Crime Investigation Series: రియలిస్టిక్ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్లు, నకిలీ డిగ్రీలు, మెడికల్ ఎగ్జామ్స్ లీకేజీలతో ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే సిరీస్ ను ఓటీటీలో చూడాలి అనుకుంటున్నారా ? అయితే ఈ సిరీస్ మీ కోసమే. పైనున్న అంశాలతో 2021లో విడుదలైన ప్రముఖ హిందీ క్రైమ్ మిస్టరీ వెబ్ సిరీస్ ‘ది విజిల్ బ్లోయర్’ (The Whistleblower) ఈరోజు మన మూవీ సజెషన్. మరి ఈ సిరీస్ స్టోరీ ఏంటి ? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.
ఒక ప్రభుత్వ హాస్పిటల్‌లో ఇంటర్న్ డాక్టర్ గా పని చేస్తుంటాడు డాక్టర్ సంకేత్ (రిత్విక్ భోమిక్). చాలా తెలివిగా ఉండే ఆయన విలాసాలకు, సులభంగా డబ్బు సంపాదించడానికి అలవాటు పడి, బాధ్యతారాహిత్యంగా మారతాడు. అతని తండ్రి డాక్టర్ అశ్విన్ బద్రియా (సచిన్ ఖేడేకర్) సమాజంలో ఎంతో గౌరవం ఉన్న ఒక నిజాయితీ గల మెడికల్ కాలేజ్ డీన్. ఇక్కడే స్కామ్ లోకి కథ కాలు పెడుతుంది. సంకేత్ అనుకోకుండా వైద్య ప్రవేశ పరీక్షలలో (Medical Entrance Exams) జరుగుతున్న ఒక భారీ నెట్‌వర్క్, అక్రమాల గురించి తెలుసుకుంటాడు.
డబ్బుపై ఉన్న ఆశతో, అతను కూడా ఆ మాఫియాలో ఒక భాగస్వామిగా ఎంట్రీ ఇస్తాడు. ప్రతిభ గల పేద విద్యార్థులకు బదులుగా, డబ్బున్న వారి పిల్లలను దొడ్డిదారిన పాస్ చేయించడానికి నకిలీ అభ్యర్థులను (Proxies) కూర్చోబెట్టే ముఠాలో చేరిపోతాడు. ఇక్కడ కూడా రెండు ముఠాల మధ్య వైరం చోటు చేసుకుంటుంది. ఈ ఎగ్జామ్ లీకేజ్, సీట్ల అమ్మకాల వెనుక జైరాజ్ జాతవ్ (రవి కిషన్), సాధు అనే ఇద్దరు కరడుగట్టిన స్కామ్‌స్టర్స్ ఉంటారు. వీరిద్దరి మధ్య జరిగే ఆధిపత్య పోరులో సంకేత్ స్నేహితుడు దినేష్ బలైపోతాడు.
సంకేత్ చేస్తున్న ఈ అక్రమాల వల్ల అతని తండ్రి ప్రతిష్టకు భంగం వాటిల్లుతుంది. ఒకానొక దశలో ఈ స్కామ్ నెట్‌వర్క్ వల్ల కలిగే పరిణామాల గురించి తెలుసుకున్న సంకేత్ తండ్రి అనుమానాస్పద స్థితిలో హత్యకు గురవుతాడు. తండ్రి మరణంతో సంకేత్ ప్రపంచం ఒక్కసారిగా మారుతుంది. తన స్వార్థం, అత్యాశే తన తండ్రి ప్రాణాలను తీశాయని అతను తీవ్ర పశ్చాత్తాపానికి లోనవుతాడు. దీంతో అతను విజిల్ బ్లోయర్ గా మారతాడు. తండ్రిని చంపిన అసలైన విలన్లను పట్టుకోవడానికి, ఈ విద్యా వ్యవస్థను పట్టి పీడిస్తున్న మాఫియాను బయట పెట్టడానికి సంకేత్ రహస్య సమాచారాన్ని బయట పెట్టే వ్యక్తిగా మారతాడు.
ఈ క్రమంలో పొలిటికల్ లీడర్లు, పెద్ద ఐఏఎస్ అధికారులు, పోలీసులతో కూడిన అత్యంత ప్రమాదకరమైన వ్యవస్థను ఒంటరిగా అతను ఎలా ఎదుర్కొన్నాడు ? సాక్ష్యాలను ఎలా సేకరించాడు ? ప్రాణాలను పణంగా పెట్టి ఈ 10,000 కోట్ల భారీ స్కామ్‌ను ప్రపంచం ముందుకు ఎలా తెచ్చాడు ? అనే ఉత్కంఠభరితమైన మలుపులతో సిరీస్ నడుస్తుంది. ఈ సిరీస్ SonyLIV ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మొత్తం 9 ఎపిసోడ్లు ఉండగా, ఇందులో రిత్విక్ భోమిక్, రవి కిషన్, సచిన్ ఖేడేకర్, అంకిత శర్మ తదితరులు నటించారు. ఈ సిరీస్ హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. మొత్తం 9 ఎపిసోడ్లు ఉన్న ఈ సిరీస్, భారతదేశంలో సంచలనం సృష్టించిన మధ్యప్రదేశ్ ‘వ్యాపమ్ (Vyapam) విద్యా కుంభకోణం’ నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందింది.
Read Also : హైటెక్ అమ్యూజ్‌మెంట్ పార్క్ లో అరాచకం… మైండ్-బెండింగ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సిరీస్…