Pregnent women : తమిళనాడులో మరో షాకింగ్ విషయం వెలుగు చూసింది. రైలులో ఒంటరిగా ప్రయాణిస్తున్న ఓ గర్భవతి అయిన మహిళపై అత్యాచారానికి ప్రయత్నించాడో దుండగులు. ఆమె ప్రతిఘటించడంతో కదులుతున్న రైలు నుంచి ఆమెను కిందకి తోసేశాడు. ఈ ఘటన కోయంబత్తూర్ నుంచి తిరుపతికి వస్తున్న ఇంటరి సిటీ రైలులో చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసుపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఫిబ్రవరి 6న రాత్రి వేళ.. తమిళనాడులోని కోయంబత్తూర్ నుంచి చిత్తూరు జిల్లాలోని తిరుపతికి వస్తున్న ఇంటర్ సిటీ రైలులోని మహిళల కోచ్ లోకి ఓ వ్యక్తి ప్రవేశించాడు. జోలార్‌పేట్ రైల్వే స్టేషన్లో ఆ యువకుడు బోగీలో ఎక్కడగా, మొత్తం మహిళలే ఉన్నారు. అతడిని గమనించిన ఓ మహిళ అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆ యువకుడిని కోరింది. ఈ విషయమై.. వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి 9:00 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. వారి వాగ్వాదం తర్వాత ఆ మహిళను వెంబడించి వాదన పెట్టుకున్న యువకుడు.. గొడవను పెద్దది చేశాడు. గొడవ జరుగుతుండగానే.. ఆ మహిళ టాయిలెట్ కి వెళ్లింది. అక్కడ కూడా ఆమెను అనుసరించిన ఆ యువకుడు.. తలుపు దగ్గర మరోసారి వారి మధ్య వాగ్వివాదం జరగగా.. నిందితుడు మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడని తెలుస్తోంది. ఆపై ఆమెపై లైంగికంగా దాడికి పాల్పడ్డాడు. అతని చర్యతో ఒక్కసారిగా బోగిలో గందరగోళం నెలకొంది. అతని ప్రవర్తనతో బాధిత మహిళ ఒక్కసారిగా కేకలు వేసింది. తనను కాపాడాలంటూ పెద్దగా కేకలు వేసింది. దాంతో.. కంగారు పడిపోయిన నిందితుడు.. కదులుతున్న రైలు నుంచి ఆమెను కిందకి తోసేశాడు. ఈ ఘటన కేవీ కుప్పం దగ్గర జరిగినట్లు తెలుస్తోంది.
ఈ సంఘటనను గమనించిన రైల్వే రెస్క్యూ బృందాలు బాధిత మహిళను కాపాడారు. తీవ్రంగా గాయపడిన ఆమెను రక్షించి.. కేవీ కుప్పం పోలీసులకు, అత్యవసర సేవలకు సమాచారం అందించారు. ఆమెను ప్రథమ చికిత్స కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం.. ఆమెను వెల్లూరు ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. కదులుతున్న రైలు నుంచి కిందకు తోసేయడంతో.. ఆమె చెయ్యి, కాలు విరిగినట్లు వైద్యులు నివేదించారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. బాధితురాలు, ఇతర ప్రయాణికుల నుంచి సమాచారం సేకరించారు. నిందితుడిని హేమరాజుగా గుర్తించారు.
నిందితుడి కోసం గాలింపు చేపట్టిన రైల్వే పోలీసులు.. కాట్పాడి రైల్వే స్టేషన్‌లో హేమరాజ్‌ను అరెస్టు చేశారు. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసు.. అసలు వారిద్దరి మధ్య ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాగా.. నిందితుడిపై గతంలో కొన్ని కేసులు ఉన్నట్లు గుర్తించారు. రైళ్లల్లో సెల్ ఫోన్ దొంగతనాలు, రైలు ప్రయాణికులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలు ఉన్నాయని, ఆయా ఘటనల్లో యువకుడిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు గుర్తించారు. కేవీ కుప్పం పోలీసులు, రైల్వే పోలీసులతో కలిసి ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టారు. మరిన్ని ఆధారాల కోసం రైలు, రైల్వే స్టేషన్లలోని సీసీ టీవీ పుటేజ్ లను పరిశీలిస్తున్నారు.
Also Read :
కాగా.. బాధితురాలు నాలుగు నెలల గర్భవతి అని, ఆమె ప్రస్తుతం వైద్యుల పరిశీలనలో ఉందని పోలీసులు వెల్లడించారు. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు నిందితుడిపై హత్యాయత్నం, లైంగిక వేధింపులు సహా ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.