Husband Kills Wife: కడప జిల్లాలో దారుణం జరిగింది. భార్యను కిరాతకంగా హత్య చేసి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు ఓ భర్త. ఈ దారుణ ఘటన చాపాడు మండలం పెద్ద చీపాడులో చోటు చేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. భర్త గోపాల్ స్థానికంగా ఓ ప్రైవేట్ బస్సులో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతని భార్య సుజాతపై గత కొంతకాలం నుంచి.. వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానం గోపాల్‌కి మొదలైంది. ఆమెను పలు మార్లు హెచ్చరించినా వినకుండా.. అవే సంభంధాలు కొనసాగిస్తున్నట్లు గోపాల్ వాంగ్మూలంలో పేర్కొన్నాడు. ఆవేశంతో రెండు రోజుల క్రితం ఆమెను హత్య చేసినట్టు వెల్లడించాడు.
హత్య అనంతరం శవాన్ని అడవిలో పడేసిన భర్త
హత్య అనంతరం గోపాల్ తన భార్య మృతదేహాన్ని.. చాపాడు మండలానికి సమీపంలోని వనిపెంట అటవీ ప్రాంతంలో.. పడేసినట్లు పోలీసులకు తెలిపాడు. మృతదేహాన్ని అక్కడికి తీసుకెళ్లి దాచినట్లు వివరించాడు. పోలీసులకు సమాచారం ఇచ్చిన గోపాల్, తాను తట్టుకోలేక స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు.
పోలీసుల సెర్చింగ్ ఆపరేషన్
గోపాల్ చెప్పిన ఆధారాల ప్రకారం మృతదేహం కోసం పోలీసులు.. వనిపెంట అటవీ ప్రాంతంలో తీవ్రంగా గాలిస్తున్నారు. డాగ్ స్క్వాడ్ సహకారంతో పోలీసులు అడవిని ముట్టడించి.. శవం కోసం గాలింపు చేపట్టారు. మృతదేహం ఇంకా లభ్యమవ్వలేదు. కానీ గోపాల్ చెప్పిన ప్రాంతంలో కొన్ని ఆధారాలను సేకరించినట్లు తెలుస్తోంది.
వివాహేతర సంబంధమే హత్యకు ప్రధాన కారణం?
గోపాల్ వాంగ్మూలం ప్రకారం, సుజాతపై ఉన్న అనుమానమే ఈ హత్యకు దారి తీసింది. ఎన్నిసార్లు చెప్పినా వినలేదు. కుటుంబ పరువు తీసింది అంటూ గోపాల్ పోలీసులకు చెప్పినట్లు సమాచారం. అయితే ఇది పూర్తిగా గోపాల్ వ్యాఖ్యల ఆధారం మీదే కాకుండా.. నిజంగా సుజాతకు ఏవైనా సంబంధాలు ఉన్నాయా? లేదా అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.
స్థానికుల్లో కలకలం
ఘటన చోటుచేసుకున్నపెద్దచీపాడు గ్రామంలో కలకలం రేగింది. స్థానికులు షాక్‌కు గురయ్యారు. నిన్నటి వరకు కలిసి తిరిగిన భార్యాభర్తల మధ్య ఇంతటి విభేదాలు ఉన్నాయని అనుకోలేదని.. గోపాల్ ఇలాంటి దారణ హత్యకు పాల్పడతాడని ఊహించలేకపోతున్నాం అన్నారు. సమాచారం తెలుసుకున్న సుజాత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read: పంజాగుట్ట మెట్రో స్టేషన్ వద్ద లారీ బోల్తా.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
దర్యాప్తు కొనసాగుతోంది
ప్రస్తుతం పోలీసులు గోపాల్‌ను కస్టడీలోకి తీసుకొని మరిన్ని వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. మృతదేహం కోసం కొనసాగుతున్న గాలింపు అనంతరం.. కేసును మరింత స్పష్టంగా దర్యాప్తు చేయనున్నారు.