతంలో గుజరాత్ ఆర్టీసీలో ఉద్యోగం చేసిన రామ్ బొరీచా రిటైర్మెంట్ తరువాత ఇంట్లోనే ఉన్నాడు. ఇంట్లో అతని కొడుకు ప్రతాప్ తో పాటు కోడలు జయ, 13 ఏళ్ల మనవడు జైదీప్ కూడా ఉంటారు. అయితే రామ్ బొరీచా భార్య 20 ఏళ్ల క్రితం చనిపోయింది. ఇక అప్పటి నుంచి రామ్ బొరీచా ఇంట్లో ఒంటరితనంతో బాధపడుతున్నాడు. తనకు మానసికంగా తోడు కావాలని భావించాడు. అందుకే మళ్లీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు.
రామ్ బొరీచాకు ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. వారు తమ కుటుంబాలతో గుజరాత్ లోనే వేరే ఊర్లలో కాపురం ఉంటున్నారు. ఈ క్రమంలో రామ్ బొరీచా తాను మళ్లీ వివాహం చేసుకుంటానని రెండేళ్ల క్రితం తన కొడుకు, కూతళ్లకు చెప్పాడు. కానీ అందుకు వారు అంగీకరించలేదు. ఈ వయసులో తమ తండ్రి మళ్లీ పెళ్లి చేసుకుంటే వారి కుటుంబ పరువుపోతుందని.. ఇది తప్పు అని వారు వాదించారు. కానీ రామ్ బొరీచా వారిని స్వార్థపరులని చెప్పి గొడవపడ్డాడు. తండ్రి సమస్యను పట్టించుకోవడం లేదని వారితో గొడవచేశాడు. ఎవరు ఒప్పుకున్నా.. కాదన్నా తాను పెళ్లి చేసుకుంటానని చెప్పి గొడవచేశాడు. అయితే రామ్ బొరీచా అతని కుమారుడు ప్రతాప్ తీవ్రంగా ప్రతిఘటించాడు. మళ్లీ పెళ్లి చేసుకుంటే ఇంటి నుంచి గెంటి వేస్తానని బెదిరించాడు.
ఆ గొడవ అప్పటికి సద్దమణిగింది. కానీ రామ్ బొరిచా మాత్రం తన పెళ్లి నిర్ణయాన్ని మార్చుకోలేదు. అందుకే తరుచూ ఈ విషయం తన కొడుకు ప్రతాప్ తో ప్రస్తావించేవాడు. దీంతో ఇంట్లో తరుచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో రామ్ బొరీచా తనకోసం పెళ్లి సంబంధాలు చూడమని ఏజెంట్లకు డబ్బులిచ్చాడు. దీంతో అతని కోసం భర్త చనిపోయిన ఒక 35 ఏళ్ల యువతి సంబంధం వచ్చింది. అది తెలిసి వృద్ధాప్యంలో తనకు ఒక యువతి భార్యగా వస్తుందని రామ్ బొరీచా ఆశపడ్డాడు.
లోలోపల ఎవరికీ తెలియకుండా ఆ యువతిని సంప్రదించాడు. ఆమె కూడా అంగీకారం తెలుపడంతో ఇక పెళ్లి చేసేసుకుందామని భావించి ఏప్రిల్ చివరిలో తేదీ కూడా ఖరారు చేసుకున్నాడు. ఇక ఈ విషయం తన కొడుకు ప్రతాప్ కు చెప్పి ఏర్పాట్లు చేయమని అన్నాడు. కానీ ప్రతాప్ ఆగ్రహించాడు. వద్దంటే మళ్లీ పెళ్లి చేసుకోవడమేంటని తండ్రితో గొడవపడ్డారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. మనవడు జైదీప్ పాలు తీసుకురావడానికి బయటికి వెళ్లాడు. కోడలు జయ పక్కింటి వారితో మాట్లాడేందుకు వెళ్లింది.
Also Read: 28 ఏళ్ల కోడలిని పెళ్లి చేసుకున్న 70 ఏళ్ల మామ.. పెద్ద కథే!
దీంతో ఇంట్లో తండ్రి కొడుకులను ఆపేవారు ఎవరూ లేరు. ఆ క్షణికావేశంలో ప్రతాప్ తన తండ్రి రామ్ బొరీచాను తిట్టాడు. అది తట్టుకోలేక రామ్ బొరీచా తన గదిలో నుంచి తుపాకీ తీసుకువచ్చి తన కొడుకుపై కాల్పులు జరిపాడు. ఆ తుపాకీ కాల్పుల శబ్దం విని జయ పరుగులు తీస్తూ వచ్చింది. అక్కడ చూస్తే తన భర్త ప్రతాప్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. తన మామ రామ్ బొరీచా చేతిలో తుపాకీ ఉంది. ఆమె ఇది చూసి తన భర్తను చంపిన మామను తిట్టిపోసింది. అంతే ఆ పెద్దమనిషి విచక్షణ లేకుండా ఆమెపై కూడా కాల్పులు జరిపాడు. కానీ గురి తప్పి బుల్లెట్లు ఆమె తగల్లేదు. జయ తన ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కడి నుంచి పారిపోయింది. అంతలో రామ్ బొరీచా మనవడు పాలు తీసుకొని వచ్చాడు. కానీ దారిలో అతని తల్లి జయ అడ్డువచ్చి అతడిని తీసుకొని పోలీస్ స్టేషన్ కు పారిపోయింది. జరిగినదంతా అక్కడ వివరించింది. పోలీసులు రామ్ బొరీచా ఇంటికి వెళ్లగా.. ఆ పెద్ద మనిషి తన కొడుకు శవం పక్కనే కూర్చొని తుపాకీ చేతపట్టుకొని ఉన్నాడు.
పోలీసులు రామ్ బొరీచాను అదుపులోకి తీసుకున్నాడు. తన కొడుకును తానే చంపానని రామ్ బొరీచా నేరం అంగీకరించాడు. తనకు పశ్చాత్తాపం ఏమీ లేదని అన్నాడు. పోలీసులు ప్రతాప్ హత్య కేసు నమోదు చేసి రామ్ బొరీచాను కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు.