Wife Immolate Husband Kothakota Crime | వనపర్తి జిల్లా కొత్తకోటలో కాపురానికి రమ్మని భార్యను అడిగిన భర్త భయానకమైన రీతిలో హత్యకు గురయ్యాడు. అతడిని భార్య సజీవదహనం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఆత్మకూర్ మండలం పిన్నంచర్ల గ్రామానికి చెందిన గోటు మహేష్ (32) ఎనిమిదేళ్ల క్రితం సత్యహళ్లి గ్రామానికి చెందిన మహేశ్వరితో వివాహం చేసుకున్నాడు. వీరికి ఏడేళ్ల వయస్సు గల ఇద్దరు ఆడ కవల పిల్లలు ఉన్నారు. మహేష్ మేస్త్రి ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు.
కుటుంబ కలహాలు తారస్థాయికి చేరుకోవడంతో మహేష్ తాగుడుకు బానిసయ్యాడు. అప్పుల భారంతో అతను తొమ్మిది నెలల క్రితం హైదరాబాద్‌కు వెళ్లాడు. దీంతో మహేశ్వరి మాత్రం పిల్లలతో కలిసి సత్యహళ్లిలోనే తన పుట్టింట్లో ఉండిపోయింది.
ఇటీవల మహేష్ పిన్నంచర్లకు వచ్చి భార్య మహేశ్వరిని హైదరాబాద్‌కు తనతో కాపురానికి రావాలని కోరాడు. ఈ విషయంలో పెద్దలు మధ్యవర్తిత్వం చేసినప్పటికీ మహేశ్వరి ఒప్పుకోలేదు. తన భర్తతో కలిసి ఉండలేనని, విడాకులు తీసుకుంటానని తన తల్లిదండ్రులకు ఆమె స్పష్టం చేసింది. కానీ తల్లిదండ్రులు ఆమెకు నచ్చజెప్పి భర్త వద్దకు కొత్తకోట పంపించారు.
Also Read: హైదరాబాద్‌లో భారీ మోసం.. సొంత ఉద్యోగులే అమెజాన్‌కు టోకరా
నిద్రలోనే దారుణం
ఆదివారం మధ్యాహ్నం మహేష్ గాఢనిద్రలో ఉన్న సమయంలో మహేశ్వరి గుర్తుతెలియని రసాయనిక పదార్థం అతని పై జల్లి నిప్పంటించింది. తర్వాత మహేష్ సోదరుడు సురేష్‌కు ఫోన్ చేసి, తన భర్త నిప్పంటించుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడని తెలిపింది. తీవ్ర గాయాలపాలైన మహేష్‌ను స్థానికులు వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మహేష్ మృతిచెందాడు.
కానీ చనిపోయేముందు మహేష్ జరిగిన ఘటన గురించి తన తమ్ముడు సురేష్ కు చెప్పాడు. మహేష్ చెప్పినదంతా సురేష్ చాకచక్యంగా రికార్డ్ చేసుకున్నాడు. కానీ మహేష్ మరణించడంతో సురేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సురేష్ ఫిర్యాదు ఆధారంగా, మహేశ్వరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ఆనంద్ తెలిపారు. ఆధారాలు పరిశీలుస్తూ విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
ఇలాంటిదే మరో ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో జరిగింది. యూపిలోని కాన్పూర్ జిల్లా బితూర్ పట్టణంలో నివసించే షబానా(43) అనే మహిళ భర్త, ఇద్దరు పిల్లలు ఉంగానే ఆబిద్ అనే 24 ఏళ్ల యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త సంపాదనతో సంతృప్తి చెందని ఆమె.. నిద్రపోతున్న భర్త ఛాతిపై కూర్చొని గొంతునులిమి చంపేసింది. హత్య చేసే సమయంలో ఆమె ప్రియుడు కూడా ఆమెకు సాయం చేశాడు. అతను మృతుడి కాళ్లు గట్టిగా పట్టుకున్నాడు.
అయితే మరుసటి రోజు ఉదయం షబానా తన భర్త వయాగ్రా మాత్రలు ఎక్కువగా తిని చనిపోయాడంటూ ప్రచారం చేసింది. కానీ శవం మెడపై గుర్తులు చూసి స్థానికులు అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో విచారణలో షబానా వివాహేతర సంబంధం గురించి పోలీసులు తెలుసుకొని ఆమెను అరెస్టు చేశారు.
కుటుంబ బంధాల్లో పెరుగుతున్న ఘర్షణలు
ఈ విషాద ఘటన వ్యక్తిగత జీవితంలో కలహాలు ఎంత దారుణ పరిణామాలకు దారితీస్తాయో మరోసారి గుర్తుచేసింది. బంధాలను అర్థవంతంగా నడిపేందుకు సంయమనం, పరస్పర గౌరవం ఎంత ముఖ్యమో స్పష్టమవుతోంది.