Doctor Conwoman Weddings | ఓ యువతి తాను డాక్టర్‌నని, నర్సునని చెప్పుకుంటూ సంపన్నులను టార్గెట్ చేస్తూ అయిదు వివాహాలు చేసుకుంది. పెళ్లి తరువాత కొంతకాలం వారితో కాపురం చేయడం.. ఆ తరువాత వారిని దోచుకొని అక్కడి నుంచి పారిపోవడమే ఆమె వృత్తి. కానీ అనుకోని రీతిలో ఆమె ఇద్దరు భర్తలు సినీఫక్కీలో కలవడంతో ఆమె బండారం బయటపడింది. దీంతో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. తమిళనాడు రాష్ట్రం మైలాదుత్తురై జిల్లా శీర్గాళి సమీపంలోని కొడియంపాళయం జాలరి గ్రామంలో నివసిస్తున్న లక్ష్మి (32) అనే మహిళ ఐదు పెళ్లిళ్లు చేసుకున్న విషయం బహిర్గతమైంది. ఆమె డాక్టర్ అని చెప్పుకుని ప్రేమ వలలో పడవేసి, భర్తల నుంచి నెలనెలా డబ్బు వసూలు చేస్తున్నట్టు తేలింది. ఈ విషయం వివాహ ఆహ్వాన బ్యానర్‌లో ఫోటో వైరల్ అయ్యాక బయటపడింది. శీర్గాళి పోలీసులు ఆమెను సోమవారం అరెస్టు చేశారు.
Also Read: కోడలి చేత వ్యభిచారం.. మానసిక రోగిగా మిగిలిన బాధితురాలు
మొదటి భర్త మృతి
లక్ష్మి పన్నెండో తరగతి వరకు చదువుకుంది. 2010లో ఆమె తొలి వివాహం పళయర్ గ్రామానికి చెందిన శిలంబరసన్‌తో చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, శిలంబరసన్ మరణించిన తర్వాత, లక్ష్మి పిల్లలను అతని ఇంటి వద్ద వదిలేసి వెళ్లిపోయింది.
రెండో వివాహం తరువాత పరార్
2017లో లక్ష్మి పుదూర్ గ్రామానికి చెందిన పెయింటర్ నెపోలియన్‌తో పరిచయం ఏర్పరచుకుంది. తన పేరు ‘మీరా’గా మార్చుకుని, ఆమె నెపోలియన్‌ను ప్రేమ వలలో పడవేసి, రెండో వివాహం చేసుకుంది. కొంత కాలం కాపురం చేసిన తర్వాత, లక్ష్మి నెపోలియన్‌ను వదిలించుకుంది.
మూడో భర్తకు మొండిచేయి
2021లో చిదంబరం గోల్డన్ నగర్‌లో నివసిస్తున్న ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి రాజాతో లక్ష్మికి పరిచయం ఏర్పడింది. ఆమె తన పేరు నిషాంతిని అని చెప్పుకుని, తాను ఎంబీబీఎస్, ఎమ్‌ఎస్ చదువుకున్న డాక్టర్ అని చెప్పి, రాజాను మూడో వివాహం చేసుకుంది. ఆమె రాజాతో చిదంబరంలో రెండేళ్లు కాపురం చేసింది.
నాల్గవ వివాహంతో గుట్టు రట్టు
2024లో లక్ష్మి శీర్గాళి తిట్టై గ్రామానికి చెందిన ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగి శివచంద్రన్‌తో పరిచయం ఏర్పరచుకుంది. ఆమె తాను డాక్టర్ అని చెప్పుకుని, చిదంబరం ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్నట్లు తెలిపింది. 2025 జనవరి 20న లక్ష్మి శివచంద్రన్‌ను వివాహం చేసుకుంది. అయితే శివచంద్రన్ బ్యాంకులో ఒక చిన్న ఉద్యోగి.. కానీ అతని స్థాయికి ఒక డాక్టర్ ని వివాహం చేసుకోవడంతో అతను సంతోషంగా తన భార్య ఫొటో, వివాహ ఆహ్వాన బ్యానర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
అక్కడే మోసగత్తె లక్ష్మి బండారం బయటపడింది. శివచంద్రన్ పోస్ట్ లక్ష్మి రెండో భర్త అనుకోకుండా నెపోలియన్ చూశాడు. దీంతో ఆమె నా భార్య.. అంటూ సోషల్ మీడియా ద్వారా శివచంద్రన్‌ను సంప్రదించాడు. ఇద్దరూ సోషల్ మీడియా దూషించుకున్నాక.. కోపంతో కలిశారు. అప్పుడు నెపోలియన్ ఆమె తన భార్య మీరా అని.. పెళ్లి తరువాత కొన్ని నెలలకు ఇంట్లో బంగారం, ధనమంతా దోచుకొని వెళ్లిపోయిందని చెప్పాడు. దీంతో ఖంగుతిన్న శివచంద్రన్ ఆమె గురించి ఆరా తీశాడు. ఇదంతా ఆమె తెలియకుండా రహస్యంగా తెలుసుకున్నాడు. ఆమె అసలు వైద్యురాలు కాదని తెలియడంతో పోలీసుల వద్దకు నెపోలియన్ తో కలిసి ఫిర్యాదు చేశాడు. పోలీసులు వెంటనే లక్ష్మిని అరెస్టు చేసి విచారణ చేయగా.. ఆమెకు మరో భర్త ఉన్నట్లు తెలిసింది.
విదేశాల్లో మరో భర్త
పోలీసుల విచారణలో లక్ష్మి మరో వివాహం చేసుకున్నట్టు తేలింది. కరూర్‌కు చెందిన ఒక వ్యక్తి ఆమెను వివాహం చేసుకుని, విదేశాలలో పని చేస్తూ, ప్రతి నెలా రూ. 50,000 లక్ష్మికి పంపుతున్నట్టు తేలింది. లక్ష్మి ఈ డబ్బును తన జీతంగా చెప్పుకుని ఇతర భర్తలను మోసం చేసింది. అయితే విదేశాల్లో ఉన్న భర్తను ఎప్పుడు వివాహం చేసుకుందో ఇంకా స్పష్టంగా తెలియలేదు.
పోలీసుల విచారణలో చాలా ఆసక్తికర విషయాలు తెలిశాయి. ఆమె భర్తల్లో ఒకరు ఇంటిలో ఉన్న పశువులను విక్రయించి, తన డాక్టర్ భార్య కోసం అత్యాధునిక సౌకర్యాలతో టాయ్‌లెట్ కట్టించినట్టు కూడా తేలింది. లక్ష్మి వివాహం చేసుకున్న ముగ్గురు భర్తలను కూడా తమది ప్రేమ వివాహం అని.. అందుకోసం తన తల్లిదండ్రులు అంగీకరించరని చెప్పి కాలం గడిపేది. కొంతకాలం తరువాత తన తల్లిదండ్రులు నుంచి ఆస్తి వస్తుందని నమ్మబలికించి ఆ తరువాత అదును చూసి ఇంట్లోని ధనంతో పరారయ్యేది.