Hooch Tragedy: పంజాబ్‌లో ఘోరం జరిగింది. కల్తీ మద్యం 15 మందిని పొట్టను పొట్టుకుంది. కొందరు పరిస్థితి విషమంగా ఉంది. ఈ వ్యవహారంపై దృష్టి సారించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు, పలువురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
కల్తీ మద్యం కాటేసింది
అమృత్‌సర్ ఏరియాలోని మజిత ప్రాంతంలో ఈ ఘోరం చోటు చేసుకుంది. సోమవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో కొందరు వ్యక్తులు కల్తీ మద్యం పుచ్చుకున్నారు. తాగినవాళ్లు స్పాట్‌లో పడిపోయారు. మత్తు ఎక్కువై పడిపోయారని చాలామంది భావించారు. దాదాపు 10 మంది అలా పడిపోవడంతో అనుమానం వచ్చింది. ఈ విషయం తెలుసుకునే లోపు 15 మంది ఈ లోకాన్ని విడిచిపెట్టారు.
మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. కల్తీ మద్యం అమ్మతున్న పలువుర్ని అదుపులోకి తీసుకున్నారు. అందులో ప్రధాన నిందితుడు ప్రభ్జీత్‌సింగ్‌తోపాటు కొందర్ని అరెస్టు చేశారు పోలీసులు.
ఐదు గ్రామాల్లో ప్రభావం..
మరో వ్యక్తి కోసం గాలింపు చేపట్టారు. ఈ మద్యాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారనే దానిపై లోతుగా విచారణ చేస్తున్నారు. ఆ తరహా మద్యం తాగిన మరికొందర్ని గుర్తించే పనిలో పడ్డారు. ఈ ఘటనపై రెండు వేర్వేరు కేసులు నమోదు చేశారు పోలీసులు.
ALSO READ: పెళ్లిలో భోజనం బాగా లేదని కామెంట్ చేసిన వరుడి బంధువు, కాల్చిన వియ్యంకుడు
ఈ ఘటనపై అమృత్‌సర్ డిప్యూటీ కమిషనర్ మాట్లాడారు. గత రాత్రి ఈ విషయం మాకు తెలిసిందన్నారు. మద్యం సేవించిన వారి పరిస్థితి విషమంగా ఉందని ఐదు గ్రామాల నుండి నివేదికలు వచ్చాయన్నారు. సమాచారం అందుకున్న వెంటనే వైద్య బృందాలను ఆయా ప్రాంతాలకు తరలించినట్టు తెలిపారు. వైద్య బృందాలు ఇప్పటికీ ఇంటింటికీ తిరుగుతున్నాయని తెలిపారు.
ప్రభుత్వం తరపున సాధ్యమైనంత వరకు సహాయం అందిస్తున్నట్లు వెల్లడించారు. మరణాల సంఖ్య పెరగకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. సరఫరా చేసినవారిని అరెస్టు చేశామని, దర్యాప్తు జరుగుతోందన్నారు. కల్తీ మద్యం సరఫరాదారులపై బలమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నుండి కఠినమైన సూచనలు వచ్చాయన్నారు.