వెబ్ సిరీస్ : వికటకవి
దర్శకత్వం: ప్రదీప్ మద్దాలి
కథ: సాయి తేజ్
సంగీతం: అజయ్ అరసాడా
నిర్మాత: రజనీ తాళ్లూరి
నటీనటులు: నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్, షిజు మీనన్, రఘు కుంచె, తారక్ పొన్నప్ప, ముక్తర్ ఖాన్, అమిత్ తివారీ తదితరులు
ఓటీటీ ప్లాట్‌ఫామ్: జీ5
ఎపిసోడ్‌లు : 6 (ఒక్కో ఎపిసోడ్ 40 నిమిషాలు)
Vikkatakavi Web Series Review : నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ కలిసి నటించిన పీరియాడికల్ థ్రిల్లర్ సిరీస్ ‘వికటకవి’. ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వచించిన ఈ వెబ్ సిరీస్ ను రజనీ తాళ్లూరి నిర్మించారు. ఈ సిరీస్ తాజాగా ఆరు-ఎపిసోడ్లతో ఫస్ట్ తెలంగాణ డిటెక్టివ్ వెబ్ సిరీస్ గా Zee5లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. కల్పిత గ్రామమైన అమరగిరిలో రహస్యాలను ఛేదించే యువ డిటెక్టివ్ కథతో సిరీస్ సాగుతుంది. 1940 -1970ల మధ్య కాలంలో తెలంగాణ ప్రాంతంలో నడిచే ఈ వెబ్ సిరీస్ పేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం.
కథ
1970లలో నల్లమల అడవికి సమీపంలోని అమరగిరి గ్రామంలో స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఒకప్పుడు రాజా నరసింహారావు (షిజు మీనన్) పాలనలో ఉన్న ఈ గ్రామంలో… ఇప్పుడు విచిత్రమైన సంఘటలు జరుగుతూ ఉంటాయి. రాజా ఏకైక కుమారుడు మహదేవ్ (తారక్ పొన్నప్ప) రహస్య మరణం తర్వాత ఆయన మానసికంగా కుంగిపోతాడు. ఇంతలో అతని అల్లుడు రఘుపతి గ్రామాన్ని తన అదుపులోకి తీసుకుంటాడు. అయితే ఈ గ్రామంలో ఒకప్పుడు కొండపై ఉన్న దేవతల గుట్టపై జాతర జరిపేవారు. కానీ ఒక భయంకరమైన వరద వచ్చి చాలామంది ప్రాణాలను బలి తీసుకోవడంతో, దేవతకు కోపం వచ్చిందని భయపడుతూ ఉంటారు గ్రామస్తులు. ఆ సంఘటన తరువాత ఒక్కరు కూడా ఆ గుట్టపైకి వెళ్లరు. ఒకవేళ ఎవరైనా వెళ్ళినా గతాన్ని మర్చిపోయి, పిచ్చి వాళ్ళు అవుతారు. మరోవైపు హైదరాబాద్‌లో రామకృష్ణ (నరేష్ అగస్త్య) అనే డిటెక్టివ్, అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లి ఆపరేషన్ కోసం డబ్బు సంపాదించడానికి కష్టపడుతూ ఉంటాడు. అమరగిరికి చెందిన ఒక ప్రొఫెసర్ అతనికి గ్రామ సమస్యల గురించి చెప్పి, అతను రహస్యాన్ని ఛేదిస్తే బహుమతి ప్రామిస్ చేస్తాడు. దీంతో రామకృష్ణ అమరగిరికి వెళ్లి, లక్ష్మి (మేఘా ఆకాష్)ని కలుసుకుని, రాజాకు తనను పరిచయం చేసుకుంటాడు. మిస్టరీని ఛేదించడానికి 48 గంటల గడువు ఇస్తారు. మరి గంటల వ్యవధిలోనే రామకృష్ణ ఆ మిస్టరీ ఏంటో కనిపెట్టాడా ? ఎందుకు ఆ ఊళ్ళో వింత పరిస్థితులు ఏర్పడ్డాయి? అసలు ఆ గుట్ట మీద ఏముంది? అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎందుకు పిచ్చి వాళ్ళు అవుతున్నారు? అనే విషయాలు తెలియాలంటే ఈ సిరీస్ ను చూడాల్సిందే.
