Kerala SportsTeenager Rape Coaches Classmates | కేరళలో ఒక షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఒక టీనేజర్ బాలికపై అత్యాచారం ఘటనలో ఏకంగా 60 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ అమానవీయ ఘటన కేరళలోని పథనంథిట్ట జిల్లాలో జరిగింది. పోలీసులు టీనేజర్ పై గత రెండేళ్లుగా అత్యాచారం జరిగిందని శుక్రవారం జనవరి 11, 2025న కేసు నమోదు చేశారు.
వివరాల్లోకి వెళితే.. పథనంథిట్ట జిల్లాకు చెందిన ఒక బాలిక మానసికంగా బాధపడుతున్నట్లు కొన్ని రోజుల క్రితం ఆమె స్కూల్ టీచర్ గమనించారు. దీంతో ఆమెను పరామర్శించగా.. షాకింగ్ విషయాలు చెప్పింది. ఆ తరువాత ఆ స్కూల్ టీచర్ ఆమెను చైల్డ్ వెల్ఫేర్ కౌన్సిలింగ్ కు తీసుకెళ్లారు. అక్కడ ఆమె కౌన్సెలింగ్ సమయంలో తనపై జరిగిన దారుణ ఘటనల గురించి బయటపెట్టింది. ఆమె చెప్పిన దంతా నిజమేనని సైకాలజీ నిపుణులు చెప్పడంతో పోలీసులకు సమాచారం అందించారు.
ఇటీవలే ఆమెకు 18 సంవత్సరాలు పూర్తయ్యాయి. అయితే ఆమెపై గత రెండు సంవత్సరాలుగా పలువురు అత్యాచారం చేశారని తెలిపింది. బాధితురాలి గోడు విని చైల్డ్ వెల్ఫేర్ కార్యకర్తలు పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పథనంథిట్ట పోలీసులు అత్యాచారం, పోక్సో కేసులు నమోదు చేశారు. రెండు ఎఫ్ఐఆర్ లలో 60 మందిని నిందితులుగా చేర్చారు. వీరిలో అయిగురిని అరెస్టు చేయగా.. ఒకరు ఇప్పటికే మరో కేసులో జైళ్లో శిక్ష అనుభవిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read: అత్యాచారం ఫిర్యాదు చేయడానికి వెళ్లిన బాధితురాలు.. నిందితుడితో పెళ్లిచేసుకోమని చెప్పిన పోలీసులు
మిగతా నిందితులలో 40 మందిని గుర్తించామని .. వారి పేర్లు, ఫోన్ నెంబర్లు బాధితురాలి ఫోన్ ద్వారా సేకరించారు. అయితే బాధితురాలు స్కూల్, కాలేజీలో ఒక అథ్లెట్. ఆమె పలుమార్లు క్రీడా కార్యక్రమాల కోసం పలు జిల్లాలకు వెళ్లినప్పుడు ఆమెపై తోటి విద్యార్థులు, కోచింగ్ చేసేవారు కూడా లైంగిక వేధింపులకు పాల్పడ్డారని వెల్లడించింది. బాధితురాలైన యువతి.. తనకు 13 ఏళ్ల ప్రాయంలోనే తనపై మొదటి సారి అత్యాచారం జరిగిందని ఫిర్యాదులో పేర్కొంది. ఆ సమయంలో తన పొరుగింట్లో ఉన్న ఓ వ్యక్తి కొండల ప్రాంతానికి తనను తీసుకెళ్లి, అక్కడ స్నేహితులతో కలిసి తనపై అత్యాచారానికి ఒడిగట్టాడని వాపోయింది.
బాధితురాలికి అన్నివిధాలా అండగా ఉంటామని, కేసు దర్యాప్తు కొనసాగుతోందని.. ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ వెల్లడించింది. బాధితురాలిని ప్రస్తుతం షెల్టర్ హోంకు తరలించారు.