Supari Killers Murder Son| భార్య చేసిన పనితో తనకు అవమానం జరిగిందని భావించిన ఓ వ్యక్తి ఆమెను హత్య చేసేందుకు నిర్ణయించుకున్నాడు. అయితే ఆమెన చంపేందుకు కొందరు కిరాయి హంతకులను సంప్రదించాడు. వారితో డీల్ మాట్లాడుకున్నాడు. అయితే చివరి నిమిషంలో డబ్బుల విషయంలో కిరాయి హంతకులతో గొడవ జరిగింది. దీంతో ఆ హంతకులు తమతో గొడవ పడిన ఆ వ్యక్తి కొడుకుని హతమార్చారు. ఈ ఘటన దేశంలో నేరాలు ఎక్కువగా జరిగే ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నో పోలీసులు ఇటీవల నలుగురు యువకులు.. శివం రావత్ (20), శివ రావత్ (20), అమిర్ ఆలం (22), ఆశీష్ కుమార్ (21) ను అరెస్టు చేశారు. వీరంతా కిరాయి హంతకులని పోలీసులు తెలిపారు. స్థానికంగా నివసించే వినాయక్ సాహు అనే యువకుడిని ఈ నలుగురు కలిసి కత్తులతో పొడిచి చంపారు. నిజానికి ఈ నలుగురు కిరాయి హంతకులను ఇంతకుముందు ఒక మహిళను చంపమని వినాయక్ సాహు, అతని తండ్రి అంజని కుమార్ సాహు సంప్రదించారు.
పోలీసుల కథనం ప్రకాం.. అంజని కుమార్ సాహు (48) అనే వ్యక్తికి 25 ఏళ్ల క్రితం శాంతి అనే మహిళతో వివాహం జరిగింది. వీరిద్దరి కుమారుడే వినాయక్ సాహు (24). అయితే కొన్ని నెలల క్రితం శాంతి సాహు తన భర్త, కుమారుడిని వదిలేసి వెళ్లిపోయింది. ఆమె ఇమ్రాన్ అనే యువకుడితో ప్రేమలో పడింది. ప్రస్తుతం ఆమె అతడితో సహజీవనం చేస్తోందని తెలసింది. దీంతో ఆమె భర్త అంజని కుమార్ సాహు, కొడుకు వినాయక్ సాహుకు అవమానంగా భావించారు. అందుకే ఆమెను చంపేయాలని కుట్ర చేశారు. ఇందులో భాగంగానే కిరాయి హంతుకులైన శివం, శివ, అమిర్, ఆశీష్ లను సంప్రదించారు.
Also Read: మత్తుమందిచ్చి మహిళలతో ఆ పని చేసే దొంగబాబా.. యువతుల లోదుస్తులు దోచుకునే టెకీ
ముఖ్యంగా హత్య చేయడానికి వినాయక్ సాహు వారిని పిలిచి తన తల్లి, ఆమె ప్రియుడు ఇమ్రాన్ ఇద్దరినీ చంపేయాలని చెప్పాడు. ఈ పని చేసేందుకు వారికి రూ.2.5 లక్షలు, ఒక ఆటో రిక్షా ఇస్తానని చెప్పాడు. ఇందుకోసం అతని తండ్రి అంజని కుమార్ కూడా అంగీకారం తెలిపాడు. అయితే రెండు రోజుల తరువాత కిరాయి హంతకులు వారి పనిచేయడానికి అంగీకరించారు. మార్చి 5, 2025న నలుగురు కిరాయి హంతకులు మద్యం సేవించి ఉండగా.. వినాయక్ సాహుని పిలిచి తమకు అడ్వాన్స్ గా రూ.1.5 లక్ష చెల్లించాలని అడిగారు.
అయితే అందుకు అంజని కుమార్ ఒప్పుకోలేదు. కేవలం రూ.50 వేలు ఇస్తానని చెప్పాడు. కానీ కిరాయి హంతకులు ససేమిరా అన్నారు. తాము అడిగినంత ఇవ్వాల్సిందేనని బెదిరించారు. దీంతో యువకుడైన వినాయక్ సాహు వారితో ఘర్షణ పడ్డాడు. ఈ ఘర్షణలో నలుగురు కిరాయి హంతకులు కత్తులతో అతడిపై దాడి చేశారు. దీంతో వినాయక్ సాహు చనిపోయాడు. ఆ తరువాత అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటన తరువాత అంజని కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు వినాయక్ సాహు శవాన్ని పోస్ట్ మార్టం కోసం తరలించారు. మృతుని మెడలో ఒక కత్తి అలాగే ఉండిపోయింది.
ఆ తరువాత పోలీసుల ప్రత్యేక బృందం సిసిటీవి కెమెరాలు పరిశీలించి వారిని గుర్తించారు. వారంతా నగరంలోని మెట్రో సిటీ అండర్ పాస్ వద్ద మద్యం సేవిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు వారిని పట్టుకున్నారు. అయితే వారంతా తమ నేరం అంగీకరిస్తూ.. ఈ ఘటనలో అంజని కుమార్ తన భార్యను హత్య చేసేందుకు తమకు సుపారీ ఇచ్చినట్లు చెప్పారు. దీంతో పోలీసులు అంజని కుమార్ ని కూడా అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.