Hyderabad News : ఒకదాని తర్వాత మరో వాహనాన్ని అపహరించే ప్రయత్నం చేసిన ఓ యువకుడు.. విషయం బయటపడడంతో బుక్కైపోయాడు. ఊరి పెద్ద మనుషులు విషయంపై చర్చించేందుకు పంచాయితీకి పిలవగా.. భయంతో నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సమయంలో అతని పక్కనే ఉన్న తల్లి సైతం నదిలో దూకింది. దీంతో.. తల్లీకొడుకు ఇద్దరూ మరణించారు. ఈ ఘటన.. సంగారెడ్డి జిల్లాలోని ఆందోలు మండలం చింతకుంట శివారులో జరగగా.. బాధ్యులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఆందోలుకు చెందిన వడ్ల శ్యామ్ అనే 18 ఏళ్ల యువకుడు.. జోగిపేటలో క్లాత్ షోరూమ్ లో పనిచేస్తున్నాడు. కాగా.. అతడి ఊరిలో ఆదివారం రాత్రి ఓ వేడుక జరగగా.. దానికి వేరే ఊరు నుంచి బంధువులు వచ్చారు. వారు వచ్చిన వాహనాన్ని అదే గ్రామంలో రోడ్డు పక్కల నిలిపి ఉంచారు. ఈ విషయాన్ని గమనించిన శ్యామ్.. ఆ రోజు రాత్రి అపహరించి కౌడిపల్లి మండలం భుజిరంపేట వైపు తీసుకువెళ్లాడు. టాటాఎస్- ఆటో తీసుకు వెళుతున్నప్పుడు ఎవరూ గమనించకపోవడంతో చాలా దూరం వెళ్లాడు. కానీ.. దారి మధ్యలో ఆ వాహనం రోడ్డు పక్కన గుంతలో ఇరుక్కుపోయింది. దాంతో.. ఏం చేయాలో తెలియని శ్యామ్ తిరిగి అదే గ్రామానికి వచ్చి.. మరో ట్రాక్టర్ ను దొంగతనంగా తీసుకుని వెళ్లాడు.
రెండు దొంగతనాలు ఎవరికీ అనుమానం రాకుండా చేసినా… శ్యామ్ అనుకున్నట్లు దొంగతనం సాఫీగా సాగలేదు. టాటాఎస్ – ఆటోను బయటకు లాగుతున్న క్రమంలో ట్రాక్టర్ సైతం గుంతలో కూరుకుపోయింది. రెండు వాహనాలు ఇరుక్కుపోయినప్పుడైనా అక్కడి నుంచి వెళ్లాల్సిన యువకుడు.. మరో వాహనం కోసం మళ్లీ గ్రామానికి వెళ్లాడు. ఈ సారి మరో ట్రాక్టర్ ను దొంగతనం చేసేందుకు ప్రయత్నించగా.. అలికిడికి చుట్టుపక్కల జనం నిద్ర లేచారు. దాంతో.. దగ్గర్లోని బైక్ ను అపహరించుకుని పారిపోయాడు. తెల్లవారే వరుస దొంగతనాల గురించి గ్రామంలో చర్చించుకోవడంతో.. గ్రామ పెద్దలంతా కలిసి దుంపలకుంట గ్రామ చౌరస్తాలోని సీసీ ఫుటేజీని పరిశీలించారు. అందులో శ్యామ్ ను గుర్తించారు. పక్క గ్రామమే కావడంతో.. యువకుడిని గుర్తుపట్టిన గ్రామస్థులు.. చింతకుంట గ్రామానికి చెందిన పెద్ద మనుషులకు విషయాన్ని చేరవేశారు.
శ్యామ్ దొంగతనాలు చేసినట్లు సీసీ టీవీల్లో రికార్డ్ అయ్యిందని.. పంచాయితీకి రావాలని పిలిపించారు. దాంతో.. మంగళవారం సాయంత్రం తల్లి బాలమణితో కలిసి పక్క గ్రామానికి బయలుదేరిన శ్యామ్.. దొంగతనం విషయం బయటపడడంతో తీవ్రంగా బయపడిపోయాడు. దాంతో.. తన గ్రామ శివారుకు రాగానే.. మంజీరా నదిపై ఉన్న వంతెనపై బైక్ అపి.. నదిలోకి దూకేశాడు. తన కళ్ల ముందే కొడుకు నీటిలో దూకడంతో.. తల్లి బాలామణి కూడా నదిలోకి దూకేసింది. అక్కడే చేపలు పడుతున్న వాళ్లంతా ఈ ఘటనను చూశారు. వాళ్లే.. పోలీసులకు సమాచారం అందించారు.
Also Read : ట్రింగ్.. ట్రింగ్.. హలో.. ఒకటి నొక్కండి చాలు.. అధోగతే!
అయితే.. ఘటన జరిగిన ప్రాంతం తమ పరిధిలోకి రాదంటూ.. జోగిపేట, కౌడిపల్లి పోలీసులు ఒకరికొకరు సంబంధం లేదని వెళ్లిపోయారు.విషయం ఉన్నతాధికారుల దృష్టికి చేరడంతో.. జోగిపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దొంగతనం జరిగితే పోలీసు కేసు పెట్టకుండా గ్రామంలోనే పంచాయితీకి పిలిచిన పెద్ద మనుషులతో పాటు తమ కుమారుడు, భార్య మృతికి కారణమంటూ మృతురాలి భర్త ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. ఇందులో చింతకుంటకు చెందిన చాంద్ పాషా, మొఘలు, అస్లాం, శ్రీను, శ్రీశైలం, ఆంజనేయులుతో పాటు మరొకరు.. తన కుమారిడిపై ఆటో చోరి ఆరోపణలు చేశారని, జరిమానాగా రూ.5 లక్షలు చెల్లించాలని ఒత్తిడి తెచ్చారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందుకే.. తన కుమారుడు నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.