హైదరాబాద్, స్వేచ్ఛ : సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువకుడు.. మైనర్ బాలికను నమ్మించి పలుమార్లు దారుణానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా రిమ్స్‌లో చదివే విద్యార్థిని(17)కి రంగారెడ్డి జిల్లాకు చెందిన శివ(22) అనే యువకుడితో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. అనంతరం వారి స్నేహం ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకుంటానని శివ, సదరు యువతికి మాయమాటలు చెప్పి నమ్మించాడు. అతడి మాయమాటలను గుడ్డిగా నమ్మిన ఆ బాలిక ఈనెల 9న ఒంటరిగా సికింద్రాబాద్‌కు వచ్చింది.
ఇదే అదనుగా భావించిన శివ. మైనర్ బాలికపై పలుమార్లు దారుణానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను ఇంటికి పంపించేశాడు. అయితే, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో బాధితురాలు భయంతో జరిగిన విషయం ఇంట్లో చెప్పింది. అనంతరం విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. బాధితురాలు ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా నిందితుడి శివపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. బాలికలు, యువతులు సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలని ఈ సందర్భంగా పోలీసులు సూచించారు.
అదృశ్యమైన బాలిక.. బావిలో శవమై..
సంగారెడ్డి, స్వేచ్ఛ : అదృశ్యమైన బాలిక బావిలో శవమై తేలిన ఘటన రాయికోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాయికోడ్ మండలం సంగాపూర్ గ్రామానికి చెందిన వైష్ణవి(10) ఆరు రోజుల క్రితం కనిపించకుండా పోయి.. గ్రామంలోని ఓ బావిలో శవమై తేలింది. పోలీసులకు సమాచారం రావడంతో ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జహీరాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. బాలిక నాయనమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా నెల రోజుల క్రితం వైష్ణవి చెల్లెలు కూడా అనుమానాస్పద మృతి చెందగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.