Niloufer Hospital Kidnap Case: నిలోఫర్ ఆస్పత్రిలో చిన్నారి కిడ్నాప్ కేసు సుఖాంతమైంది. ఆరుగంటల్లోనే నాంపల్లి పోలీసులు చిన్నారి ఆచూకీని కనుగొన్నారు. జహీరాబాద్ జిల్లాకు చెందిన హసీనా బేగం, గఫార్ దంపతులు తమ చిన్నారికి జాండిస్ రావడంతో నాంపల్లిలోని నిలోఫర్ ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చారు. కాగా ఆస్పత్రిలో ఓ మహిళ వచ్చి తాను సిబ్బందిని అని చెప్పి తల్లి వద్ద నుండి తీసుకుని ఎత్తుకుంది. మాయ మాటలు చెప్పి అక్కడ నుండి తీసుకుని వెళ్లింది.
Also read: స్టైల్ మార్చిన అఘోరీ.. న్యూటర్న్ తీసుకొని శ్రీనివాస్‌గా మారబోతున్నాడా?
ఎంతసేపు ఎదురుచూసినా బాబును తీసుకురాకపోవడంతో ఆందోళన చెందిన తల్లి అక్కడి సిబ్బందిని సంప్రదించగా చిన్నారి కిడ్నాప్ అయినట్టు గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి చేరకుని విచారణ ప్రారంభించారు. కిడ్నాప్ తరవాత బాబును ఓమ్నీ వ్యానులో కర్నూలు వేపునకు తీసుకెళ్లినట్టు గుర్తించారు. వెంటనే జోగులాంబ గద్వాల జిల్లా పోలీసులకు సమాచారం ఇవ్వగా జిల్లాలోని ఎస్సైలకు సమాచారం ఇచ్చారు.
ఈ క్రమంలో ఉదయం టోల్ గేట్ వద్ద తనికీలు నిర్వహిస్తుండగా ముగ్గురు చిన్నారులను తీసుకువెళుతున్నట్టు గుర్తించారు. చిన్నారుల్లో ఓ అబ్బాయి మరో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ముగ్గురు కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని స్టేషన్ కు తరలించారు. కిడ్నాప్ అయిన చిన్నారిని హైదరాబాద్ తరలించి తల్లికి అప్పగించారు. దీంతో తల్లి దండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. జోగులాంబ, నాంపల్లి పోలీసులు కేవలం 6 గంటల వ్యవధిలోనే కిడ్నాపర్లను అదుపులోకి తీసుకుని, చిన్నారిని సురక్షితంగా అప్పగించడంతో ఉన్నతాధికారులు వారిని అభినందించారు.
ఇదిలా ఉంటే గతంలోనూ ఆస్పత్రుల్లో చిన్నారుల కిడ్నాప్ ఘటనలు చోటు చేసుకున్నాయి. అప్పటి వరకు తల్లి వద్దనే ఉన్న చిన్నారులను గద్దల్లా వచ్చి కిడ్నాపర్లు మాయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తల్లి దండ్రులు ఆస్పత్రులకు వెళ్లినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా చిన్నపిల్లల ఆస్పత్రుల వద్ద ప్రభుత్వం నిఘా ఏర్పాటు చేసి ఇతరులు ఆస్పత్రిలోకి రాకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.