Principal cuts Student Hair| ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ విద్యార్థులకు శిక్షణ విధించే క్రమంలో హద్దులు దాటేశాడు. స్కూల్‌కు లేటుగా వచ్చినందుకు అమ్మాయిల జడలు కట్ చేయించారు. అంతటితో ఆగక వారందరినీ ఎండలో నిలబెట్టారు. ఈ క్రమంలో ఒక విద్యార్థిని స్పృహ తప్పి పడిపోయింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో ప్రభుత్వ యంత్రాంగం సీరియస్ అయింది. ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. అల్లూరి సీతారామరాజు జిల్లా జి మాడుగులలో కస్తుర్బా గాంధీ బాలికా విద్యాలయ (కెజిబివి)లో నవంబర్ 15, 2024న ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుకుంటున్న విద్యార్థినులు 18 మంది ఉదయం ప్రతిజ్ఞకు ఆలస్యంగా వచ్చారు. పైగా మరో 5 మంది గైర్హాజరయ్యారు. దీంతో ఆగ్రహం చెందిన స్కూల్ ప్రిన్సిపాల్ సాయిప్రసన్న లేటుగా వచ్చినవారందరినీ ఎండలో నిలబెట్టారు. అంతటితో ఆగక మధ్యాహ్నం అందరి జడలు కట్ చేయించారు.
Also Read: దాగుడు మూతలు ఆడుతూ యువకుడి హత్య.. ప్రియురాలు అరెస్ట్
దీంతో బాధిత విద్యార్థినులు ఈ విషయం తమ తల్లిదండ్రులకు తెలియజేయగా.. వారందరూ ప్రిన్సిపాల్ నిర్వాకంపై మండల విద్యాధికారి బాబూరావుకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా ద్వారా కూడా ఈ ఘటన గురించి పోస్ట్ లు వైరలయ్యాయి. దీంతో సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. జిల్లా కలెక్టర్ కూడా స్కూల్ ప్రిన్సిపాల్ సాయిప్రసన్నను వెంటనే సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
అయితే ఈ ఘటనపై ప్రిన్సిపాల్ సాయిప్రసన్న వివరణ ఇచ్చారు. విద్యార్థినులు తరగతి గదులకు సమయానికి రాకుండా హాస్టల్ లోనే జుట్టు విరబూసుకొని తిరుగుతున్నట్లు తెలిసిందని.. అందుకే క్రమశిక్షన చర్యగా వారి జడలు కొద్దిగా కట్ చేయించినట్లు చెప్పారు. కానీ ఎంఈవో బాబురావు ఆమె వివరణపై సంతృప్తి చెందలేదు. క్రమశిక్షణ కోసం జడలు కట్ చేయాల్సిన అవసరం లేదని.. విద్యార్థినులను మందలించడం.. లేదా ఇతరాత్రా శిక్షలు వేయడం చేయాలని అన్నారు. పైగా ఎండలో నిలబడిన ఒక విద్యార్థిని స్పృహ తప్పపోవడంపై ఆయన సీరియస్ అయ్యారు.
ఇలాంటిదే ఘటన కొన్ని వారాల క్రితం మధ్య ప్రదేశ్ లో జరిగింది. ఆ రాష్ట్రంలో ఒక టీచర్ మద్యం సేవించి విద్యార్థిని స్కూల్ కు లేటుగా వచ్చిందని ఆమె జడను కట్ చేశాడు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో వీడియో వైరల్ కూడా అయింది. ఆ వీడియోలో అమ్మాయి ఏడుస్తూ కనిపించింది. ఈ ఘటన సెమల్ ఖేడీ ప్రాంతంలోని ఒక ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ లో జరిగింది. మద్యం సేవించి స్కూల్ కు వచ్చింనందుకు ఆ టీచర్ ని సస్పెండ్ చేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల పనితీరు సరిగా లేదని చాలాకాలంగా వార్తల్లో కథనాలు వస్తూనే ఉన్నాయి. అక్టోబర్ లో కూడా ఇలాంటి ఘటన జరిగింది. ఒక మహిళా టీచర్ తరగతి గదిలో పడుతకొని విద్యార్థుల చేత తన వీపుకు మసాజ్ చేయించుకుంటున్న ఒక వీడియో వైరల్ అయింది. మహిళా టీచర్ క్లాస్ రూంలో పడుకొని ఉండగా.. ఇద్దరు విద్యార్థులు ఆమెకు మర్దన చేస్తున్న దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. ఒక విద్యార్థి ఆమె వీపుపై ఎక్కి కాలితో మర్దన చేస్తుండగా.. మరో విద్యార్థి అతను కిందపడకుండా చేయి పట్టుకున్నాడు. ఈ ఘటన రాజస్థాన్ రాజధాని జైపూర్ సమీపంలోని కర్తార్ పురాలో జరిగింది. వీడియో వైరల్ కావడంతో ఆ టీచర్ ను సస్పెండ్ చేశారు.