Nampally pocso case : మద్యం మత్తులో కన్నకూతురిపైనే అత్యాచార యత్నం చేయడం, కత్తితో పొడిచి హత్య చేసేందుకు ప్రయత్నించిన కేసులో ఓ దుర్మార్గుడికి నాంపల్లిలోని పోక్సో కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో తన వాదన వినిపించేందుకు బాలిక ఒంటరిగానే పోరాటం చేసిన తీరు.. న్యాయమూర్తిని, న్యాయవాదుల్ని సహా అక్కడ ఉన్న వారందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎవరు సహాయం చేసినా, ఎవరు తనకు అన్యాయం చేసినా.. చివరి వరకు న్యాయ స్థానంలో పోరాడిన ఈ బాలిక.. చివరికి కోర్టులో గెలిచింది. తనపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించిన.. కన్న తండ్రిని కటకటాల్లోకి పంపగలిగింది.
నేపాల్ నుంచి వలస వచ్చి హైదరాబాద్ లోని నాంపల్లిలో నివాసం ఉంటోంది ఓ కుటుంబం. కుటుంబ పెద్ద నిత్యం తాగి వస్తుండడంతో, ఇంట్లో వాళ్లపై అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉండే వాడు. 2023లో ఓ రోజు.. ఆ కామాంధుడు తన్న కూతురిపైనే లైగింక దాడికి ప్రయత్నించాడు. తల్లి ఇంట్లో లేని సమయంలో ఆ బాలికపై అత్యాచారానికి ప్రయత్నించాడు. ఆమె తప్పించుకునేందుకు ప్రయత్నిస్తే.. కత్తితో దాడి చేశాడు. ఈ విషయమై బాలిక.. తన తల్లికి మరుసటి రోజు చెప్పడంతో.. తల్లీ కూతురు కలిసి ఆ దుర్మార్గుడిపై పోలీసు కేసు పెట్టారు. ఇద్దరు వెళ్లి దోమల్ గూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
బాలిక ఫిర్యాదుతో కఠినమైన సెక్షన్లు నమోదు చేసిన పోలీసులు.. బాలికపై జరిగిన దారుణానికి పోక్స్ చట్టం కింద కేసు నమోదు చేశారు. దాంతో.. ఈ కేసు నాంపల్లిలోని పోక్సో కోర్టులో విచారణ ప్రారంభమైంది. అత్యంత దారుణమైన పని చేసిన ఆ దుర్మార్గుడినికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని బాలిక గట్టిగానే ప్రయత్నించింది. ఆమెకు అప్పటి వరకు తల్లి సైతం తోడుగా నిలిచింది. కానీ.. విచారణ సమయంలో బాలిక తల్లి ప్లేటు ఫిరాయించింది. తన భర్తను జైలుకు పంపించేందుకు నిరాకరిస్తూ.. సాక్ష్యం చెప్పేందుకు ఒప్పుకోలేదు. అప్పటి వరకు తన కూతురికి న్యాయం చేయాలంటూ బ్రతిమిలాడిన తల్లి.. అప్పటికప్పుడే భర్త వైపునకు వెళ్లిపోయింది. దీంతో.. బాలిక ఒక్కతే ఒంటరి పోరాటం సాగించాల్సి వచ్చింది.
నేపాల్ నుంచి వలస వచ్చి నగరంలో పని మనిషిగా.. జీవనోపాధి పొందుతున్న ఈమె.. తన భర్తను జైలుకు పంపేందుకు నిరాకరించింది. న్యాయమూర్తి ఎదుట, పోలీసులు తనతో బలవంతంగా తప్పుడు ఫిర్యాదు చేయించుకున్నారని, తనకు తెలియని విషయాన్ని తెలుసని రాయించుకున్నారంటూ తప్పించుకునే ప్రయత్నం చేసింది. అయితే, తన కుమార్తెపై.. తన భర్త, బాలిక తండ్రి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని.. కుమార్తెతో కలిసి ఫిర్యాదు చేసిన లెటరు, ఆమె గతంలో ఇచ్చిన వాంగ్మూలంలో తనకు ఆ విషయం తెలుసు అని స్పష్టంగా చెప్పడాన్ని కోర్టు పరిగణలోకి తీసుకుంది.
ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు నిందితుడు అనేక రకాలుగా కోర్టును సాక్ష్యాలు సమర్పించేందుకు ప్రయత్నించాడు. విచారణ సమయంలో తాను నపుంసకుడని, తాను ఎలా అత్యాచారానికి పాల్పడతానంటూ వెల్లడించాడు. అలాగే.. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో దాడి ఎలా జరిగిందో అమ్మాయి పేర్కొనలేదని వాదించాడు. ఇంట్లో గృహ హింస సమస్య ఉందని, దానిని తన కుటుంబం తనపై తప్పుడు కేసు నమోదు చేయడానికి ఉపయోగించుకుందని నిందితుడు ఆరోపించారు.
Also Read : Hyderabad Crime: హైదరాబాద్‌లో దారుణం.. పట్టపగలు నడిరోడ్డుపై అడ్వకేట్ దారుణహత్య
కేసు పుర్వాపరాలు పరిశీలించిన కోర్టు.. అమ్మాయి తన సొంత తండ్రిపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేయవలసిన అవసరం లేదని అభిప్రాయపడింది. తల్లి ఇచ్చిన ఫిర్యాదు, గతంలో ఇచ్చిన వాగ్మూలాన్ని పరిశీలించి.. ప్రస్తుతం ఆమె చెబుతున్న తెలియదు అనే విషయాన్ని కావాలని చెబుతున్నట్లుగా ఉందని అభిప్రాయపడ్డ కోర్టు.. ఈ కేసులో మరింత మందిని విచారించింది. కేసులో భాగంగా.. 11 మంది సాక్షులు, 14 ఎగ్జిబిట్‌లు, మూడు సాక్ష్యాధారాల్ని పరిశీలించిన కోర్టు.. బాలిక ఆరోపిస్తున్నట్లుగా ఆమెపై లైంగిక దాడి, వేధింపులు, హత్యాయత్నం జరిగాయని నిర్థరించింది. దాంతో.. నిందితుడైన తండ్రికి జీవిత ఖైదు విధించిన నాంపల్లిలోని పోక్సో కోర్టు.. బాలికకు 2 లక్షల పరిహారం చెల్లించాల్సిందిగా ఆదేశించింది.