కన్నబిడ్డలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కాల యముడిగా మారిపోయాడు. పోటీ ప్రపంచంలో రాణించలేని వారిని కిరాతకంగా హత్య చేశాడు. ఆ తర్వాత తానూ ఫ్యాన్ కు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన ఏపీలోని కాకినాడలో జరిగింది. కన్నతండ్రే పిల్లలను దారుణంగా హత్య చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన వానపల్లి చంద్ర కిశోర్.. కాకినాడ ONGCలో అసిస్టెంట్ అకౌంటెంట్ గా పని చేస్తున్నాడు. అతడికి భార్య తనూజ, ఇద్దరు పిల్లలు జోషిల్ (7), నిఖిల్ (6) ఉన్నారు. ఉద్యోగం నేపథ్యంలో తోట సుబ్బారావు నగర్ లోని ఓ అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్నారు. అతడి పిల్లల్లో జోషిల్ ఒకటో తరగతి చదువుతుండగా, నిఖిల్ యూకేజీ చదువుతున్నాడు. హోలీ సందర్భంగా భార్య, పిల్లలను తీసుకుని తన ఆఫీస్ లో జరిగే వేడుకల్లో పాల్గొన్నాడు కిశోర్. భార్యను అక్కడే ఉండమని.. పిల్లలకు యూనిఫామ్ కుట్టించేందుకు టైలర్ దగ్గర కొలతలు ఇప్పించి వస్తానని చెప్పి ఇంటికి వెళ్లాడు. ఇద్దరు పిల్లలకు కాళ్లు చేతలు కట్టేశాడు. బాత్ రూమ్ లో బకెట్ లో నీళ్లు నింపాడు. ఇద్దరు పిల్లలను నీళ్లలో ముంచాడు. ఊపిరాడక పిల్లలకు ప్రాణాలు విడిచారు. ఆ తర్వాత చంద్ర కిశోర్ బెడ్ రూమ్ లోకి వెళ్లి ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఎంతకూ తిరిగి రాకపోవడంతో..
పిల్లలతో కలిసి ఇంటికి వెళ్లిన భర్త ఎంతకూ తిరిగి రాకపోవడంతో తనూజకు భర్తకు ఫోన్ చేసింది. తను ఫోన్ ఎత్తకపోవడంతో ఆమెకు భయం వేసింది. వెంటనే కిశోర్ ఆఫీస్ లో పని చేసే ఉద్యోగులతో కలిసి ఇంటికి వచ్చింది. ఇంటి తలుపులు పెట్టి ఉన్నాయి. కిటికీలో నుంచి చూస్తే కిశోర్ ఫ్యాన్ కు ఉరేసుకుని కనిపించాడు. తలుపులు బద్దలు కొట్టి ఇంట్లోకి వెళ్లి చూస్తే, పిల్లలు ఇద్దరూ బకెట్ లో తలలు ముగిని చనిపోయి ఉన్నారు. ఒక్కసారి తనూజ కుప్పకూలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేసుకున్నారు. ఇంట్లో దొరికిన సూసైడ్ లెటర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
సూసైడ్ నోట్ లో ఏం రాసి ఉందంటే?
ఈ సూసైడ్ లెటర్ లో కిశోర్ షాకింగ్ విషయాలు వెల్లడించాడు. “కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం, సొంతిల్లు ఉన్నప్పటికీ.. పోటీ ప్రపంచంలో పిల్లలు రాణించలేకపోతున్నారు. వారికి మంచి భవిష్యత్తు లేదని బాధ కలుగుతోంది. ఈ నేపథ్యంలోనే వారిని చంపి నేను కూడా చనిపోతున్నాను” అని కిశోర్ ఆ లేఖలో రాశాడు. రీసెంట్ గానే కిశోర్ తన పిల్లలను స్కూల్ మార్చించినట్లు బంధువులు వెల్లడించారు.
అటు చంద్ర కిశోర్ తమ్ముడు తన అన్నయ్యకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని చెప్పాడు. ఆస్తులు కూడా బాగానే ఉన్నట్లు చెప్పాడు. తను ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని చెప్పాడు. అటు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ మొదలు పెట్టారు. త్వరలోనే ఈ ఘటనకు సంబంధించి అసలు విషయాలు బయటకు వస్తాయని వెల్లడించారు.
Read Also: వెంటాడి.. వేటాడి.. కత్తులతో నరికి, కర్నూలులో టీడీపీ నేత దారుణ హత్య!