హైదరాబాద్ లో బోలెడు పర్యాటక ప్రాంతాలున్నాయి. సిటీ నుంచి ఒక్క రోజులో వెళ్లి వచ్చేందుకు పలు పుణ్యక్షేత్రాలు కూడా ఉన్నాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్, వరంగల్ లాంటి ప్రదేశాలకు వెళ్లి రావచ్చు. అయితే, హైదరాబాద్ కు సమీపంలో ఎలాంటి హిల్ స్టేషన్లు లేవు. ఒక వేళ వీకెండ్ లో హిల్ స్టేషన్స్ వెళ్లాలంటే.. బెస్ట్ హిల్ స్టేషన్లు ఏవి? ఎంతదూరంలో ఉన్నాయి? ఎలా వెళ్లాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
⦿ అరకు లోయ: ఇది హైదరాబాద్ నుంచి 705 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. వెళ్లడానికి సుమారు 20 గంటలు పడుతుంది. హైదరాబాద్ నుంచి రైలు లేదంటే బస్సులో విశాఖపట్నం చేరుకోవాలి. అక్కడి నుంచి అరకు లోయకు క్యాబ్/టాయ్ ట్రైన్ లో వెళ్లాలి. కనీసం మూడు రోజులు టైమ్ కేటాయించడం మంచిది. ఏపీలో అత్యంత అందమైన ప్రదేశాల్లో అరకు లోయ ఒకటి. అద్భుతమైన కాఫీ తోటలు కనువిందు చేస్తాయి. తూర్పు కనుమలలో ఉన్నఅరకు లోయ ఏడాది పొడవునా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగి ఉంటుంది. బొర్రా గుహలు, వాటర్ డ్యామ్ లు ఆకట్టుకుంటాయి.
⦿ దండేలి: హైదరాబాద్ నుంచి 565 కి.మీ ఉంటుంది. హుబ్లీ వరకు రైలు లేదంటే బస్సులో వెళ్లాలి. అక్కడి నుంచి టాక్సీ లేదంటే లోకల్ బస్సులో దండేలి చేరుకోవచ్చు. హైదరాబాద్ సుమారు 15 గంటలు పడుతుంది. కర్నాటకలోని అత్యంత అందమైన ప్రదేశాల్లో దండేలి ముఖ్యమైనది. కాళి నది ఒడ్డున ఉన్న ఈ హిల్ స్టేషన్ ఏడాది పొడవునా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తుంది. వన్యప్రాణులతో కూడిన పచ్చని అడవులు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.
⦿ లోనావాలా: హైదరాబాద్ నుంచి 630 కి.మీ దూరంలో ఉంటుంది. హైదరాబాద్ నుంచి లోనావాలాకు నేరుగా బస్సులో లేదంటే రైల్లో ప్రయాణించవచ్చు. సుమారు 13 గంటల సమయం పడుతుంది. మహారాష్ట్రలోని ప్రసిద్ధ హిల్ స్టేషన్లలో ఒకటైన లోనావాలాలో అద్భుతమైన ప్రకృతి అందాలు ఆకట్టుకుంటాయి. పచ్చదనం, చల్లని గాలులు, సరస్సులు, కోటలు ఆకట్టుకుంటాయి.
⦿ మాథెరన్: ఇది హైదరాబాద్ నుంచి 690 కి. మీ దూరంలో ఉంటుంది. హైదరాబాద్ నుంచి పూణెకు రైలు లేదంటే బస్సులో వెళ్లాలి. అక్కడి నుంచి నెరల్ కు లోకల్ రైలు ఎక్కాలి. నెరల్ నుంచి మతేరాన్ వరకు షేర్డ్ క్యాబ్స్, టాయ్ ట్రైన్ లో వెళ్లొచ్చు. హైదరాబాద్ నుంచి మతేరాన్ చేరుకోవడానికి సుమారు 13 గంటల సమయం పడుతుంది. మంచుతో కూడిన వాతావరణం, వలసరాజ్యాల వాస్తుశిల్ప సంపద, పచ్చదనం ఆకట్టుకుంటాయి. మాథెరాన్ చేరుకోవడానికి అడవి గుండా చేసే చిన్న ట్రెక్కింగ్ ఉల్లాసాన్ని కలిగిస్తుంది.
⦿ హార్సిలీ హిల్స్: హైదరాబాద్ నుంచి 530 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్ నుంచి మదనపల్లెకు బస్సులో వెళ్లాలి. అక్కడి నుంచి బస్సు లేదంటే ఆటోలో హార్సిలీ హిల్స్ కు వెళ్లొచ్చు. హైదరాబాద్ నుంచి అక్కడికి వెళ్లడడానికి 12 గంటల సమయం పడుతుంది. ఇక్కడ చల్లని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు. ఈ కొండ ప్రాంతం దట్టమైన అడవిని కలిగి ఉంటుంది. సమీపంలో బోలెడు ఆలయాలు ఉంటాయి. ట్రెక్కింగ్, అందమైన పక్షుల కిలకిలరావాలు ఆకట్టుకుంటాయి.
⦿ చికమగళూరు: హైదరాబాద్ నుంచి 650 కిలో మీటర్ల దూరం ఉంటుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు బస్సులో లేదంటే రైలులో వెళ్లొచ్చు. అక్కడి నుంచి రోడ్ ట్రిప్ ద్వారా వెళ్లొచ్చు. హైదరాబాద్ నుంచి చికమగళూరుకు వెళ్లేందుకు 14 గంటల సమయం పడుతుంది. ట్రెక్కింగ్ కు అనుకూలంగా ఉంటుంది. దట్టమైన అడవి, అద్భుతమైన పర్వతాలతో కనువిందు చేస్తుంది. అద్భుతమైన జలపాతాలు ఆకట్టుకుంటాయి.
⦿ ఊటీ: హైదరాబాద్ నుంచి 855 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. ముందుగా కోయంబత్తూర్ కు బస్సులో లేదంటే రైలులో వెళ్లొచ్చు. అక్కడి నుంచి క్యాబ్ లేదంటే బస్సులో ఊటీకి వెళ్లవచ్చు. నీలగిరి కొండలలోని ఊటీ ఆహ్లాదకరమైన అనుభూతిని కల్పిస్తుంది. ప్రకృతి అందాలు, అద్భుతమైన సరస్సులు ఆకట్టుకుంటాయి.
⦿ పంచగని: హైదరాబాద్ నుంచి 568 కి.మీ దూరంలో ఉంటుంది. పూణే వరకు రైలు లేదంటే బస్సులో వెళ్లాలి. అక్కడి నుంచి క్యాబ్ లేదంటే బస్సులో వెళ్లొచ్చు. సుమారు 12 గంటల సమయం పడుతుంది. 5 కొండలతో చుట్టబడిన పంచగని ఆకట్టుకుంటుంది. ఇక్కడ సూర్యోదయం, సూర్యాస్తమయాలు ఎంతో కనువిందు చేస్తాయి.
Read Also: దేశంలో అత్యంత అందమైన రైలు ప్రయాణాలు, అస్సలు మిస్ కావద్దు!