Cyber Crime : హాయ్.. హలో.. అంటూ స్వీట్ స్వీట్‌గా మాట్లాడింది అనిత. ఆ హైదరాబాద్ అమ్మాయి మాటలకు నోయిడా అంకుల్ పడిపోయాడు. అనిత వెడ్స్ దల్జీత్‌సింగ్.. త్వరలోనే తమ షాదీ అని మురిసిపోయాడు. పెళ్లి, ఇల్లు, కాపురం.. అంటూ కలలు కన్నాడు. వారిద్దరూ ఓ డేటింగ్ యాప్‌లో పరిచయమయ్యారు. ఈ రియల్ స్టోరీలో స్టార్టింగ్ పార్ట్ రొమాంటిక్‌గానే సాగినా.. క్లైమాక్స్‌లో మాత్రం ట్విస్ట్ అదిరిపోయింది. దల్జీత్ సింగ్ రోడ్డున పడ్డాడు. సైబర్ నేరగాళ్లు ఎంత టాక్టీస్‌గా ట్రాప్ చేస్తారో.. ఎలా వలలో వేసుకుని.. పైసా వసూల్ చేస్తారో ఈ ఘటనతో మరోసారి తెలిసొచ్చింది. దల్జీత్ సింగ్ నుంచి ఏకంగా 6 కోట్లు కొట్టేసింది అనిత అలియాస్ సైబర్ క్రిమినల్. అసలేం జరిగిందంటే…
అతని వీక్‌నెస్.. ఆమెకు అడ్వాంటేజ్
ఢిల్లీలోని ఓ కంపెనీకి డైరెక్టర్‌గా ఉన్నాడు దల్జీత్‌సింగ్. భారీగా సంపాదన. ఎంత రిచ్ అయినా.. పక్కన పెళ్లాం లేని వెలితి ఎవరూ తీర్చలేనిది. అతనికి గతంలో డైవర్స్ అయ్యాయి. సెకండ్ మ్యారేజ్ కోసం ట్రై చేస్తున్నాడు. తెలిసిన వాళ్లకు చెబుతున్నాడు. మ్యారేజ్ బ్యూరోలో ప్రొఫైల్ అప్‌లోడ్ చేశాడు. కానీ నో యూజ్. మంచి పొజిషన్ ఉన్నా.. పిల్ల మాత్రం దొరకట్లేదు అతనికి. ప్రస్తుతం అమ్మాయిలకు అంత డిమాండ్ ఉంది మరి. ఇలా అయితే వర్కవుట్ అవదనుకున్నాడు. ఈసారి డేటింగ్ యాప్‌లో ట్రై చేశాడు. అదే తను చేసిన బిగ్ మిస్టేక్ అని ఆ టైమ్‌లో అతనికి తెలీదు.
డేటింగ్ యాప్ జోలికెళ్తే..
డేటింగ్ యాప్స్. ఆ ప్లాట్‌ఫామ్సే పెద్ద ఫేక్. అంతా ఫాల్స్ పీపుల్సే ఉంటారు. టైమ్‌పాస్ తిరుగుళ్లు.. కోరికలు తీర్చుకునే బ్యాచ్‌లకు కేరాఫ్ ఈ డేటింగ్ యాప్స్. ఓ కంపెనీకి డైరెక్టర్‌గా ఉన్న దల్జీత్‌సింగ్ సైతం అలా చీప్ యాప్ చెరకు చిక్కాడు. చాటింగ్‌లో.. హాయ్, హౌ ఆర్ యూ, ఐయామ్ ఇంట్రెస్టెడ్ ఆన్ యూ.. అంటూ అనిత అనే అందమైన యువతి మనోడికి టచ్‌లోకొచ్చింది. తనది హైదరాబాద్ అని చెప్పింది. ఇంకో సింగ్ సొల్లు కార్చాడు. మాటలు కదిపాడు. మనసులు కలిశాయి. కొన్నాళ్లలోనే ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. క్లోజ్‌నెస్ పెరిగాక.. అనిత తన అసలు పని మొదలుపెట్టేసింది.