విశ్లేషణ
‘వికటకవి’ని డైరెక్టర్ పురాతన కాలంలో జరిగిన సంఘటనలతో, అమరగిరి హాంటెడ్ బ్యాక్‌డ్రాప్‌తో ముడిపెట్టి తీశారు. అయితే ఆ సస్పెన్స్ వాతావరణాన్ని ఫీల్ అవ్వడానికి ప్రేక్షకులకు టైమ్ పడుతుంది. కథ, కథనం బాగానే ఉన్నప్పటికీ, ఈ సిరీస్ లో ప్రేక్షకులను థ్రిల్ చేసే మంచి ట్విస్ట్ తో క్లైమాక్స్ ను రూపొందించడంలో డైరెక్టర్ తడబడ్డాడు. మధ్యలో కొన్ని ఎపిసోడ్ లు సాగదీసినట్టు అన్పిస్తాయి. పిచ్చోళ్ళు అయిన గ్రామస్థులను కట్టివేయడం, వారిని గదిలో బంధించడం వంటి కొన్ని ప్లాట్ పాయింట్లు సిరీస్ లో డ్రామా ఎక్కువైన ఫీలింగ్ ను తెప్పిస్తాయి. పైగా అవాస్తవంగా అనిపిస్తాయి. అలాగే విలన్ ఊర్లో ఇలాంటి కల్లోలం సృష్టించడానికి గల కారణాలు కూడా అస్పష్టంగానే ఉన్నాయి. ప్రత్యేకించి ఆనకట్ట వల్ల గ్రామం వరదలు ముంచెత్తడం కనెక్ట్ కాదు. కొన్ని లాజిక్ లెస్ పాయింట్లు సిరీస్ పై ఎఫెక్ట్ చూపిస్తాయి. అయితే ఇన్ని లోపాలు ఉన్నప్పటికీ దర్శకుడు సస్పెన్స్‌ని మెయింటైన్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. అలాగే ప్రతీ పాత్ర కీలకమే అన్పిస్తుంది. అయితే సిరీస్ లో హీరో హీరోయిన్ ఉన్నప్పటికీ రొమాన్స్ అనేది ఎక్కడా కన్పించదు. ఈ అంశాన్ని ఆశిస్తే మాత్రం నిరాశ తప్పదు.
నటీనటులు
డిటెక్టివ్‌గా నరేష్ అగస్త్య అద్భుతమైన నటనను కనబరిచారు. మేఘా ఆకాష్ లక్ష్మి పాత్రలో మెప్పించింది. రాజా నరసింహారావుగా షిజు మీనన్, మహదేవ్‌గా తారక్ పొన్నప్ప, రఘు కుంచె, అమిత్ తివారీ తదితరులు తమ నటనతో మెప్పించారు.
దర్శకుడు ప్రదీప్ మద్దాలి పీరియాడిక్ సెట్టింగ్ లతో ప్రేక్షకులను 1940-70ల కాలంలోకి సక్సెస్ ఫుల్ గా తీసుకెళ్ళాడు. కానీ క్లైమాక్స్‌లో చేసిన కొన్ని పొరపాట్లు మైనస్ పాయింట్స్ అయ్యాయి. షోయబ్ సిద్ధిఖీ విజువల్స్, అజయ్ అరసాడ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. పీరియాడిక్ సెట్స్, కాస్ట్యూమ్స్, లొకేషన్‌లు ప్రేక్షకులను కథలో లీనమయ్యేలా చేశాయి.
మొత్తానికి
పక్కా డిటెక్టివ్ థ్రిల్లర్ అనలేము. కానీ లాజిక్స్ అక్కర్లేదు అనుకుంటే ఫ్యామిలీతో కలిసి ఓసారి ‘వికటకవి’ చూడగలిగే వెబ్ సిరీస్.
Vikkatakavi Web Series Rating – 1.25/5