Mancherial District Road Accident : సంక్రాంతి రోజు సొంతూరిలో గడుపుదాం అనుకున్న ఆ కుటుంబం ఆనందాన్ని.. తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం చెల్లా చెదురు చేసింది. తెల్లవారితే అమ్మమ్మ, తాతయ్యలతో ఆనందంగా గడుపుదామనుకున్న ఓ చిన్నారి కలను ఛిద్రం చేసింది. ఆనందంగా గడవాల్సిన రోజు.. జీవితంలో మర్చిపోలేని చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. హైదరాబాదులో ఉద్యోగ హడావుడిని కాసేపు పక్కన పెట్టి ఊరికి వెళ్దాం అంటూ బయలుదేరిన ఆ కుటుంబానికి అదే చివరి సంతోషకర ప్రయాణమైంది. ఈ ఘటన మంచిర్యాలలోని జరగగా.. ఓ మహిళ అక్కడికక్కడే చనిపోయింది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
మంచిర్యాల జిల్లా కాగజ్ నగర్ కు చెందిన అక్కు రాజు హైదరాబాద్ లో మెకానికల్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. ఏడాదంతా ఉద్యోగ హడావుడిలో బిజీగా గడిపే రాజు.. తన భార్య రేణుక, కుమారుడితో కలిసి సొంతూరుకి ప్రయాణమయ్యాడు. పండుగకు ఇంటి దగ్గర సరదాగా గడపాలని, ఉత్సాహంగా తెల్లవారుజామున బయలు దేరారు. తెల్లవారితే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందని ముందుగానే బయలుదేరిన ఆ కుటుంబానికి ఆ సమయమే మృత్యువుగా మారుతుందని ఊహించలేదు.
రాజు తన భార్య, బిడ్డలతో కలిసి ఊరికి వెళుతుండగా.. ఇంకా కొన్ని కిలోమీటర్ల దూరంలో సొంతూరుకు చేరుకునే వారు. ఇంతలోనే.. బెల్లంపల్లి ప్రాంతానికి చేరుకున్నాక గంగారం నగర్ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు బలంగా ఢీకొట్టింది. దాంతో.. కారు లారీని ఢీకొట్టడంతో లారీ వెనక భాగంలో కారు ఇరుక్కుపోయింది.
ఈ ప్రమాదంలో కారు ముందు కూర్చున్న అక్కు రాజు భార్య రేణుక అక్కడికక్కడే మృతి చెందింది. రాజుకు తీవ్ర గాయాలయ్యాయి. తల్లిదండ్రులిద్దరు రక్తపు మడుగులో కూరుకుపోగా, వెనక కూర్చున్న బాలుడు మాత్రం సురక్షితంగా భయపడ్డాడు. ప్రమాదాన్ని గమనించిన.. ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించటంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. రేణుక మృత దేహాన్ని కారు నుంచి బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన రాజును స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రోడ్డు పక్కన ఆపిన లారీని కారు తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ఢీకొట్టినట్లు తెలిపారు.
Also Read : గేదెల కోసం సీసీ పుటేజ్ వెతుకులాట.. ముగ్గురు దుర్మార్గుల అత్యాచారం సంగతి బట్టబయలు..
సంఘటన స్థలంలో కారు భాగాలు చల్లాచెదురుగా పడిపోయి ఉన్నాయి. ఈ దృశ్యాలు అక్కడ ప్రమాద తీవ్రతను తెలుపుతున్నాయి. కాగా.. ఈ ప్రమాదంపై మంచిర్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరికొద్ది సేపట్లో మనువడితో కలిసి కొడుకు, కోడలు ఇంటికి వస్తారని ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులకు.. ప్రమాదం వార్త తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యారు సరదాగా గడుపుదామనుకున్న ఇష్టమైన వారి మృతదేహం.. ఇంటికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవరి వల్లా కావడం లేదు.