Karimnagar Youth Suicide: కరీంనగర్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కడారి శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి కుటుంబ కలహాలతో విసిగి, తన చావుకు భార్య, అత్తతోపాటు కరీంనగర్ మహిళా పోలీస్ స్టేషన్ సీఐ కారణమని ఆరోపిస్తూ.. సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఘటన పూర్తి వివరాలు
కడారి శ్రావణ్ కుమార్ గత కొన్ని నెలలుగా.. భార్యతో విభేదాలు ఎదుర్కొంటున్నాడు. ఈ కుటుంబ కలహాల నేపథ్యంలో.. పోలీస్ స్టేషన్‌లో పలు ఫిర్యాదులు, కేసులు నమోదు అయినట్లు సమాచారం. అయితే ఈ కేసుల వ్యవహారంలో తనను అన్యాయంగా ఇరికించారని శ్రావణ్ ఆరోపించాడు. మహిళా పోలీస్ స్టేషన్ సీఐతో కలిసి భార్య, అత్త తనపై అకారణంగా ఒత్తిడి తెచ్చారని, ఏకపక్షంగా కేసులు పెట్టి వేధించారని తెలిపాడు.
ఈ నేపథ్యంలో శ్రావణ్ కుమార్ తన మొబైల్‌లో సెల్ఫీ వీడియో తీస్తూ.. గడ్డి మందు తాగాడు. తాను చనిపోయిన తర్వాత నిజానిజాలు వెలుగులోకి రావాలని, తనపై జరిగిన అన్యాయానికి న్యాయం జరగాలని కోరాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆసుపత్రిలో మూడురోజుల పోరాటం
గడ్డి మందు తాగిన అనంతరం శ్రావణ్‌ను.. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ మూడు రోజులపాటు చికిత్స పొందిన అతను చివరకు మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
తల్లిదండ్రుల ఆవేదన – పోలీసులపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్
శ్రావణ్ కుమార్ తల్లి విలపిస్తూ.. నా కొడుకు తన ప్రాణాలు అర్పించినా, న్యాయం కోసం చివరి వరకు పోరాడాడు. ఆ సెల్ఫీ వీడియో చూస్తే ఏ తల్లి అయినా కన్నీళ్లు ఆపుకోలేరు. నా కొడుకు మరణానికి కారణమైన వారిని శిక్షించాలి అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఆమె కుమారుడు విడుదల చేసిన వీడియో ఆధారంగా బాధ్యులైన భార్య, అత్త, మహిళా పోలీస్ సీఐపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read: భర్త ఫోన్ దొంగలించేందుకు ఈ కిలాడీ లేడి ప్లాన్.. అసలు అందులో ఏముందో తెల్సా?
విచారణలో పోలీసులు
ఈ ఘటనపై కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ స్పందించింది. పూర్తి వీడియో ఆధారంగా విచారణ జరుగుతోందని, వీడియోలో పేర్కొన్న అన్ని అంశాలను పరిశీలించి, నిర్ధారణ అయినట్లైతే తగిన చర్యలు తప్పవని పేర్కొన్నారు. అలాగే, ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి.