ORR firing: హైదరాబాద్ మహానగర శివార్లలోని ఔటర్ రింగ్ రోడ్డు (ORR)పై మంగళవారం అర్ధరాత్రి తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తుర్కయాంజల్ పరిధిలోని బొంగులూరు ఎగ్జిట్ నంబర్ 12 సమీపంలో పోలీసులు జరిపిన కాల్పుల ఘటన స్థానికంగా కలకలం రేపింది. తెలుగు రాష్ట్రాల్లో వరుస దొంగతనాలు, దోపిడీలతో పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న అంతర్రాష్ట్ర మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ భూషణ శ్రీకాంత్‌ను పట్టుకునే క్రమంలో ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది.
సినిమా సీన్‌ను తలపించిన ఛేజింగ్..
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. నిందితుడు భూషణ శ్రీకాంత్ బొంగులూరు వైపు వస్తున్నట్లు నల్గొండ సీసీఎస్ (CCS) పోలీసులకు ముందస్తుగా పక్కా సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన ప్రత్యేక పోలీసు బృందం ORR ఎగ్జిట్ 12 వద్ద మాటు వేసింది. నిందితుడి వాహనాన్ని గుర్తించి, చుట్టుముట్టి అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. అయితే, పోలీసులను చూసి అప్రమత్తమైన శ్రీకాంత్ వారిపై తిరగబడి, అక్కడి నుంచి తప్పించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించాడు. పోలీసులపై దాడికి కూడా వెనకాడకపోవడంతో పరిస్థితి అదుపు తప్పింది.
కాళ్లపై కాల్పులు.. చివరకు..
నిందితుడు చేతికి చిక్కినట్టే చిక్కి పారిపోతుండటం, పోలీసుల హెచ్చరికలను బేఖాతరు చేయడంతో నల్గొండ పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అతడిని నిలువరించేందుకు తక్షణ చర్యగా పోలీసులు తమ వద్ద ఉన్న ఆయుధాలతో శ్రీకాంత్ కాళ్లపై కాల్పులు జరిపారు. బుల్లెట్ గాయాలవ్వడంతో నిందితుడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే స్పందించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని, చికిత్స నిమిత్తం అత్యవసరంగా సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందుతోందని సమాచారం.
రెండు రాష్ట్రాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్!
పోలీసుల కాల్పుల్లో గాయపడిన భూషణ శ్రీకాంత్ సామాన్యుడు కాదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఇతనిపై డజన్ల కొద్దీ చోరీ, దోపిడీ, ఇళ్ల తాళాలు పగలగొట్టే (హౌస్ బ్రేకింగ్) కేసులు నమోదై ఉన్నాయి. గత కొంతకాలంగా పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్న ఈ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ను పట్టుకోవడం పోలీసు శాఖకు సవాల్‌గా మారింది. నల్గొండ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి అతడి ఆట కట్టించడంతో ఇరు రాష్ట్రాల పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం సేకరించేందుకు పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.
Also Read: పల్నాడులో ఘోరం.. ఆగివున్న లారీని ఢీకొన్న మరో లారీ.. నలుగురు సజీవ దహనం!