Crime News: వరుసగా విద్యార్థుల ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. చిన్న చిన్న విషయాలకే మనస్థాపం చెంది తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు. స్కూల్‌లో టీచర్లు మందలించడమో.. డిప్రెషన్, చదువు ఒత్తిడి, ప్రేమ వ్యవహారం.. కారణాలేమైనా వరుసగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా.. హైదరాబాద్ కూకట్‌పల్లి పీఎస్ పరిధిలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. 17 అంతస్తుల భవనం పైనుంచి దూకి వెంకట లాస్య ప్రియ అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. గురువారం రాత్రి ఈ ఘటన జరినట్లు తెలుస్తోంది. అడ్డగుట్టలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో బాలిక 9వ తరగతి చదువుతుంది.
కేపీహెచ్‌బీ కాలనీ ఓ అపార్ట్‌మెంట్‌లోని 17వ అంతస్తులో నివాసముంటున్నట్లు బాలిక తండ్రి తెలిపాడు. గురువారం స్కూల్‌లో పేరెంట్స్, టీచర్ మీటింగ్ జరిగిందన్నాడు. సరిగా చదవడం లేదని.. ఏకాగ్రత పెట్టడం లేదంటూ టీచర్స్ చెప్పినట్లు తెలిపాడు. ఇంటికొచ్చాక టీచర్ మందలించిన విషయాన్ని బాలిక తనతో చెప్పిందన్నాడు. బాగా చదువుకోవాలని బాలికకు సూచించానని.. అనంతరం బాలిక తన గదిలోకి వెళ్లిపోయిందని పేర్కొన్నాడు.
రాత్రి పదిన్నర సమయంలో గేటెడ్ కమ్యూనిటీ అధ్యక్షుడు తనకు ఫోన్ చేసి మొదటి అంతస్తుకు రావాలని చెప్పినట్లు తెలిపాడు. ఎందుకని అడిగినా చెప్పలేదన్నారు. దీంతో తనకు సందేహం వచ్చి బాలిక గది డోర్ కొట్టగా లోపలి నుంచి లాక్ చేసి ఉందన్నారు. మరొక తాళంతో తెరవగా గదిలో బాలిక లేదన్నారు. వాష్ రూమ్‌లో కిటికీ తెరిచి ఉన్నట్లు గుర్తించామన్నారు. వెంటనే మొదటి అంతస్తుకు వెళ్లి చూడగా తన కూతురి డెడ్‌బాడీ ఉందన్నారు. 17వ అంతస్తు నుంచి దూకడంతో బాలిక ఎడమ కాలు విరిగి పడి ఉంది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వారం క్రితం మియాపూర్‌లోనూ 10వ తరగతి విద్యార్థిని బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మియాపూర్‌లోని జనప్రియ అపార్ట్‌మెంట్‌లో జరిగింది. తలకు బలమైన గాయాలు కావడంతో ఘటనా స్థలంలోనే విద్యార్థిని మృతి చెందింది.
కొన్ని నెలల క్రితం షాద్‌నగర్‌లోనూ టెన్త్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రిన్సిపాల్ మందలించాడని స్కూల్ బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గతనెల సూర్యాపేట జిల్లా మునగాల మండలంలో టెన్త్ విద్యార్థిని తనూష.. క్లాస్ రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో ఓ యువకుడి వేధింపులు భరించలేక కేజీబీవీ విద్యార్థిని ఇంట్లో ఉరివేసుకుని చనిపోయింది.
Also Read: షాడో సీఎంగా మీనాక్షి!
విద్యార్థుల ఆత్మహత్యలపై గతనెల 25న సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భావిపౌరుల మరణాలు వ్యవస్థాపక వైఫల్యాలుగా జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం అభివర్ణించింది. విద్యార్థుల ఆత్మహత్యల నిరోధానికి పలు మార్గదర్శకాలను జారీ చేసింది. మానసిక ఒత్తిడి, చదువు భారం, సామాజిక వివక్ష, విద్యాసంస్థల తీరు వంటి కారణాలతో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పేర్కొంది. ఇది వ్యవస్థాపక వైఫల్యాన్ని సూచిస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. విద్యార్థుల్లో మానసిక ఆరోగ్య సమస్యలు తీవ్రమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఆత్మహత్యల నివారణకు పలు సూచనలు చేసింది. ఆయా అంశాలను 90 రోజుల్లో అమలు చేసేలా అఫిడవిట్ సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.