ట్రేడింగ్ చేస్తే లాభాలంటూ ట్రాప్
తాను స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చేస్తుంటానని.. బాగా డబ్బులు వస్తాయని.. నువ్వు కూడా చేయమంటూ దల్జీత్ సింగ్‌ను బాగా ఎంకరేజ్ చేసింది అనిత. అప్పటికే ఆమె మోజులో పూర్తిగా కూరుకుపోయిన అతను.. సరే నేనూ ట్రై చేసి చూస్తానన్నాడు. అనిత ఓ మూడు వెబ్‌సైట్ల పేర్లు చెప్పింది. ఆమె మాటల ప్రకారం.. ఆయా సైట్లతో ఓ 3 లక్షలు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశాడు. ఇలా డబ్బులు పెట్టాడో లేదో.. గంటల గ్యాప్‌లోనే 20 వేలకు పైగా ప్రాఫిట్ వచ్చింది. వెంటనే తన అమౌంట్ మొత్తం వేరే అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు దల్జీత్ సింగ్. అనిత ఐడియాకు ఫిదా అయ్యాడు. తనకంటే అనితనే తెలివైనదని నమ్మాడు. అదేగా ఆ కిలాడీ లేడీకి కావాల్సింది. 20 వేలకే ఇంత హ్యాపీ అయితే ఎలా.. నీ దగ్గరున్న సేవింగ్స్ పెట్టు ఇంకా మంచి లాభాలు వస్తాయంటూ ఊరించింది. అతనూ సరే అన్నాడు. అన్నే్ళ్లలో అతను సంపాదించి కూడబెట్టుకున్న 4.5 కోట్లను ఒకేసారి ఆయా వెబ్‌సైట్ల నుంచి మార్కెట్లో ఇన్వెస్ట్ చేశాడు. మరో 2 కోట్లు లోన్ కూడా తీసుకుని అది కూడా అందులో పెట్టేశారు. అలా మొత్తం ఆరున్నర కోట్లు పెట్టుబడి పెట్టాడు. లాభాల కోసం చూస్తున్నాడు.
Also Read : ఆఫీస్ బాత్రూంలో వంట, నిద్ర.. పిసినారి పిల్ల..
ఆరున్నర కోట్లు.. చిటికెలో మాయం
కట్ చేస్తే.. తన 6.5 కోట్లు అలానే కనిపిస్తున్నాయి. ప్రాఫిట్ రావట్లేదు. లాభం లేకపోతే ఇంకెందుకని అనుకున్నాడు. విత్‌డ్రా కొడితే.. కేవలం 30శాతం మాత్రమే వెనక్కి తీసుకోవచ్చని స్క్రీన్ మీద చూపించింది. తనకు మొత్తం అమౌంట్ కావాల్సిందేనని కస్టమర్ కేర్ కు కాల్ చేసి కంప్లైంట్ చేశాడు. 24 గంటల తర్వాత ట్రై చేయండని చెప్పడంతో మర్నాడు ఆ వెబ్‌సైట్స్ మళ్లీ ఓపెన్ చేశాడు. ఈసారి అందులో విత్‌డ్రా ఆప్షనే లేదు. ఆ మూడు సైట్లు డౌన్ అయ్యాయి. అవి ఫేక్ అండ్ ఫ్రాడ్ సైట్స్ అని దల్జీత్ సింగ్‌కు అర్థమైపోయింది. వెంటనే సైబర్ క్రైం పోలీసులకు కంప్లైంట్ చేశారు. కేసు నమోదు అయింది.
అనితా ఓ అనితా..
అనిత మీద డౌట్ వచ్చింది దల్జీత్‌కు. పోలీసులకు ఆమె గురించి చెప్పాడు. డేటింగ్ యాప్‌లో ఆమె ఇచ్చిన ప్రొఫైల్‌ను చెక్ చేస్తే అది ఫేక్ అని తేలింది. దల్జీత్ సింగ్ హార్ట్ బ్రేక్ అయింది. అనిత పోతే పోనీ.. డబ్బులు అయినా తిరిగి రప్పించండని పోలీసులను రిక్వెస్ట్ చేస్తున్నాడు. పోయిన పైసలు.. అంత ఈజీగా వస్తాయా? అసలే సైబర్ నేరగాళ్లు.. ఎక్కడ ఉంటారో.. ఎలా ఉంటారో కూడా తెలీదు. అనిత రూపంలో సైబర్ ట్రాప్‌కు ఇలా ఓ రిచ్ పర్సన్ అప్పుల పాలయ్యాడు. సింగ్ ఈజ్ కింగ్‌లాంటి వాడే.. ఇప్పుడు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాడు. సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త.. క్షణాల్లో డబ్బులు రెట్టింపు అవుతాయని చెబితే నమ్మకండి.. తెలీని లింకులు, వెబ్‌సైట్ల జోలికి వెళ్లకండి.. అంటూ రోజూ ఫోన్ కాల్ చేసినప్పుడల్లా కేంద్రం వాయిస్ మెసేజ్‌తో హెచ్చరిస్తున్నా.. ఆ మెసేజ్‌ను ఎవరైనా పూర్తిగా వింటేగా? పట్టించుకుంటేగా? అందుకే సైబర్ నేరగాళ్లు ఏదోఒక రూపంలో దోచుకుపోతూనే ఉన్నారు..ఉంటారు కూడా. మనం అలర్ట్‌గా లేకపోతే అంతే సంగతి. తస్మాత్ జాగ్రత్త.