Tirumala Laddu Adulteration: తిరుమల లడ్డు వ్యవహారం వివాదాలకు తావిచ్చిన విషయం తెలిసిందే. లడ్డులో కలిపే నెయ్యిలో కల్తీ జరిగిందని సాక్షాత్తు సీఎం చంద్రబాబు ఆరోపించారు. దీనితో ఈ వ్యవహారం దేశ వ్యాప్త చర్చకు దారి తీసింది. ఈ వివాదం కేంద్రంగా అన్ని పార్టీల మధ్య విమర్శలు కూడా జోరుగా సాగాయి. ప్రధానంగా వైసీపీ లక్ష్యంగా కూటమి పార్టీలు విమర్శలు చేయగా, వాటిని వైసీపీ నేతలు కూడా అదే రీతిలో తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. చివరకు లడ్డు వ్యవహారంలో నిజాన్ని నిగ్గు తేల్చేందుకు, రాష్ట్ర ప్రభుత్వం తరపున సిట్ విచారణ కూడా సాగింది.
ఈ తరుణంలో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి లడ్డు వివాదంపై సుప్రీం కోర్టును ఆశ్రయించారు. విచారణల అనంతరం రాజకీయాల కోసం కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేయవద్దని సుప్రీం కోర్టు ఆదేశించింది. అనంతరం సుప్రీం కోర్టు ప్రత్యేక సిట్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇది ఇలా ఉండగా లడ్డు వివాదంపై జనసేన పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టడం, ఆ తరువాత అలిపిరి నుండి కాలినడకన శ్రీవారిని పవన్ దర్శించుకున్నారు.
అనంతరం జరిగిన తిరుపతి వారాహి సభలో పవన్ చేసిన పలు కామెంట్స్ కూడా వివాదంగా మారాయి. ఆ కామెంట్స్ ఫలితంగా మధురైలో పవన్ పై కేసు నమోదు కాగా, పవన్ ను ట్రోలింగ్ చేస్తున్న పలువురు తమిళులపై ఏపీలో జనసేన నాయకులు ఫిర్యాదుల పరంపర సాగించారు. అలాగే ప్రకాష్ రాజ్ వర్సెస్ పవన్ కళ్యాణ్ ల వివాదం కూడా లడ్డు వ్యవహారంలోనే రేగింది. ఇన్ని వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం యావత్ దేశాన్ని గడగడ లాడించింది.
చివరకు సుప్రీం కోర్టు ప్రత్యేక విచారణ కమిటీ వేయగా, అంతా సైలెంట్ అయ్యారు. ఈ తరుణంలో నూతన సిట్ అధికారులు తమ విచారణ వేగవంతం చేయగా, మరోమారు ఈ వ్యవహారం వార్తల్లో నిలిచింది. తాజాగా తమిళనాడు దిండిగల్ లోని ఏఆర్ డైయిరీలో సిట్ అధికారులు తనిఖీల పర్వాన్ని సాగిస్తున్నారు. అందుకు ప్రధాన కారణం లడ్డు తయారీకి సంబంధించి కల్తీ నెయ్యి సరఫరా ఆరోపణలు ఎదుర్కొంటోంది ఏఆర్ డెయిరీనే.
తిరుపతి లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ముమ్మరం..
తమిళనాడు దిండిగల్ లోని ఏఆర్ డైయిరీలో సిట్ అధికారుల తనిఖీలు
ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లి తనిఖీలు చేపట్టిన 11 మంది సిట్ అధికారులు@TTDevasthanams @APPOLICE100#TirumalaLaddu #SITEnquiry #ARDiary #BigTV pic.twitter.com/muTCh23Yza
— BIG TV Breaking News (@bigtvtelugu) November 24, 2024
ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లిన 11 మంది సిట్ అధికారులు తనిఖీలు చేపట్టడంతో, ఈ వ్యవహారం అసలు విషయం బయటకు వెళ్లడయ్యే సమయం ఆసన్నమైందన్న చర్చ జోరందుకుంది. టీటీడీ ఛైర్మన్ గా బీఆర్ నాయుడు భాద్యతల స్వీకరణ తర్వాత లడ్డు పవిత్రతను కాపాడడంలో తాము వెనుకాడబోమని ఇప్పటికే ప్రకటించారు. మొత్తం మీద అసలు కల్తీ జరిగిందా లేదా అనే విషయం వెల్లడి కావాలని యావత్ హిందూ సమాజం కోరుకుంటోంది.