Bachhala Malli Teaser: ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ వారసుడిగా సినిమాల్లో అడుగుపెట్టి కామెడీ హీరోగా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్నాడు అల్లరి నరేశ్ (Allari Naresh). తను హీరోగా పరిచయమయిన దాదాపు 15 ఏళ్ల పాటు కామెడీ సినిమాలు తప్పా వేరే జోనర్‌లో చిత్రాలు చేయలేదు. తనకు కూడా అవే గుర్తింపు తెచ్చిపెట్టాయి కూడా. కానీ కోవిడ్ తర్వాత అల్లరి నరేశ్ స్టోరీ సెలక్షన్ మారిపోయింది. వివిధ జోనర్లలో సినిమాలు ట్రై చేస్తూ యాక్టర్‌గా తనేంటో అందరికీ నిరూపించుకోవాలని అనుకుంటున్నాడు. అదే తోవలో త్వరలో ‘బచ్చల మల్లి’ చిత్రంతో థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమయ్యాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలయ్యింది.
అమృతతో ప్రేమ
‘బచ్చల మల్లి’లో టైటిల్ పాత్రలో అల్లరి నరేశ్ నటిస్తుండగా.. తనకు జోడీగా అమృత అయ్యర్ అలరించనుంది. ఈ మూవీ టీజర్ మొదలవ్వగానే ఆఫీస్‌లో పనిచేసుకుంటున్న అమృత అయ్యర్ దగ్గరకు వచ్చి తన స్టైల్‌లో ప్రపోజ్ చేస్తాడు అల్లరి నరేశ్. ‘‘కావేరి.. నీతో కొంచెం మాట్లాడాలి. నాకు సిగరెట్ అలవాటు ఉంది, మందు అలవాటు ఉంది, అప్పుడప్పుడు అమ్మాయిల అలవాటు కూడా ఉంది’’ అని చెప్పగానే అమృత షాకవుతుంది. మొత్తంగా రౌడీగా ఉన్న అల్లరి నరేశ్‌ను చూసి భయపడుతూ తప్పించుకొని తిరుగుతుంది. కానీ అమృతను మాత్రం అస్సలు వదలడు నరేశ్. చివరికి అమృతకు కోపం వచ్చి తనపై చేయి చేసుకుంటుంది. అక్కడ టీజర్ మరో మలుపు తిరుగుతుంది.
Also Read: యూట్యూబ్ ఛానల్ యాంకర్ కి మరీ ఇంత సంపాదన… ఇన్ని కోట్లతో లగ్జరీ ఇల్లు..?
యెధవలాగా తయారయ్యావు..
‘‘మీ నాన్న నిన్ను గొప్పవాడిని చేసేద్దాం అనుకుంటే నువ్వేంటి ఇలా యెధవలాగా తయారయ్యావు’’ అంటూ రావు రమేశ్ వాయిస్‌తో డైలాగ్ వస్తుంది. అది వినగానే అల్లరి నరేశ్‌కు చాలా కోపం వస్తుంది. ‘‘ఎవడి నాన్న? ఎవడికి నాన్న?’’ అంటూ పోలీస్‌ల మీద చేయి చేసుకుంటాడు. అప్పుడే రావు రమేశ్ కూడా ఒక పోలీస్‌గా సీన్‌లోకి ఎంటర్ అవుతారు. ‘‘కొట్టాలంటే ఇక్కడ కొట్టేయండి. చితక్కొట్టాలంటే పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లండి’’ అంటూ చేతులెత్తేసి నిలబడతాడు నరేశ్. ‘‘చిన్నప్పటి నుండి నీ మూర్ఖత్వం వల్లే నీ జీవితం ఇలా అయ్యింది’’ అంటూ నరేశ్ తల్లి కూడా తనను తిడుతూనే ఉంటుంది.
నేను మారను..
ఎవరు ఎంత చెప్తున్నా కూడా నేను ఎవ్వరి కోసం మారను. నాకు నచ్చినట్టు నేను బ్రతుకుతాను అని నరేశ్ అనుకుంటూ ఉంటాడు. ‘బచ్చల మల్లి’ (Bachchala Malli) టీజర్ చివర్లో చిన్నపిల్లలు నరేశ్‌ను చందా అడగడానికి రాగా.. ఆ డబ్బును తీసుకొని వెళ్లిపోతాడు. దీన్ని బట్టి చూస్తే అసలు ఈ సినిమాలో తనది ఎలాంటి క్యారెక్టర్ అని అర్థమవుతుంది. గత కొన్నేళ్లలో పలు యాక్షన్ సినిమాల్లో కూడా అల్లరి నరేశ్ నటించాడు. కానీ ‘బచ్చల మల్లి’లో ఇప్పటివరకు లేనంత మాస్ లుక్‌లో, మ్యానరిజంలో కనిపించనున్నాడని టీజర్ చూస్తే అర్థమవుతోంది. సుబ్బు మంగాదేవి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ డిసెంబర్ 20న విడుదలకు సిద్ధమయ్యింది.