Husband kills Wife: మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ రూప్ సింగ్ స్టేడియం ఎదుటనే భర్త.. తన భార్యపై తుపాకీతో కాల్పులు జరిపి హత్య చేశాడు. ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో ఒకసారిగా గందరళగోళం నెలకొంది.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. నిందితుడు అరవింద్ తన భార్యతో గత కొంతకాలంగా విభేదాలు కొనసాగిస్తున్నాడు. ఈ విభేదాలు వ్యక్తిగత సమస్యలతోపాటు ఆర్థిక ఇబ్బందుల కారణంగా.. మరింత ముదిరినట్లు తెలుస్తోంది. అదే ఆవేశంలో అరవింద్ తన దగ్గరున్న తుపాకీతో భార్యపై కాల్పులు జరిపాడు. కాల్పులు జరగడంతో భార్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
కాల్పుల సమాచారం అందుకున్న వెంటనే.. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, అప్పటికే గన్‌తో నిలబడి ఉన్న నిందితుడు పోలీసులను సైతం బెదిరించాడు. తుపాకీతో వారిని లక్ష్యం చేస్తూ ఎవరూ తన దగ్గరికి రాకూడదని హెచ్చరించాడు. దీనితో అక్కడ పరిస్థితి మరింత ఉద్రిక్తమైంది.
పరిస్థితి నియంత్రణలోకి రాకపోవడంతో పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. నిందితుడిని అదుపులోకి తెచ్చేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దాంతో అక్కడ పొగ వ్యాపించడంతో అరవింద్ కాసేపటికి అసహనంతో తుపాకీని వదిలి వేయాల్సి వచ్చింది. అనంతరం పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కి తరలించారు.
ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడికి తుపాకీ ఎలా దొరికింది? లైసెన్స్ ఉందా? లేక అక్రమంగా తెచ్చుకున్నాడా? అన్న విషయాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. అదేవిధంగా భార్యపై కాల్పులు జరపడానికి.. నిజమైన కారణాలు ఏంటి అన్న దానిపై కూడా విచారణ జరుగుతోంది.
ఈ ఘటన మరోసారి కుటుంబ కలహాలు.. ఎంతటి దారుణ ఫలితాలను ఇస్తాయో గుర్తు చేసింది. చిన్న చిన్న విభేదాలు పరిష్కారం కాని స్థాయికి చేరితే.. ఇలాంటి విషాదాలు జరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సమస్యలు ఉంటే చట్టపరమైన మార్గాలు, కౌన్సెలింగ్ ద్వారా పరిష్కరించుకోవాల్సిందే కానీ.. హింసకు పాల్పడకూడదని వారు సూచిస్తున్నారు.
గ్వాలియర్‌లో జరిగిన ఈ సంఘటన స్థానికులను మాత్రమే కాకుండా.. దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. కుటుంబ విభేదాలు ప్రాణహానికి దారితీసే స్థాయికి చేరడం ఆందోళన కలిగించే విషయం. పోలీసులు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు మరలా జరగకూడదని, కుటుంబ కలహాలు శాంతియుత మార్గాల్లో పరిష్కరించుకోవాలని సామాజిక వర్గాలు పిలుపునిస్తున్నాయి.
పట్టపగలు నడిరోడ్డుపై భార్యను కాల్చి చంపిన భర్త
మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్‌లో చోటు చేసుకున్న ఘటన.
ప్రముఖ రూప్ సింగ్ స్టేడియం ఎదుట భార్యను తుపాకీతో కాల్చి చంపిన భర్త అరవింద్.
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులను సైతం గన్‌తో బెదిరించిన నిందితుడు.
టియర్ గ్యాస్ ప్రయోగించి… pic.twitter.com/nDDXq7nEcb— ChotaNews App (@ChotaNewsApp) September 13, 2025