Students Kill Principal| మధ్యప్రదేశ్ లో ఓ దారుణ ఘటన జరిగింది. ఒక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడిని అక్కడ చదువుకునే ఇద్దరు విద్యార్థులు తుపాకీతో కాల్చిచంపారు. అంతేకాదు హత్య తరువాత ఇద్దరూ మృతదేహం పక్కనే ఉండి డాన్సులు చేశారు. ఆ తరువాత ధైర్యంగా అక్కడి నుంచి వెళ్లి దొంగతనం చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ఛత్తర్ పూర్ లో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఛత్తర్ పూర్ నగరం ధమోరా ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రిన్సిపాల్ సురేంద్ర కుమార్ సక్సేనా శుక్రవారం డిసెంబర్ 6, 2024న హత్య జరిగింది. స్కూల్ లో ఉదయం తరగతి వేళల్లో ప్రిన్సిపాల్ బాత్ రూమ్ కు వెళ్లినప్పుడు ఇద్దరు విద్యార్థులు ఆయన వెనకాలే బాత్ రూమ్ వద్దకు వెళ్లి తుపాకీతో కాల్పులు జరిపినట్లు సమచారం. పోలీసులు వెంటనే స్కూల్ చేరుకొని విచారణ ప్రారంభించారు.
Also Read: పక్కింటి యువకుడితో పడుకున్న యువతి.. గది నుంచి ఆర్తనాదాలు.. డబుల్ మర్డర్
ఘటనా స్థలానికి స్వయంగా పోలీస్ సూపరింటెండ్ ఆగమ్ జైన్ కూడా వచ్చారు. ఆయన ప్రాథమిక విచారణ పూర్తి చేసి మీడియాతో మాట్లాడారు. “ఉదయం స్కూల్ లో తరగతులు జరుగుతున్నప్పుడు మృతుడు.. స్కూల్ ప్రిన్సిపాల్ బాత్ రూమ్ కోసమని వెళ్లారు. అదే సమయంలో ఇద్దరు 12వ తరగతి విద్యార్థులు .. ఇద్దరికీ దాదాపు 16 సంవత్సరాలు వయసు ఉంటుంది. వారి వద్ద తుపాకీ కూడా ఉన్నట్లు తేలింది. ప్రిన్సిపాల్ బాత్రూమ్ వెళ్లగానే ఆయనను ముందు నుంచి గమనిస్తున్న ఇద్దరు విద్యార్థులు వెనకాలే వెళ్లి తుపాకీతో రెండు సార్లు కాల్పులు జరిపారు. కాల్పులకు ప్రిన్సిపాల్ అక్కడికక్కడే మృతి చెందారు.
ప్రిన్సిపాల్ మరిణించినట్లు ధృవీకరించుకుని ఇద్దరు విద్యార్థులు ప్రిన్సిపాల్ మృతదేహం వద్ద డాన్సులు చేశారు. ఆ తరువాత అక్కడి నిందితులిద్దరూ ప్రిన్సిపాల్ గదికి వెళ్లి అక్కడ ప్రిన్సిపాల్ స్కూటర్ తాళాలు తీసుకొని బయటికి వస్తుండగా.. స్కూల్ లో చదువుకునే ఇద్దరు అమ్మాయిలు వారిని చూశారు. దీంతో ఇద్దరు నిందితులు వెంటనే అక్కడి నుంచి ప్రిన్సిపాల్ స్కూటర్ తీసుకొని పారిపోయారు. ఈ ఘటన మొత్తం సిసిటీవి కెమెరా ద్వారా రికార్డ్ అయింది. సిసిటీవి వీడియోని ఆధారాలుగా స్వాధీనం చేసుకున్నాం. ఇద్దరు నిందితులెవరో గుర్తించడం జరిగింది. వారిని పట్టుకోవడానికి పోలీసుల బృందం ఇప్పటికే బయలుదేరింది. నిందితులకు తుపాకీ ఎవరిచ్చారు? అనే అంశం కూడా పరిశీలిస్తున్నాం. పైగా స్కూల్ లో నిందితులకు ఎవరో సహాయం చేసినట్లు అనుమానాలున్నాయి. హత్యకు కారణాలు ఇంకా స్పష్టం కాలేదు. విచారణ కొనసాగుతోంది.” అని చెప్పారు.
మరోవైపు గురువారం డిసెంబర్ 6, 2024న బిహార్ రాజధాని పట్నాలో ఒక కిరాణా షాపు ఓనర్ ని పట్టపగలు తుపాకీతో కాల్చి చంపారు. పట్నా పొరుగునే ఉన్న అబ్దుల్లాపూర్ గ్రామంలో ఉదయం కిరాణా షాపు ఓనర్ రాజ్ కిషోర్ సింగ్ (64) రోజూ లాగే షాపులో కూర్చొని ఉండగా.. ఇద్దరు దుండగులు బైకుపై వచ్చి ఒక్కసారిగా కిరాణాషాపుపై తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తుపాకీ బుల్లెట్లు కిరాణా షాపు ఓనర్ రాజ్ కిషోర్ సింగ్ శరీరంలోకి దూసుకుపోయాయి. ఆయన అక్కడికక్కడే చనిపోయాడు. దుండగులిద్దరూ ఘటనా స్థలం నుంచి కాల్పులు చేసిన తరువాత పారిపోయారు. స్థానిక పోలీసులు విచారణ ప్రారంభించారు. దాడి చేసిన ఇద్దరు ఎవరనేది ఇంకా స్పష్టం కాలేదు.